కుప్పం టార్గెట్‌గా అధికారపార్టీ వేగంగా పావుల్ని కదుపుతోంది. మేము ఏమైనా తక్కువా అన్నట్టు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందట టీడీపీ. కుప్పం మీద మీరు కాన్సన్‌ట్రేట్ చేస్తే మేము పుంగనూరు సంగతి చూస్తాం అంటున్నారట అక్కడి తెలుగు తమ్ముళ్లు. నిస్తేజంగా ఉన్న పాత ఇంఛార్జ్‌ను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చి పెద్దిరెడ్డి పెద్దరికానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట.
పుంగనూరుపై టీడీపీ ఫోకస్ పెట్టిందా?
చిత్తూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా. వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి కీలక నేతలున్న జిల్లా. సాధారణంగా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ సై అంటే సై అనేలా హాట్ హాట్‌గా సాగుతుంటాయి. గత ఎన్నికల్లో ఇది తారాస్థాయికి చేరింది. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 13చోట్ల వైసీపీ గెలవడంతో మంత్రి పెద్దిరెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో.. ఇప్పుడు అదేస్థాయిలో టీడీపీ కూడా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిందనే టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.
కొత్త నేతను ఇంఛార్జ్‌ను చేయాలని కేడర్ డిమాండ్!
వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట తెలుగు తమ్ముళ్లు. 2014లో వెంకటరమణ రాజు, 2019లో అనూషారెడ్డి బరిలో దిగినా పెద్దిరెడ్డి రాజకీయం ముందు ఓడిపోక తప్పలేదు. ఎన్నికల తర్వాత ఆ ఇద్దరు నేతలు అసలు ఉన్నారో లేదో అన్నట్టుగా ఉందట. ఇక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకడుగు వేశారు. కేడర్ పోటీకి సిద్ధమని చెప్పినా.. మేం పోటీలో లేమని ఇంఛార్జ్ అనూషారెడ్డి చెప్పడం కేడర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అధినేత చంద్రబాబు మీద పెద్దిరెడ్డి ఫైర్ అవుతుంటే కనీసం మంత్రి పేరు పలకడానికి కూడా ఆమె సాహసించడం లేదట. దీంతో ఆమెను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట జిల్లా నేతలు.
చల్లా రామచంద్రారెడ్డిని ఇంఛార్జ్‌ను చేస్తారట!
ఎవరెన్ని చెప్పినా ఇన్నాళ్లూ ససేమిరా అంటున్న అధినేత.. ఇంచార్జ్‌ను మార్చేందుకు సై అన్నట్టు సమాచారం. దీంతో జిల్లా నేతలు రేపోమాపో చంద్రబాబును కలిసి కొత్త ఇంచార్జ్‌ను బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో చివరిలో టికెట్ మిస్ అయిన చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఇంఛార్జ్ పదివికి రేస్‌లో ఉన్నారట. చల్లా బాబు తండ్రి, తాత ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో ఈసారి పుంగనూరులో టీడీపీ ఇంఛార్జ్‌గా ఆయనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని జిల్లా నాయకులు బాబు వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ బోర్డు మెంబర్‌గా పనిచేశారాయన. చల్లా బాబు పేరును అధినేతతోపాటు, లోకేష్ దగ్గర గట్టిగానే ప్రస్తావించారట టీడీపీ నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి.
పుంగనూరుపై దృష్టి పెట్టామని వైసీపీకి సవాళ్లు!
ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో ఓటమి తప్పడం లేదని.. ఈసారి మాత్రం అలా చేయకండి అని గట్టిగానే అధిష్ఠానానికి తమ్ముళ్లు తమ బాధను చెప్పుకొచ్చారట. ఈ పదేళ్లలో వందల కేసులు తమపై పెట్టారని .. ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన పుంగనూరు తెలుగు తమ్ముళ్లలో నెలకొందట. తాజా పరిణామాలతో చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడుగులు వేయాలని డిసైడ్ అయినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. కేడర్ సైతం జిల్లా మీరు మా అధినేత నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తే.. మేము పుంగనూరు వైపు ఫోకస్ పెట్టామని వైసీపీ నేతలకు సవాళ్లు విసురుతున్నారట. మరి..ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.