సొంత జిల్లాలో మంత్రి ఒంటరయ్యారా? పార్టీ సీరియస్‌గా ఫైట్ చేస్తున్న అంశంలో మంత్రితో జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు కలిసి రాలేదా? ఏక్ నిరంజన్‌గానే కార్యక్రమం నడిపించేశారా? జిల్లాలో గ్రూపుల గోలపై పార్టీ వర్గాలకు క్లారిటీ వచ్చేసిందా? ఇంతకీ ఎవరా మంత్రి?
జిల్లాలో మంత్రితో కలిసిరాని ఎమ్మెల్యేలు
మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరికి వారుగా విడిపోయి గ్రూపులు కట్టారు. ఎప్పట్నుంచో జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదు. ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోలుపై వరస ఆందోళన కార్యక్రమాలకు పిలుపిచ్చింది పార్టీ అధిష్ఠానం. జిల్లా, మండల, నియోజకవర్గస్థాయిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నా.. మేడ్చల్ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్. ఎవరి కుంపటి వారిదే అన్నట్టు ఎవరి నిరసన వాళ్లదే. ఐక్యంగా పోరాటం చేసిన ఉదంతాలు లేవు.
అధికారపార్టీ నేతల మధ్య ఐక్యత నిల్..!
మేడ్చల్‌లో నిర్వహించిన నిరసనలో మంత్రి మల్లారెడ్డి లీడ్ తీసుకున్నారు. కానీ.. జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ ఆ శిబిరంలో కనిపించలేదు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుత్బుల్లాపూర్‌లో వివేకానంద గౌడ్, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, ఉప్పల్ భేతి సుభాష్‌రెడ్డి, మల్కాజ్‌గిరి మైనంపల్లి హన్మంతరావులు ఉన్నారు. నిరసన శిబిరంలో మల్లారెడ్డి ఒక్కరే సింగిల్‌గా యాక్షన్ చేశారు. జిల్లాలోని అధికారపార్టీ నేతల మధ్య ఐక్యత లేదన్న విమర్శలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి అక్కడి సన్నివేశాలు.
మంత్రిని అపరిచితుడిగా చూస్తున్న ఎమ్మెల్యేలు?
మంత్రి మల్లారెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఎమ్మెల్యేలు ఎవరూ మేడ్చల్ నిరసనకు రాలేదని టాక్. జిల్లాలోని ఏ ఎమ్మెల్యేతోనూ మంత్రికి సఖ్యత లేదని చెబుతారు. పైగా మల్లారెడ్డిని ఎమ్మెల్యేలంతా ఒక అపరిచితుడుగా చూస్తారట. మంత్రి ఎప్పుడెలా ఉంటారో తెలుసుకోవడం కష్టమన్నది ఎమ్మెల్యేల అభిప్రాయమట. ఈ విభేదాల గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం పలుమార్లు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేసింది. కానీ.. ఎవరిలోనూ మార్పు రాలేదు. ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై ఆధిపత్యం కోసం మంత్రి మల్లారెడ్డి ప్రయత్నిస్తారని.. అందువల్లే వాళ్లంతా దూరంగా ఉంటారని చెవులు కొరుక్కుంటారు.
పార్టీ జిల్లా అధ్యక్ష పదవి చేజారడంతో మల్లారెడ్డి కినుక
ఆ మధ్య టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. ఆ పోస్టులో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని కానీ.. కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డిలలో ఒకరిని కూర్చోబెట్టాలని మల్లారెడ్డి చూశారట. కానీ.. మల్లారెడ్డి కుటుంబానికి కాకుండా.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిని చేసింది అధిష్ఠానం. ఈ విషయంలో తన మాట చెల్లకపోవడంతో మల్లారెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలను తూతూ మంత్రంగా నడిపించేస్తున్నారట. అయితే తాజా ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డికి పక్కలో బల్లెంలా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం నిరసనలో పాల్గొన్నారు. మొత్తానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలతో జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఒంటరయ్యారన్న చర్చ మాత్రం జోరందుకుంది.