Munugode TRS : రెండు పార్టీల అభ్యర్థులు ఫైనల్ అయ్యారు.టియ్యారెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.కారు పార్టీ మునుగోడు అభ్యర్థిని ప్రకటించటానికి ఎందుకు ఆలస్యం చేస్తోంది?అభ్యర్థిని ప్రకటిస్తే వచ్చే రియాక్షన్స్ అంచనాలు వేసుకుంటోందా?స్థానిక నాయకత్వం నుంచి అందే సహకారంపై సందేహాలున్నాయా?
మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది.గెలుపు కీలకంగా మారటం ఒకటైతే, అభ్యర్థులు, అసమ్మతులు కూడా భారీగానే ఉన్నాయి.
బిజెపి అభ్యర్థిపై ఆ పార్టీలో ఎలాంటి సమస్య లేదు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ బరిలో ఉన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించింది. మూడు కీలక పార్టీల్లో ఇద్దరు అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. దీంతో టియ్యారెస్ సంగతేంటనే చర్చ మొదలైంది. టిఆర్ఎస్ అభ్యర్ధి విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ, ఎందుకు ప్రకటించటం లేదనేది ఒక ప్రశ్న. దానికి సమాధానంగా అభ్యర్థి ప్రకటన తర్వాత మునుగోడులో చోటుచేసుకునే పరిణామాలపై గులాబి పార్టీ లెక్కలేసుకునే పనిలో ఉందనే టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్ధులు ఖరారు కావడంతో, వీలైనంత తొందరగా అభ్యర్ధిని ప్రకటించాలని టిఆర్ఎస్ భావిస్తోందట. అభ్యర్ధి ప్రకటన ఇంకా ఆలస్యం చేస్తే, అది ఉప ఎన్నికలో ప్రతికూల అంశంగా మారే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారట. అయితే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు అయినట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలిసిన ఆశావహులు గతంలో కంటే ఇప్పుడు మునుగోడు నియెజకవర్గంలో యాక్టివిటీని తగ్గించారట.
మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల పేరు వినిపించగానే క్యాడర్ లో కొంత మంది ఆయన్ని వ్యతిరేకించారు. దీంతో పార్టీ ముఖ్యనేతలు వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం కూడా చేసారు. ఈ ప్రయత్నాలతో మునుగోడు గులాబి పార్టీలో గందరగోళం సద్దుమణిగిందని టిఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ, కూసుకుంట్లకు ఎంత వరకు సహకరిస్తారన్న అనుమానాలు పోలేదు. ఎందుకంటే, ఇలాంటి అసంతృప్తులు గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
మరోవైపు బూర నర్సయ్య గౌడ్ కూడా స్వరం పెంచారు. దీంతో ఆశావహుల తీరు టిఆర్ఎస్ కు సవాల్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల మధ్య, అభ్యర్దిగా కూసుకుంట్లను ప్రకటిస్తే మునుగోడు టిఆర్ఎస్ లో రియాక్షన్ ఎలా ఉంటుందనే అంచనా వేసే పనిలో టిఆర్ఎస్ నేతలున్నారట.
అభ్యర్ధి ప్రకటన తర్వాత ఒక వేళ అసంతృప్తి వ్యక్తం అయితే ముందుగా బుజ్జగించాలని, అవసరమైతే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారట. మరి అభ్యర్ధి ప్రకటన తర్వాత మునుగోడు టిఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.