పోడు భూముల సమస్య అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు తలపోటుగా మారింది. సీజన్ వస్తే చాలు.. అటవీ అధికారులతో లడాయి తప్పడం లేదు. ఆగ్రహావేశాలు.. దాడులు.. ఉద్రిక్తతలు రొటీన్ అయిపోయాయి. సమస్యను రాజకీయం చేయడానికి విపక్షాలు చూస్తుండటంతో మరింత టెన్షన్ పడుతున్నారట టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు.
శాంతిభద్రతల సమస్యగా పోడు భూముల రగడ
అటవీ అధికారులు.. గిరిజనులకు మధ్య పోడు భూములపై రగడ పాతదే. కానీ.. ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అడవినే నమ్ముకున్న తాము పోడు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటని గిరిజనులు ప్రశ్నిస్తారు. చట్టాలను అమలు చేసే అటవీ అధికారులు అందుకు ససేమిరా అంటారు. ఇక్కడ మొదలయ్యే తగువు తలలు పగుల కొట్టుకునే వరకు వెళ్లిన ఉదంతాలు తెలంగాణలో అనేకం. శాంతిభద్రతల సమస్యగా మారిన ప్రదేశాలు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు చాలా ఉన్నాయి.
read also : పేరెంట్స్ కోసం నాని కోవిడ్ అవేర్ నెస్
అటవీ అధికారులపై ఎమ్మెల్యే కోనప్ప ఫైర్
ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో అటవీ అధికారులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోడు భూముల సమస్య మళ్లీ చర్చల్లోకి వచ్చింది. హరితహారం కోసం ఊళ్లల్లోకి వెళ్తే పోడు భూములపై అడుగుతున్నారని.. సమాధానం చెప్పలేకపోతున్నామని మండిపడ్డారు కోనప్ప. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదే సమస్య తరుచూ వెలుగు చూస్తోంది.
పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే పనిలో విపక్షాలు
గిరిజనులకు మద్దతుగా నిలిచే ప్రజాప్రతినిధులు కొన్నిసార్లు కట్టుతప్పి అటవీ అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. గిరిజనులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సిబ్బంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా కోనేరు కోనప్ప, రేగా కాంతారావు నియోజకవర్గాల పరిధిలో అటవీ అధికారులు.. గిరిజనుల మధ్య సమస్య రావణకాష్టంగా మారుతోంది. ఇదే సమయంలో పరిస్థితిను అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు చూస్తుండటంతో ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే విధంగా మారితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యేలు.
శాశ్వత పరిష్కారం ఆశిస్తున్నారా?
సమస్య పరిష్కారం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అటవీశాఖ సంయమనం పాటించాలని ఆదేశించింది. అయితే తాత్కాలిక ఉపశమనం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం ఆశిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే సీజన్‌లో రగడ స్టార్ట్ అయింది. క్రమంగా మిగతా ప్రాంతాల్లోనూ అసంతృప్తులు.. నిరసనలు రేగుతున్నాయి. మరి.. సీజన్ ముగిసేలోపు ఈ సమస్యను ఎమ్మెల్యేలు ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.