ఆ ఇద్దరికీ ఆమె రాఖీ కట్టింది. ఆ రాఖీ కట్టిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోలా ట్రోల్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఓ అస్త్రంగా చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఆ రాఖీ తెచ్చిన తంటాలేంటో ఇప్పుడు చూద్దాం.
సీతక్క రాఖీ కట్టిన ఫొటోలతో ట్రోలింగ్
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు సీతక్క. పీసీసీ చీఫ్‌కు బలమైన మద్దతుదారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో ఆమె చేరింది కూడా రేవంత్‌ను నమ్ముకునే. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత
సీతక్కకు కాంగ్రెస్‌లో మంచి ప్రాధాన్యం లభిస్తోంది. రాఖీ పండగ రోజున ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పీసీసీ చీఫ్‌కు కూడా రాఖీ కట్టారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. పీసీసీ చీఫ్ దగ్గరకు వచ్చి కుటుంబసభ్యుల మధ్య రాఖీ కట్టారు. వీటికి సంబంధించిన విజువల్స్, ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగమైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.
సీతక్క, రేవంత్‌లు చంద్రబాబు మనుషులే అని ప్రచారం!
రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక.. టీడీపీ కాంగ్రెస్ అని టీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. చంద్రబాబు దగ్గరుండి రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇప్పించారని.. కాంగ్రెస్‌ను వెనకుండి నడిపించేది చంద్రబాబేనని ఆరోపించారు. ఇప్పుడు ట్రోల్ అవుతున్న ఫొటోలకు కూడా అదేస్థాయిలో కామెంట్స్ పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సీతక్క, రేవంత్‌లు ఇద్దరూ చంద్రబాబు మనుషులే అని ప్రచారం చేస్తున్నారు కూడా. తెలంగాణలో చంద్రబాబు ఈ విధంగా చక్రం తిప్పాలని చూస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. కండువాలు మారొచ్చు కానీ.. నడిపించేది బాబే అని కామెంట్స్‌కు మరింత మసాలా దంచుతున్నారు.
ఎదుట పక్షాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్!
అసలే తెలంగాణ రాజకీయం వాడీవేడీగా ఉంటోంది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎదుట పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు.. ఉక్కిరి బిక్కిరి చేయడానికి సోషల్ మీడియా విభాగాలు కాచుకుని కూర్చుంటున్నాయి. ఫొటోలు.. వీడియోలు జత చేసి.. పదునైన విమర్శలు. .వ్యంగ్యాస్త్రాలు జోడించి విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియా సైనికులు. ఒకసారి చేతికి చిక్కితే అంతే అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు సీతక్క కట్టిన రాఖీలు కూడా అదే జాబితాలో చేరాయి.