జార్ఖండ్ జెసూట్ ఫాదర్, ఆదివాసుల అభ్యున్నతికి అంకితమైన హక్కుల కార్యకర్త,స్టాన్‌స్వామి నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేస్తున్నది.82 ఏళ్ల ఈ వయోవృద్ధ సంఘ సేవకుడు గత అక్టోబర్8న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్‌ఐఎ) భీమ్ కొరగావ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి అనేక బాధలుపడుతూనే బెయిలు కోసం పోరాడుతూ వచ్చారు.పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌స్వామికి కరోనా కూడా సోకింది.ఎట్టకేలకు మే28న ముంబాయిహైకోర్టు ఆయన బెయిల్ పిటిషిన్‌ను స్వీకరించింది. కాని బెయిల్ ఇవ్వడం గాక చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాల్సిందిగా మాత్రమే ఆదేశాలిచ్చింది.దానికి ఆయన అంగీకరించలేదు. తన నిర్బంధం రాజ్యాంగం 14,21 అధికరణాల ప్రకారం అక్రమం గనక బెయిల్ కోరుతున్నానని అన్నారు. నా శరీరం రోగగ్రస్త శరీరం మందుల ప్రభావం కంటే వేగంగా క్షీణిస్తున్నది. నేనెలాగూ ఈ లోగానే చనిపోతాను.కనుక వేరే చికిత్స నిష్ప్రయోజనం అన్నారు, అయినా మిత్రుల ఒత్తిడిపై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు.
ఈ రోజు బాంబే హైకోర్టులో జస్టిస్‌షిండే, జమాదార్‌ల ధర్మాసనం ఆయన పిటిషన్ తీసుకోగానే తన తరపు న్యాయవాది మిహిర్‌దేశాయ్ మాట్లాడుతూ స్టాన్‌స్వామికి చికిత్స చేసిన డా.డిసౌజా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు అని తెలిపారు. తర్వాత డిసౌజా కోర్టు ముందుకు వచ్చి శనివారం సాయింత్రం 4..30కు గుండెపోటుకు గురైన స్టాన్‌స్వామికి ఎంత చికిత్సచేసినా ఈ రోజు మధ్యాహ్నం మరణించారని చెప్పారు.దానిపై దర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మొదటిసారిగా తామే ఆయనను ఆస్పత్రికి తరలించాలని ఆదేశించామని అయితే ఆయన మరణించారు గనక ఇక ఈ పిటిషన్ తీసుకోవడంలేదని ప్రకటించింది. న్యాయవాది మిహిర్ దేశాయి మాట్లాడుతూ తమకు చికిత్సపై ఎలాటి సందేహం లేకున్నా ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని కోరారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన స్టాన్‌స్వామి జార్ఖండ్‌లో ఆదివాసుల కోసం పనిచేస్తూ వచ్చారు. అందుకోసం బిసైచా అనే సంస్థ స్థాపించారు. మావోయిస్టు అనుకూలమైన విస్తాపన్ విరోధి జనవికాస్ ఆందోళన్ సమితితతో దీనికి సంబంధాలున్నాయని ఆయన వారి సానుభూతిపరుడని ఎన్‌ఐఎ ఆరోపించింది.2017 డిసెంబర్3న పూనేలో ఆయన ఒక రెచ్చగొట్టే ప్రసంగంచేశారనీ, ఆ కారణంగానే భీమ్‌కోరెగావ్ ఎల్గార్‌పరిషత్ కార్యక్రమంలో హింస చెలరేగి ఒకరు మరణించారని వారు కేసు పెట్టారు. వరవరరావుతో సహా ఎందరినో దీనికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలనిరోధక చట్టం(ఉపా) కిందఅరెస్టుచ చేశారు. ఈ చట్టం కిందబెయిలుకు అవకాశం వుండదని నిరాకరిస్తుంటారు. కిక్కిరిసి వుండే తలోజాజైలు నుంచిమరోచోటకు ఆయన మిత్రులుప్రభుత్వాన్ని కోర్టులను కోరుతూనే వచ్చారు. సర్కార్లు ,దర్యాప్తు సంస్థలు ఆ పనిచేయకపోగా ఆ వయోవృద్దుడికి అవసరమైన కనీస పరికరాలను కూడా ఖైదులోఅందించకుండా వేధించారు. చివరకు ఆయన ప్రాణాలే పోవడానికి ఇదంతా కారణమైంది. స్టాన్‌స్వామికి దేశంలోని చాలా రాజకీయ పార్టీలు సంస్థలూ నివాళులర్పించాయి. ఆయన మరణానికి కారకులెవరో తేల్చాలని కోరాయి.