నాకు పదవి రావాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ.. నాకు రాకుంటే మాత్రం పక్కనేతకు రావొద్దని కోరుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. తన సంగతి అటుంచి ప్రత్యర్థికి ప్లస్ అయ్యే అంశాల టార్గెట్‌గా పావులు కదుపుతున్నారట. పైకి ఇకఇకలు.. పకపకలు.. వెనక మాత్రం వెన్నుపోట్లతో గట్టిగానే చెక్ రాజకీయం నడుపుతున్న ఆ నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అవంతిని మారిస్తే.. ఆయన స్థానంలో కేబినెట్‌లో ఎవరికి ఛాన్స్?
విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో అమాత్య పీఠం కోసం గట్టి పోటీ నెలకొంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించాక విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. పైగా ఉత్తరాంధ్రలో సింగిల్ మంత్రి ఉన్న జిల్లా విశాఖనే. గతంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు ఖాయంగా ఉండేవి. గ్రామీణ లేదా ఏజెన్సీ నుంచి ఒకరికి.. గ్రేటర్ విశాఖ నుంచి మరొకరి అవకాశం లభించేది. ఈ ధపా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. ఒకవేళ అవంతిని మారిస్తే ఆయన ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారు? రేస్‌లో మాత్రం బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
నవ్వుతూ మాట్లాడతారు.. వెనక గోతులు తవ్వుకుంటున్నారా?
సమర్థులు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలను మెరుగుపరిచే వారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. పనితీరు, వ్యక్తిగత వ్యవహారాలు, సామాజిక సమీకరణాలు, విధేయత, సర్వే ఫలితాల ఆధారంగా వడపోతలు ఎలాగూ ఉంటాయి. ఇక్కడే ట్విస్ట్‌లు కనిపిస్తున్నాయి. మంత్రిపదవి తనకు వస్తే ఓకే.. లేకపోతే పార్టీలోని ప్రత్యర్థికి దక్కకూడదన్న వైఖరి రేస్‌లో ఉన్నవారిలో ఎక్కువైందట. పైకి నవ్వుతూ మాట్లాడుకుంటూనే.. వెనక గోతులు తవ్వుకుంటున్నట్టు టాక్. ఇది అధిష్ఠానం పెద్దల నోటీసు వరకు వెళ్లిందట.
బూడి, కరణం మధ్య కోల్డ్‌వార్..!
వీటికితోడు కొందరు సీనియర్లు తెరవెనక కథ నడిపిస్తున్నారనే అభిప్రాయం ఎమ్మెల్యేల్లో ఉందట. వెలమ సామాజికవర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే. ముత్యాల నాయుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. కాపు కోటాలో సీనియారిటీ లెక్కన తనకు ఛాన్స్ వస్తుందనే ధీమా ధర్మశ్రీలో కనిపిస్తోంది. మంత్రి పదవిపై ఇద్దరూ బయట పడకపోయినా ఎత్తుగడలు గట్టిగానే వేస్తున్నారట.
గంజాయి ఆరోపణలపై కరణం ధర్మశ్రీ అలర్ట్..!
గంజాయి విషయంలో టీడీపీ నేతలు ఎమ్మెల్యే ధర్మశ్రీని టార్గెట్ చేశారు. గంజాయి రవాణా చోడవరం నియోజకవర్గం మీదుగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తోంది. ఈ ఆరోపణల వెనుక అంతరార్ధం పసిగట్టిన ధర్మశ్రీ అలెర్ట్ అయ్యారట. తనకు సంబంధం లేని అంశాన్ని తనకు ముడి పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు. కాపు సామాజికవర్గానికే చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. సీఎంకు సన్నిహితమనే ముద్ర ఉంది. గతంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. దీంతో అమర్నాథ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన అవకాశాలకు గండి కొట్టేందుకు ఇంకొందరు పావులు కదుపుతున్నారట.
కాపు కుల సంఘాల డిమాండ్ వెనక కుట్ర ఉందని అమర్నాథ్ అనుమానం..!
ఇటీవల కాపు సామాజికవర్గ ప్రతినిధులు.. అమర్నాథ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అయితే వారితో తనకెలాంటి సంబంధం లేదని వాపోయారట ఎమ్మెల్యే. తనకు మంత్రిపదవి ఇవ్వాలని కుల సంఘాలు డిమాండ్ వెనక కుట్ర ఉన్నట్టు ఆయన అనుమానిస్తున్నారట. ఎమ్మెల్యేకి తెలియకుండానే ఎమ్మెల్యే పేరుతో డిమాండ్ రావడం తనకు చెక్ పెట్టేందుకేనని అమర్నాథ్ సందేహిస్తున్నారట. ఇటీవల బయ్యవరం దగ్గర భూముల వ్యవహారంపై రాద్ధాంతం జరిగింది. జిరాయితీ భూములు కొనుగోలు చేసి వ్యాపారం నిర్వహిస్తుంటే.. వివాదం చేయడం వెనక అసలు ఆలోచనలు బహిరంగ రహస్యమేనన్నది ఎమ్మెల్యే వర్గం వాదన.
టీటీడీ పదవి ఆఫర్ చేసినా వద్దన్న గొల్ల బాబూరావు..!
కేబినెట్‌లో బెర్త్ ఖాయం అని కాస్త గట్టిగా ప్రచారంలో ఉన్న మరో ఎమ్మెల్యే పేరు గొల్ల బాబూరావు. పాయకరావుపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాంధ్ర ఎస్సీ ఎమ్మెల్యేల కోటాలో ఈ దఫా బాబూరావును పరిగణనలోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది. ఇటీవల టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి ఆఫర్ చేసినా ఆయన వద్దన్నారు. ఈ సామాజికవర్గంలో ఆయనకు ఎవరూ పోటీ లేరు. బాబూరావుకు పదవి వస్తే తమకు నష్టమనో.. కష్టం అనో ఎవరైనా అనుకుంటే ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుండవచ్చనే అనుమానాలు ఉన్నాయి.