దళితబంధు పథకం ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో బర్నింగ్ టాపిక్..! ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత పొలిటికల్ తెరపైకి వచ్చిన ఈ అంశం.. అంతా అనుకున్నట్టే ఉపఎన్నికలో కీలకంగా మారింది. విమర్శలు.. ఆరోపణలే కాదు.. చర్చ.. రచ్చ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మరి.. పార్టీలు ఆశిస్తున్నట్టు ఉపఎన్నికపై ప్రభావం ఉంటుందా?
కీలక అంశంగా మారిన దళితబంధు..!
ఈ నెల 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్. ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రధానపార్టీల హోరాహోరీ పోరువల్ల నియోజకవర్గంలో ఎటు చూసినా సందడే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జెండాలతో పార్టీల శ్రేణులు గల్లీలలో ఓట్లు రాబట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ ప్రచార స్పీడ్ ఎలా ఉన్నా.. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక మొత్తం దళితబంధు చుట్టూ తిరుగుతోంది. ఈ అంశం ఎంత వరకు ఉపఎన్నికను ప్రభావితం చేస్తుందో ఏమో.. చూస్తుండగానే కీలక అంశంగా మారిపోయింది. దళితబంధు మాట లేకుండా ప్రసంగాలు.. విమర్శలు లేవు.
ఈసీ ఆదేశాల తర్వాత మరింత రచ్చ..రచ్చ..!
ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే హుజురాబాద్‌లో దళితబంధు స్కీమ్‌ను అట్టహాసంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. బైఎలక్షన్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నది విపక్షాల వాదన. బైఎలక్షన్ కాగానే ఆపేస్తారని బీజేపీ, కాంగ్రెస్ ఇతర విపక్షపార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు అధికారపార్టీ ఖండిస్తూ వచ్చింది. ఎప్పుడో ఏడాది క్రితం అనుకున్న పథకమే దళితబంధుగా చెబుతోంది టీఆర్ఎస్. నియోజకవర్గంలోని కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు డబ్బులు పడ్డాయి కూడా. అయితే ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు పథకం నిలిపివేయాలని EC ఆదేశాలివ్వడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది.
హుజురాబాద్‌లో ఎస్సీ సామాజికవర్గాల ఓటర్లు 46 వేలు..!
దళితబంధు పథకం అమలు నిలిపి వేయించింది బీజేపీయే అని టీఆర్‌ఎస్ ఆరోపిస్తుంటే.. కాదు.. ఆ పనిచేసింది అధికారపార్టీయే అన్నది కమలనాథుల ఆరోపణ. ఈ విషయంలోనే రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. సవాళ్లు.. ప్రమాణాలతో మాటల తూటాలు పేల్చుతున్నారు నాయకులు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల వరకు ఓటర్లు ఉంటే.. వీరిలో ఎస్సీ సామాజికవర్గ ఓటర్ల సంఖ్య 46 వేల వరకు ఉంది. దళితబంధు పథకం ఈ వర్గాలను ఆకట్టుకుందని..గెలుపు తీరాలకు తీసుకెళ్తుందని గులాబీ శ్రేణులు లెక్క లేస్తున్నాయి.
ఇతర కుల సంఘాలను బుజ్జగించారా?
ఇక్కడ ఇంకో విషయం ఉంది. బీసీ ఓటర్లు లక్షకుపైగా ఉన్నారు. దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన వెంటనే మా సంగతేంటి అని బీసీ సామాజికవర్గాలు గొంతెత్తాయి. బీసీ బంధు కోసం డిమాండ్ చేశాయి. సమస్య శ్రుతి మించితే మొదటికే మోసం వస్తుందని అనుకుందో ఏమో.. బీసీలలో వ్యతిరేకత రాకుండా.. కుల సంఘాలతో మాట్లాడి బుజ్జగించారు అధికారపార్టీ నేతలు. దళిత బంధు పథకంపై ఇతర వర్గాలలో వ్యతిరేకత రాకుండా చర్యలు తీసుకుంటున్న సమయంలోనే.. ఈ స్కీమ్‌ను ఆపాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలు మొత్తం రాజకీయ వాతావరణాన్ని మార్చేశాయి. మరి.. ఈ అంశం ఉపఎన్నికను ఏ మేరకు ప్రభావితం చేసిందో తెలియాలంటే నవంబర్ 2 ఫలితాల వరకు ఆగాల్సిందే..!