అధికారపార్టీలో ఇప్పుడా పదవికి డిమాండ్ పెరిగింది. భవిష్యత్‌లో రాజకీయ పదోన్నతులకు లాంఛింగ్ ప్యాడ్‌గా ఉపయోగపడుతుందని లెక్కలేస్తున్నారట. పైగా సెంటిమెంట్‌గానూ భావిస్తున్నారు నాయకులు. ఇంతకీ ఆ పదవేంటి? ఎందుకు సెంటిమెంట్‌గా చూస్తున్నారు?
టీఆర్‌ఎస్వీ పోస్ట్ పదవులకు లాంఛింగ్ ప్యాడా?
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ పేరును ప్రకటించగానే TRSVపై పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. TRSV టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం. ఆ సంస్థకు గెల్లు శ్రీనివాసే అధ్యక్షుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగానికి అధ్యక్షులుగా పనిచేసిన వారికి ఏదో ఒక ముఖ్యపదవి వరిస్తుండటం.. పార్టీలో, ప్రభుత్వంలో ఊహించని గుర్తింపు లభిస్తుండటంతో ఇప్పుడీ పోస్ట్‌ను లాంఛింగ్ ప్యాడ్‌గా భావిస్తున్నారు నాయకులు.
అధ్యక్షుడిగా చేస్తే పదవి లేదా గుర్తింపు ఖాయమా?
తెలంగాణ ఉద్యమ సమయంలో TRSV కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో TRSV అధ్యక్షుడిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉండేవారు. ఆ తర్వాత బాల్క సుమన్ అధ్యక్షుడయ్యారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టాక ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ అయ్యారు. బాల్క సుమన్ తొలుత ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికలో గెల్లు శ్రీనివాస యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో TRSV అధ్యక్షుడిగా చేస్తే పదవి, గుర్తింపు రెండూ లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. కొంతమంది సెంటిమెంట్‌గానూ పరిగణిస్తున్నారు.
టీఆర్‌ఎస్వీ అధ్యక్ష పదవి కోసం విద్యార్థి నేతల లాబీయింగ్!
ఇన్నాళ్లూ TRSV అధ్యక్షులుగా ఉస్మానియా వర్సిటీకి చెందిన విద్యార్ధులే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా కూడా OU విద్యార్థే వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ పదవికి నెలకొన్న డిమాండ్.. సెంటిమెంట్ కారణంగా.. తెలంగాణలోని ఇతర వర్సిటీల విద్యార్థులు కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారట. ముఖ్యంగా కాకతీయ, పాలమూరు వర్సిటీలలోని TRSV ప్రతినిధులు అధ్యక్ష పీఠం కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకరిద్దరు అయితే సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు TRSV ప్రెసిడెంట్‌గా తమకు అవకాశం ఇవ్వాలని కోరారట. మరికొందరు పార్టీలో తమకు తెలిసిన నాయకుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.
2023 ఎన్నికలు విద్యార్థి నాయకులను ఊరిస్తున్నాయా?
ఎన్నాళ్లు ఆ నాయకుడు.. ఈ నాయకుడు వెంట తిరుగుతాం. అధినేత ఫోకస్ ఉంటే.. TRSV అధ్యక్షుడైతే చాలు అన్నది చాలా మంది విద్యార్ధి విభాగం నేతల ఆలోచన అట. పైగా విద్యార్ధి విభాగం అధ్యక్షుడిగా పనితీరు నిరూపిస్తే.. 2023 ఎన్నికల నాటికి అసెంబ్లీ టికెట్టో.. లేకపోతే ఏదో ఒక గుర్తింపు కలిగిన నామినేటెడ్ పదవో వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరి.. గెల్లు తర్వాత TRSV అధ్యక్షుడిగా ఎవరు వస్తారో? మళ్లీ OU నుంచే ఎంపిక చేస్తారో లేక ఇంకేదైనా వర్సిటీ నుంచి విద్యార్థి నాయకుడిని పికప్ చేస్తారో చూడాలి.