ఏపీలో టీడీపీ సీనియర్ల కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయా? వారి వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయా? రచ్చరచ్చ అవుతోందా? నేతల స్టేట్‌మెంట్స్ తెలుగుదేశాన్ని మరోసారి గందరగోళంలో పడేస్తున్నాయా? సీనియర్ల ప్రకటనల వెనక ఉన్న మర్మం ఏంటి?
టీడీపీలో సీనియర్లు ఎందుకు తిరగబడుతున్నారు?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి గోడ దూకేయాలని అనుకున్నవారు దూకేశారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు సైలెంట్ అయ్యారు. ఒకరో ఇద్దరో మాట్లాడినా.. కేసులకు భయపడి దూకుడు తగ్గించేశారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. కూలింగ్ పిరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో ప్రాంతాల వారీగా సమస్యలను అజెండా చేసుకుని రోడ్డెక్కుతోంది టీడీపీ. ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ కలకలం రేపింది. ఆ ఘటన టీ కప్పులో తుఫానులా సమసిపోయినా.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో ఏపీ టీడీపీలో ఏం జరుగుతోంది? సీనియర్లు ఎందుకు తిరగబడుతున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అనంత టీడీపీ నేతలపై జేసీ ఫైర్!
అనంతపురంలో రాయలసీమ టీడీపీ నేతల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీమ జిల్లాల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన కామెంట్సే పార్టీ చేపట్టిన అసలు కార్యక్రమం ఉద్దేశాన్ని వెనక్కి నెట్టాయి. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను ఎవరైనా పట్టించుకున్నారా అని నిలదీశారు JC. చేతకాని నేతలంతా కలిసి ఉద్యమం తీసుకొచ్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో పెను ప్రకంపన లేపాయి. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను నేరుగానే ఢీకొట్టారు.
జేసీపై భగ్గుమన్న అనంత టీడీపీ నేతలు
పార్టీ నేతలు సహకరించడం లేదని జేసీ గుర్రు?
జేసీ చేసిన ఈ వ్యాఖ్యలపై సమావేశానికి వచ్చిన టీడీపీ ముఖ్యనేతలు కామన్‌గానే ఉన్నా.. మరుసటి రోజు ఏమైందో ఏమో వరసపెట్టి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. జేసీనే టీడీపీకి పెద్ద సమస్య అని ఒంటికాలిపై లేచారు పార్టీ నాయకులు. అనంత టీడీపీలో ఎప్పుడు విభేదాలు లేవని.. జేసీ సోదరులు వచ్చాకే పరిస్థితి మారిందన్నది వారి ఆరోపణ. సీమ నేతల రచ్చపై టీడీపీ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జేసీ ఎందుకలా మాట్లాడారన్నది ప్రశ్న. అనంతపురం జిల్లా టీడీపీలో కొందరు నేతలతో జేసీ సోదరులకు పడటం లేదన్నది ఓపెన్ సీక్రెట్. గతంలోనూ దీనిపై వివాదం రేగింది. గత ఎన్నికల్లో అనంతలో బాలకృష్ణ, పయ్యావుల తప్ప అంతా ఓడిపోయారు. ఆ తర్వాత జరగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో తాడిపత్రిలో మాత్రమే జేసీసోదరులు పట్టు నిలుపుకొన్నారు. టీడీపీ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నామని అనుకున్నారో లేక జిల్లాలోని పార్టీ నేతల నుంచి సరైన సహకారం లేదని గుర్రుగా ఉన్నారో తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన కామెంట్స్ నేతల మధ్య ఉన్న లుకలుకల్ని ఈ విధంగా బయటపెట్టాయి.
గోరంట్ల ‘సెల్ఫీ’ కామెంట్స్‌పై ఆగని రచ్చ!
ఇక రాజీనామా అంశంతో కలకలం రేపిన పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత మెత్తబడినట్టు కనిపించినా.. ఆయన చేసిన, చేస్తున్న కామెంట్స్ మాత్రం కాక రేపుతూనే ఉన్నాయి.
ధిక్కార స్వరం వినిపిస్తున్న సీనియర్లు!
గోదావరి జిల్లాల్లో గోరంట్ల.. అనంతలో జేసీ. ఇద్దరూ సీనియర్లే. ఒకప్పుడు టీడీపీలో ఎంతటి సీనియర్లు అయినా అసంతృప్తిని పెదవి దాటనిచ్చేవారు కాదు. ఇప్పుడు కట్టుతప్పుతుందో ఏమో తమ వాయిస్‌ను గట్టిగానే వినిపిస్తున్నా.రు. అది కాస్తా ధిక్కార స్వరంగా మారుతోంది. పైకి చెప్పకపోయినా పార్టీ వర్గాల్లో వీటిపై లోతుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై ఎలా ఉంటుందా? పరిస్థితి శ్రుతిమించకుడా అధినేత తీసుకుంటారా? ఎప్పటిలాగా3 నాన్చివేతకు ప్రాధాన్యం ఇస్తారా? మరి.. ఈ పరిణామాలు టీడీపీలో ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.