హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?
జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా?
మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. అక్కడ ఆయన రేపిన సెగ రాష్ట్రమంతా రాజుకుంది. ఇదే సమయంలో జోగి దూకుడు వెనక అసలు కారణం అదే అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందట.
నిరసనపై పార్టీకి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారా?
ఎమ్మెల్యే జోగి రమేష్ హడావిడి చూశాకా.. ‘నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది’ అనే సినిమా డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారట కొందరు నేతలు. సీఎంపైన, హోంమంత్రి సుచరితపైనా అయ్యన్న చేసిన కామెంట్స్‌ను వైసీపీ శ్రేణులు ఖండించాయి. అంతా ఒక లైన్‌లో వెళ్తే.. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాత్రం మాటలకు పరిమితం కాకుండా ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీకి, పార్టీలోని ఇతర నేతలకు సమాచారం ఇవ్వకుండా తన నిరసనపై గోప్యత పాటించారట. చివరకు చంద్రబాబు ఇంటికి జోగి చేరుకోవడం.. అక్కడ టీడీపీ నేతలు అడ్డుకోవడం.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం.. పోలీసులకు పోటాపోటీ ఫిర్యాదులు.. ఒకరోజంతా మీడియాలో హడావిడి సాగింది. పార్టీ సర్కిళ్లలోనూ జోగి పేరు బాగా నానింది కూడా.
మోపిదేవి, పిల్లి బోస్‌లు రాజ్యసభకు వెళ్లినప్పుడూ హడావిడి!
ఈ హడావిడి వెనక జోగి రమేష్ మంత్రి పదవి రేస్‌లో ఉండటమే కారణమని సీరియస్ టాక్ నడుస్తోంది. ఆ మధ్య అసెంబ్లీ వేదికగా కూడా ఆయన అదుపుతప్పి మాట్లాడారు. వెంటనే అలర్ట్ అయిన సీఎం జగన్.. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జోగికి చిట్టీ రాసి పంపాల్సి వచ్చింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపినప్పుడు కేబినెట్‌లో ఆ రెండుబెర్తులు ఖాళీ అయ్యాయి. ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించే అవకాశం ఏర్పడినప్పుడు సైతం జోగి విపరీతంగా లాబీ చేశారని టాక్. అప్పుడూ ఇలానే ప్రతి కార్యక్రమంలో ఆయన హడావిడి కనిపించేది.
కేబినెట్‌లో చోటు కోసం జోరు పెంచారా?
రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని.. నాడు సీఎం జగన్ చెప్పారు. కొత్త వారికి అవకాశం ఇస్తానని తెలిపారు. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో రెండున్నర ఏళ్ల గడువును మూడేళ్లకు పెంచుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. పైగా 80 శాతం మంత్రులను ఎన్నికల టీమ్‌గా ఉపయోగించుకోనున్నట్టు హింట్ ఇచ్చారు సీఎం. ఆ విషయం తెలుసుకున్న జోగి రమేష్.. జోరు పెంచినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి బీసీ కోటాలో మంత్రి పదవి ఖాయమని జోగివర్గం లెక్కలేసుకుంటోంది.
జోగి ట్రిక్కులను సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటారా?
ఎమ్మెల్యే జోగి రమేష్ తాజా హడావిడి ఎలా ఉన్నా.. ఇటువంటి ట్రిక్కులను సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటారా అన్నదే ప్రశ్న. ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? అదే జరిగితే..అధినేత దృష్టిలో పడేందుకు మరికొందరు నాయకులు.. జోగి రమేష్‌లా రచ్చ చేస్తే అసలుకే ఎసరు రాదా? అనే మరికొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సమాధానం కోసం కేబినెట్ ప్రక్షాళన వరకు ఆగాల్సిందే.