హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్‌ఎస్ వ్యూహం మార్చిందా? ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టు ఎత్తుగడలు ఉండబోతున్నాయా? గుత్తగా గురిపెట్టడానికి ప్లాన్ సిద్ధమైందా? ఇంతకీ ఏంటా వ్యూహం? గులాబీ శిబిరం టార్గెట్ ఏంటి?
హుజురాబాద్‌లో మారిన టీఆర్‌ఎస్ వ్యూహం?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో అధికారపార్టీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సీనియర్ నాయకులు నియోజకవర్గాన్ని జల్లెడ పట్టినట్టుగా తిరుగుతున్నారు. ఉపఎన్నిక తేదీని ప్రకటించకపోయినా రేపోమాపో పోలింగ్ అన్నట్టుగా అక్కడ రాజకీయ పార్టీల హడావిడి ఉంటోంది. ఒకవైపు బీజేపీ తరఫున బరిలో దిగేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్.. ఇంకోవైపు అధికారపక్షం. ఈ రెండు శిబిరాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా వ్యూహాలు మార్చి.. ఎదుటి పక్షంపై పైచెయ్యి సాధించే పనిలో ఉన్నాయి.
read also : పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్..బోసిపోయిన వైజాగ్ !
ఇన్నాళ్లూ ఈటలపై గురిపెట్టిన టీఆర్‌ఎస్
హుజురాబాద్‌లో ఆత్మగౌరవ నినాదంతో పర్యటనలు చేస్తున్నారు ఈటల రాజేందర్. ఈటల అండ్ కో సైతం అదే నినాదంతో గ్రామాలను చుట్టేస్తున్నాయి. టీఆర్‌ఎస్ తరఫున నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ఈటలను నేరుగా గురిపెడుతూ విమర్శలు చేస్తున్నారు. ఈటల ఒకమాటంటే.. అధికార పక్షం నుంచి నలుగురైదుగురు కౌంటర్లు వేస్తున్నారు. అయితే.. ఇప్పుడు టీఆర్‌ఎస్ వ్యూహం మార్చుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈటల వెంట నడిచేవారిని ఆకర్షించడం ఒక ఎత్తు!
అంతర్గత సర్వేలు.. వివిధ నిఘా సంస్థల నుంచి టీఆర్‌ఎస్‌కు కొన్ని నివేదికలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతే గులాబీ శిబిరం వ్యూహం మారిందట. ఈటల టీఆర్‌ఎస్‌లో తొలి నుంచి కీలంగా ఎదిగిన నేత. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. అందుకే ఉపఎన్నికలో ఆయన్ని తేలికగా తీసుకోవడానికి సిద్ధంగా లేదు టీఆర్‌ఎస్. ఒకవైపు మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూనే.. ఇంకోవైపు ఈటలతో ఉన్న నేతలను ఆకర్షించే పనిలో ఉంది. అయితే ఇది కూడా హుజురాబాద్‌లో సరిపోదని గులాబీ పెద్దలు భావించారట. ఉపఎన్నిక కోసం సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
ఈటలకు సానుభూతి అందకుండా ఎత్తుగడ?
ఇకపై హుజురాబాద్‌లో బీజేపీపైనే టీఆర్‌ఎస్ విమర్శలు?
హుజురాబాద్‌లో ఈటలను ఢీకొట్టడమంటే.. ఆయనకు సానుభూతి అందకుండా చేయాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచనగా ఉందట. పదే పదే ఈటలను విమర్శిస్తే.. అది ఆయనకు ప్లస్ అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే ఈటల చేరిన బీజేపీపై ఇకపై గురిపెట్టాలని టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపిచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూనే గుత్తగా బీజేపీపైనే ఎక్కువ విమర్శలు చేయాలని అనుకుంటున్నారట. బీజేపీతోపాటు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌పై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సంజయ్ చేపట్టే పాదయాత్ర హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే అని మాటల దాడి మొదలుపెట్టింది. అలాగే హుజురాబాద్‌లో పర్యటిస్తున్న నాయకులు కూడా నియోజకవర్గ అభివృద్ధిపై ఎక్కువ మాట్లాడుతున్నారట.
బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్టుగా మారిన ఉపఎన్నిక చిత్రం!
మారిన వ్యూహంతో హుజురాబాద్‌లో ఇప్పటి వరకు ఈటల వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్టుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను సైతం ఇక్కడ అనుకూలంగా మలుచుకునేందుకు ఈ వ్యూహం సరిపోతుందనే లెక్కలు ఉన్నాయట. మరి.. ఉపఎన్నిక వరకు ఇదే ప్లాన్ అమలవుతుందో.. మరిన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.