తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యేలు.. పాత నాయకులు మనుగడ కోసం పోరాటం చేస్తున్నారా? అసమ్మతి గళం వినిపిస్తున్నారా? కావాలనే పక్కన పెడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయా? పాత నేతల రహస్య భేటీలు ఎందుకుగుబులు రేపుతున్నాయి?
మనుగడ కోసం మాజీలు రోడ్డెక్కుతున్నారా?
గతంలో ఎన్నడు లేని కొత్త సంప్రదాయానికి తెలంగాణ బీజేపీ లో తెరలేచింది. ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ప్రస్తుతం సోదిలో లేకుండా పోయారు. తమను పట్టించుకోవడం లేదని వారంతా ఒక్కటవుతున్నారు. ఈ సమయంలో నోరు విప్పకపోతే భవిష్యత్ ఉండబోదని భావిస్తున్నారో ఏమో.. మనుగడ కోసం రోడ్డెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జిల్లాల వారీగా రహస్య సమావేశాలు
అసమ్మతి గళం అందుకున్న బీజేపీ వెటరన్ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, సీనియర్ నేతలు రాజేశ్వరరావు, నామోజీ, వెంకటరమణి, సుగుణాకర్‌రావు, చింతా సాంబమూర్తి తదితరులు ఉన్నట్టు పార్టీ వర్గాల టాక్. బీజేపీ తమను పట్టించుకోవడం లేదని… కావాలనే పక్కన పెడుతున్నారని భావిస్తున్న వీళ్లంతా ఇప్పటికే రహస్యంగా మూడుసార్లు భేటీ అయినట్టు తెలుస్తోంది. జిల్లాల్లో అసంతృప్తితో ఉన్న నేతలతో జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకున్నట్టు సమాచారం. అసమ్మతి నేతల ప్రయత్నాల వెనక బీజేపీ ఒకరిద్దరు ముఖ్య నాయకులు ఉన్నట్టు కాషాయ శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారు.
కావాలనే బీజేపీ నుంచి దూరం పెడుతున్నారని అనుమానం
కొత్త నీరు వచ్చాక పాత నీరు కొట్టుకుపోతుందన్న చందగా.. బీజేపీలోకి కొత్త నాయకులు వచ్చాక.. పాత నేతలను పట్టించుకునేవాళ్లు లేరు. వారికి ప్రాధాన్యం కూడా తగ్గింది. ఒకప్పుడు బీజేపీ అంటే ఒకరో ఇద్దరో నాయకులు గుర్తొచ్చేవారు. వాళ్లే కమిటీలలో ఉండేవారు. ఇప్పుడు పార్టీలో వారి ఊసు లేదు.. వారికి ప్లేసూ లేదు. బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వకపోవడంతో.. కేంద్ర కమిటీలోకి తీసుకుంటారని చాలా మంది లెక్కలు వేసుకున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గంలోనూ వెటరన్ కమలనాథులకు మొండిచెయ్యి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. ఆ మేరకు హామీ ఇచ్చే నాయకులే కరువయ్యారట. దీంతో తమను కావాలనే పార్టీకి దూరం పెడుతున్నారని అనుమానిస్తున్నారట.
రహస్య భేటీలపై ఢిల్లీ పెద్దలు సీరియస్..!
రహస్య భేటీల తర్వాత అసంతృప్త నాయకులంతా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వాళ్లు నిర్వహించిన పార్టీ బాధ్యతలు.. చేపట్టిన నామినేటెడ్ పోస్టులు చాలు. కొత్తవాళ్లు వచ్చాక వారికి ఛాన్స్ ఇస్తనే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీలోని మరో వర్గం వాదన. అసమ్మతి నేతల రహస్య సమావేశాల సంగతి.. బీజేపీ జాతీయ నాయకత్వం వరకు వెళ్లినట్టు సమాచారం. ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలు గురించి తెలిసి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. వెంటనే వేటు పడుతుందని సంకేతాలు పంపుతున్నారట. దీంతో సీక్రెట్ మీటింగ్రెస్ పెట్టుకున్నవాళ్లు ఎక్కడా బయట పడకుండా .. తెరవెనక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. మరి.. పాత.. కొత్త రగడను కమలనాథులు ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి.
.