పార్టీకి ఛార్జింగ్ ఎక్కించేందుకు అక్కడ టీడీపీ ప్రయోగాలు చేస్తోందా? ఈక్వేషన్లు తేడా కొడుతున్నాయా? బలమైన నాయకత్వం ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉందా? తాజా ప్రయోగమైనా ఫలితాన్నిస్తుందా? ఏంటా నియోజకవర్గం?
ఇంఛార్జ్ మార్పు టీడీపీకి కలిసి వస్తుందా?
కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇపుడు జీరో అనే చెప్పాలి. ఈ పరిస్థితికి టీడీపీ అధిష్ఠానం బాధ్యతారహిత్యం కూడా కారణమని చెబుతారు. పచ్చ జెండాపై ప్రేమ, టీడీపీపై అభిమానం ఉన్న కేడర్‌లో విశ్వాసం కలిగించేలా పార్టీ ఇంఛార్జ్‌ను మార్చారు. మరి.. ఈ దఫా అయినా మార్పు పార్టీకి కలిసి వస్తుందా? ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ చేస్తున్న తప్పులేంటి?
బైరెడ్డి టీడీపీని వీడిన తర్వాత పార్టీ పరిస్థితి దయనీయం..!
టీడీపీకి బలమైన ఈ నియోజకవర్గంలో గతంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో గౌరు చరిత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009కు వచ్చే సరికి నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వ్ అయింది. 2012లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీని వీడిన తర్వాత ఇక్కడ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. పోలీస్ అధికారిగా పనిచేసి వైసీపీలో చేరిన శివానందరెడ్డి.. ఆ తర్వాత టీడీపీలోకి రావడంతో హమ్మయ్య అనుకున్నారు. జడ్పీ ఛైర్మన్, నందికొట్కూరు మున్సిపల్ ఛైర్మన్ పదవులును టీడీపీ దక్కించుకోవడంలో శివానందరెడ్డి కీలకంగా వ్యవహరించారు. చివరకు టీడీపీ కండువా కప్పుకొని నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ అయ్యారాయన.
శివానందరెడ్డి ప్లేస్‌లో టీడీపీ ఇంఛార్జ్‌గా గౌరు వెంకటరెడ్డి..!
2014లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. టీడీపీ అధికారంలో ఉండటంతో నందికొట్కూరులో శివానందరెడ్డిదే హవా. 2019 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ ఓడిపోవడంతో మళ్లీ పాత పరిస్థితి ఎదురైంది. ఇంఛార్జ్‌గా శివానందరెడ్డి ఎదురీదుతూ వస్తున్నారు. ఇక శివానందరెడ్డితో లాభం లేదని అనుకున్నారో ఏమో.. టీడీపీ నందికొట్కూరు ఇంఛార్జ్‌గా గౌరు వెంకటరెడ్డిని నియమించారు చంద్రబాబు. పైగా వెంకటరెడ్డికి శివానందరెడ్డి స్వయాన బావ. ఇది సొంత నియోజకవర్గం కావడంతో ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త చొరవ తీసుకున్నారు వెంకటరెడ్డి.
గందరగోళానికి తెరదించుతారా?
ప్రస్తుతం బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జులను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే నందికొట్కూరులో మార్పు చేశారట. వెంకటరెడ్డి ఇప్పటికే నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెంకటరెడ్డిపై బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. 2019లో పార్టీ అభ్యర్థి ఎవరో టీడీపీ అధిష్ఠానానికి కూడా అర్థం కాలేదని చెబుతారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి గందరగోళానికి తావు లేకుండా జాగ్రత్త పడాలని కేడర్ ఆశిస్తోంది.
గౌరు పూర్తిస్థాయిలో దృష్టి పెడితే టీడీపీ పుంజుకుంటుందా?
గౌరు వెంకటరెడ్డికి నందికొట్కూరు నియోజకవర్గంలో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన పూర్తిస్థాయిలో దృష్టిపెడితే టీడీపీ పుంజుకుంటుందనే ఆశ శ్రేణుల్లో ఉంది. లేదంటే టీడీపీ అధిష్ఠానం నందికొట్కూరును మర్చిపోవాలని చెబుతున్నారట. మరి.. ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏ స్థాయిలో బలోపేతం అవుతుందో చూడాలి.