ఏపి,తెలంగాణల మధ్య తాజా జలవివాదంలో వివిధ రాజకీయ పార్టీల ఆరోపణలు విచిత్రంగా వుంటున్నాయి. ఒకవైపున తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,శ్రీనివాసగౌడ్ వంటివారు వైఎస్‌రాజశేఖరరెడ్డి తెలంగాణకు రావలసిన నీటిని దోచుకున్నారంటూ దొంగలు రాక్షసుల భాషలో ధ్వజమెత్తారు. దీనిపై జగన్ ప్రభుత్వం నుంచి తీవ్రస్పందన లేదు గనక ఇదంతా మ్యాచ్‌ఫిక్సింగ్ అనీ లాలూచీ అనీ టిడిపినాయకులు ఆరోపించారు.తర్వాత ఎపిప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి వంటివారు స్పందించాక క్యాబినెట్ కూడా నిర్ణయాలు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో మన ప్రజలు వున్నారు గనక ఆలోచిస్తున్నామని అన్నట్టు వ్యాఖ్యలువచ్చాయి.
ఈ వివాదంపై ప్రధాని మోడీకి జలశక్తి మంత్రి షెకావత్‌కు జగన్ లేఖలు రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్ది రోజుల ముందే షెకావత్‌తో మాట్లాడటం ఆయన ఆదేశాల మేరకు కృష్ణా రివర్ వాటర్‌మేనేజిమెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి)రంగంలోకి రావడం జరిగిపోయింది.వాస్తవంలో గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి పాల్గొన్న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ఇరురాష్ట్రాలు అనుమతిలేని ప్రాజెక్టుల డిపిఆర్‌లు సమర్పించాలని నిర్ణయించారు, పోతిరెడ్డిపాడు రిజర్వాయరు సామర్థ్యం పెంచే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు) పరిశీలనకు ఎపి సహకరించడం లేదని కెఆర్‌ఎంబి చేసిన ఫిర్యాదుపై ఆ ప్రభుత్వం స్పందించింది. కరోనా కారణంగా గతంలో అధికారిని కేటాయించలేకపోయామని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పింది, ఎపి ఫిర్యాదుపై శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణకు లేఖ రాసింది.
read also : పెట్రో మంట.. పోరాటానికి రైతన్నల రెడీ
కాని రాయలసీమ లిఫ్ట్ అదనపు నీటిని తీసుకోవడానికి కాదని ఎపి,శ్రీశైలం ప్రాథమికంగా జలవిద్యుత్ ప్రాజెక్టు గనక ఆపనవసరం లేదనితెలంగాణ వైఖరి తీసుకున్నాయి. దీనిపైకేంద్రం ఎలా పరిష్కారం చేస్తుంది కెఆర్‌ఎంబి ఏం చెబుతుంది అనేది కీలకం కాగా ఈలోగా వృథాగా రాష్ట్రాల మధ్య ఆవేశాలు పెంచుకోవడం ఆరోపణలు చేసుకోవడం అవాంఛనీయం. ఇది చాలనట్టుగా టిడిపి కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ వైసీపీ తమ తమ రాజకీయాల కోణంలో మాటలు సంధిస్తున్నాయి. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనే టిడిపి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు నిజం కాదంటుందా? వారు పాలించినప్పుడు వివాదాలు రాలేదా? నాగార్జున సాగర్‌పై పోలీసులు తారసపడలేదా? హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అవసరాల కోసమే టిఆర్‌ఎస్ మంత్రులు ఇలా మాట్లాడుతున్నారనే వైసీపీ వివాదం తీవ్రతను తక్కువ అంచనా వేస్తున్నదా?
వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ పథకంపై గతంనుంచి చర్చ నడుస్తున్న మాట నిజం కాదా? రెండు రాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగా సుహృద్ధావ పూర్వకంగా వున్నప్పుడు జల వివాదంలోకి జనాల ప్రస్తావన తేవడమెందుకు? గతంలో కెసిఆర్ సీమ అవసరాలకు పెద్దన్నగా వుంటానన్నారని ఈపథకాన్ని కూడా ఆమోదించారని చెబుతున్నమాట నిజమైతే ఆ ఆధారాలతో మాట్లాడవచ్చు కదా? కొత్తగా టిపిసిసి పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి అయితే వైఎస్‌ను,చంద్రబాబు హయాంలో జరిగినదాన్ని సమర్థిస్తూకెసిఆర్ జగన్‌లపైనే విమర్శలు కేంద్రీకరించడానికి చాలా విన్యాసాలు చేస్తున్నారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రణాళిక ప్రగతిభవన్‌లోనే తయారైందంటున్నారు. అదేనిజమైతే ఆధారాలు చూపించడం మంచిది ఇప్పుడు ఎపి తెలంగాణల వాదోపవాదాలు బూటకం అంటూనే వైఎస్‌పై దాడికి ఎందుకు స్పందించడం లేదని సవాల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఎపిలో కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి వంటివారు ఎపి ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. కేంద్రంలో పాలక పక్షమైన బిజెపి కూడా రెండు రాష్ట్రాలలో రెండు రకాలుగా మాట్లాడుతూ రాజకీయం రక్తి కట్టిస్తున్నది.
తెలంగాణలో బండి సంజయ్ వంటివారు కెసిఆర్ భయపడుతున్నారని అంటుంటే ఎపిలో బిజెపి ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతున్నది, రాయలసీమ డిక్లరేషన్ చేసిన పార్టీ సీమకునీరిచ్చే ప్రాజెక్టు కోసం చొరవ చూపడం లేదు, తమాషా ఏమంటే కేంద్రంలోనూ ఇరు రాష్ట్రాల్లోనూ బిజెపి ఇలా ద్వంద్వ క్రీడ సాగిస్తుంటే ఎపి ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రధానికి లేఖ రాసి పరిష్కారం కోరుతున్నారు. నిజంగా కేంద్రమే గనక శ్రద్ధ చూపితే ఎపి తెలంగాణ విభజన వివాదాలు ఇంతకాలం ఎందుకు కొనసాగుతాయి? ఎపికి ప్రత్యేకహోదా నిధుల విడుదల వంటివి ఎందుకు మూలనపడతాయి? గతంలో నదీజలాలపై పూర్తి అవగాహనకు వచ్చినట్టు ప్రకటించిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూచుని మాట్లాడుకోవడం చర్చలతో పరిష్కరించుకోవడం బదులు కేంద్రం ప్రాజెక్టులు స్వాధీనం చేసుకోవాలని కోరడం అంటే జుట్టు చేతుల్లో పెట్టడమే కదా?