రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారం చేపట్టిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్‌ది ప్రతిపక్ష పాత్ర. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ అనేకమంది నాయకులు ఎన్నికల సమయంలోనూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హ్యాండిచ్చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకొనే పనిలో ఉంది. అయితే రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది. జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలకు నేతలు కరువైయ్యారు. అనేక ఆటుపోట్ల మధ్య డీసీసీ అధ్యక్షులను నియమించారు. నియోజకవర్గ ఇంఛార్జిల ఎంపికలో గందరగోళమే. కాంగ్రెస్ ఇటీవల పిలుపిచ్చిన పోరాటాలకు, నిరసనలకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దగా స్పందన లేదు.
అసెంబ్లీ ఎన్నికల వరకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తరువాత సీన్ మారిపోయింది. ప్రతీ జిల్లాలో పట్టుమని పదిమంది పేరుమోసిన నాయకులు లేరు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే హవా. అధికారంతోపాటు ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో.. చివరకు నాయకులూ వెళ్లిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఒక ఎంపీ తప్ప.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా లేరు. కొన్ని సెగ్మెంట్లకు ఇంఛార్జిలు లేకపోవడంతో ఒక్కో నేత రెండు మూడు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఇన్‌ఛార్జులతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్‌ది. తాండూరు, మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ బలంగానే ఉంది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, చేవెళ్లకు చెందిన నాయకులు గాయబ్. ఇక్కడ పరిస్థితిపై గాందీభవన్ వర్గాల్లోనే సెటైర్లు పేలుతున్నాయి. ఒకప్పుడు పదవుల కోసం ఢిల్లీ దాకా లాబీయింగ్ చేసిన నేతలు… ఇప్పుడు పదవిస్తామంటే ధైర్యంగా ముందుకు రావడం లేదట. మరి.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.