రాష్ట్రాల ఒత్తిడి, సుప్రీం కోర్టు అక్షింతలు అన్నిటినీ మించి దేశప్రజలలోపెరిగిన అసంతృప్తి కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ వాక్సిన్‌పై కొత్తప్రకటన చేయాల్సి వచ్చింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ 11 మంది బిజెపియేతర ముఖ్యమంత్రులకు లేఖ రాస్తూ వాక్సిన్ బాధ్యత ఖర్చు పూర్తిగా కేంద్రమే తీసుకునేలా ఒత్తిడి చేయాలని కోరారు. మామూలుగా మోడీతో సఖ్యతగా సానుకూలంగా వుండే ఒరిస్సాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎపి ముఖ్యమంత్రి జగన్ కూడా మరో భాషలోనైనా సరే కేంద్రం మొత్తం బాధ్యత తీసుకుంటే మంచిదని సూచించారు.తెలంగాణ మంత్రి కెటిఆర్ తాజాగా ఈవిషయమై విమర్శలు చేశారు. మరోవంక ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో వాక్సిన్ సమస్య కోవిడ్ నిరోధంలో వైఫల్యం వంటి అంశాలు బిజెపికి వ్యతిరేకంగా ప్రభావం చూపించాయని కూడా ఫలితాలు వెల్లడిరచాయి.ఆఖరుకు ఆరెస్సెస్ రంగంలోకి దిగి ప్రభుత్వంపై అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం ప్రారంభించింది, మోడీ ప్రభుత్వ మంత్రులు తలో వైపు నుంచి ఆయనను సమర్థించే ప్రకటనలు చేయడం మొదలెట్టారు.
ఇంత చేసినా క్షేత్రస్థాయిలో వాక్సిన్కొరత వెంటాడటం, కోవిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో లేని వ్యవహారమై పోవడం, ప్రైవేటు ఆస్పత్రులలో 1750 వరకూ వాక్సిన్ కోసం వెచ్చించాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. గ్రామసీమలలో వారికి పట్టణాలు నగరాలలో దిగువ శ్రేణి వారికి వాక్సిన్ అందని ద్రాక్ష కాగా పై తరగతుల వారే ఎక్కువగా పొందుతున్నారన్న భావం ఏర్పడిరది. కోవాక్సిన్ కోవిషీల్డ్ దేశంలోనే తయారైనా ఏప్రిల్ మే నెలల మధ్య వాక్సినేషన్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. కోవిషీల్డ్ ఆరు కోట్ల డోసులు కోవాక్సిన్ రెండున్నర కోట్ల డోసులు ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చాయన్నారు. తర్వాతి కాలంలో కోవాక్సిన్ ఏడాదికి కోటిన్నర డోసులు పెంచుతున్నట్టు ప్రకటించింది. కాని మే నెల నాటికి చూస్తే రోజుకు 15 లక్షల మందికి సగటున వాక్సిన్ వేసినట్టు అధికారికంగా నమోదైంది. చివర రోజులలో పెంచింది కలుపుకొన్నా నెలలో5.7 కోట్ల డోసుల లోపే వాక్సిన్ వేశారు.
ఒక వేళ కోవాక్సిన్ పెరుగుదల జరగలేదనుకున్నప్పటికీ ఉత్పత్తిలో దాదాపు మూడున్నరకోట్ల డోసులు ఎక్కడికి పోయినట్టు? ఏమైనట్టు?వాక్సిన్ తయారీకి విడుదలకు మధ్య నాలుగు మాసాల వ్యవధి వుంటుందని కోవాగ్జిన్ తయారీదారైన బారత్ బయోటెక్ ఒక ప్రకటన చేసింది. కాని ఒకసారి ఉత్పత్తి ప్రక్రియ మొదలైనాక సమస్య ఎందుకు వస్తుంది? కనుక తయారైన వాక్సిన్‌లో పెద్ద భాగం ఎటో వెళ్లిపోయిందని అనుకోవాలి.రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేటు ఆస్పత్రులకు యాభై శాతం వాక్సిన్సరఫరా నిర్దేశించినా ధరలో 400-1200 తేడా వుంది గనక ప్రైవేటు రంగానికి చేరి వుండాలి. లేదా హెచ్చు ధర కోసం ఆగివుండాలి. దీనిపై ఎలాటి తనిఖీ గాని సమీక్ష గాని జరగలేదు గనక తయారీకి సరఫరాకు మధ్య అంతరం అంతుపట్టని వ్యవహారమే అయింది. విదేశాలతోనూ ఈ కంపెనీలు మంతనాలు జరుపుతున్నాయని మర్చిపోరాదు.
ఈ కారణాలన్ని ఒకటైతే పినరాయి విజయన్ పేర్కొన్నట్టు రాష్ట్రాల దగ్గర నిధుల లభ్యత కూడా లేదు. కేంద్రం వాక్సిన్ కోసమే 35 వేల కోట్లు కేటాయించుకుంది. ప్రధానిమోడీ స్వయంగా వాక్సిన్ తయారీని ముందునుంచి పర్యవేక్షిస్తున్నారు. మరి అలాటప్పుడు ఈ కొరతకు గజిబిజికి బాధ్యత కేంద్రానిది కాక మరెవరిదవుతుంది? చాలా రాష్ట్రాలకు వాక్సిన్ తయారీ దార్ల నుంచి సరఫరాలు జరగలేదు.అనివార్య పరిస్తితులలో విదేశీ వాక్సిన్ల కోసం టెండర్లు పిలిస్తే కేంద్రం ద్వారా మాత్రమే సరఫరా చేస్తామని అవి షరతు పెట్టాయి.సమస్య బాగా ముదిరిపోయాక సెకండ్ వేవ్ తీవ్రమైనాక గాని కేంద్రం విదేశాల నుంచి స్పుత్నిక్, ఫైజర్, జాన్సన్ వంటి వాక్సిన్లు తెప్పించడానికి చొరవ తీసుకోలేదు. కొన్ని దేశీయ కంపెనీలు వాటి తయారీకి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అయినా నిర్ణయాధికారం కేంద్రానిదే కావడంతో రాష్ట్రాలు అటే చూడవలసి వచ్చింది.
గట్టిగా అడగవలసి వచ్చింది. పైగా రాష్ట్రాలే ఈ పరిస్థితికి కారణమనీ,వృథా చేశాయని కేంద్రం ఆరోపించడం మరింత విమర్శకు గురైంది. ఇంచుమించు ఇదే సమయంలో అత్యున్నత న్యాయస్థానం కూడా వాక్సిన్ విషయంలో కేంద్రం రాష్ట్రాలు ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పంపిణీ ధరలో తేడాలు, 18-45 ఏళ్ల పరిగణన ఇన్ని తేడాలేమిటని ప్రశ్నించింది.ఈవిధంగా చేయడం పౌరులందరి పట్ల సమానంగా వ్యవహరించాలనే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని కూడా వ్యాఖ్యానించింది. బహుశా వీటన్నిటి ఫలితంగానే ప్రధాని మోడీ ప్రసంగంలో వాక్సిన్ బాధ్యత తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్రాలద్వారా ప్రజలకు పూర్తి ఉచితంగా ఇస్తామన్నారు.25 శాతానికి కూడా కేంద్రమే చెల్లిస్తుందని ప్రైవేటు ఆస్పత్రులు నూటయాభై రూపాయలకు వాక్సిన్ వేయాలన్నారు.
జూన్ 21 నుంచి మొదలవుతుందని చెబుతున్న ఈ కార్యక్రమం ఏ మేరకు అనుకున్నట్టు జరిగితే మంచిదే.ఎందుకంటే కోవిడ్‌కు అసలైన పరిష్కారం వాక్సిన్ మాత్రమే అంటున్నారు గనక మరిన్ని కంపెనీలతో కలసి ఉత్పత్తిని విస్త్రతం చేయడం వేగంగా అందించడం కీలకం. కోవిడ్ సవాలును ప్రధాని మోడీ సరిగానే చెప్పారు గాని భారతదేశ వాక్సిన్ చరిత్రను తక్కువ చేశారు. గతంలో మనం దశాబ్దాలు వెనకబడి వుండేవారమన్నారు. వాస్తవంలో . అప్పటి సాంకేతికత, రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అయివుండొచ్చు గాని ప్రపంచంలోనే వాక్సిన్ తయారీలో భారత దేశ ప్రభుత్వ రంగం ముందంజవేసింది. తర్వాతి కాలంలో ప్రభుత్వ ఔషదపరిశ్రమతోపాటే వాక్సిన్ తయారీ కూడా దెబ్బతినిపోయింది.ఒకవైపున బాధ్యత తీసుకుంటూనే ప్రధాని గతంలో జరిగిన కృషిని తక్కువ చేసి మాట్లాడటం తమ హయాంలోనే అద్భుతం జరిగిందన్నట్టు చెప్పడం ఉచితం కాదు. గత ఏడాది కోవిడ్ తాకిడికి ఈ ఏడాది సెకండ్ వేవ్‌కు మధ్య అయిదు నెలల వ్యవధిని సక్రమంగా ప్రణాళికా బద్దంగా వాడుకుని వుంటే భారత దేశ పరిస్థితి మరోలా వుండేది. ఇప్పుడు చెప్పిందైనా సరిగా అమలు కావాలని కోరుకుందాం.