రాష్ట్రస్థాయి పదువులొస్తున్నాయంటే ఎగిరి గెంతులేశారు. ఏదేదో చేసేద్దామని బోల్డన్ని లెక్కలేసుకున్నారు. తీరా పదవులొచ్చాయక ఏమీ చేయలేక ఆవేదన చెందుతున్నారట. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదట. వారెవరో.. ఆ బాధేంటో ఇప్పుడు చూద్దాం.
పదవులు రావడంతో గుర్తింపు లభించిందని సంతోషించారు!
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పోస్టులతోపాటు డైరెక్టర్ పదవులు దక్కాయి. సామాజికవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని.. తగిన హోదా లభిస్తుందని.. ప్రొటోకాల్‌లో ప్రాధాన్యం ఇస్తారని లీకులు రావడంతో.. చాలామంది పోటీపడ్డారు. కానీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరగణానికి ఆ పదవులు దక్కేలా చక్రం తిప్పారు. చివరకు కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరాడ తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్‌గా అంధవరపు సూరిబాబు, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్‌గా దుక్క లోకేశ్వరరావు ఇలా పోలినాటి వెలమ, పొందర/కూరాకుల, శ్రీశయన కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. ఇన్నాళ్లూ పార్టీలో తాము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని గాల్లో తేలిపోయారు నాయకులు. ఇక రెచ్చిపోవడమే అనుకుంటున్న తరుణంలో అంతా డీలా పడిపోతున్నారట.
పేరుకు ఛైర్మన్లు.. కూర్చోడానికి కుర్చీలేదు!
ఏదో జరిగిపోద్ది ఇంకేదో చేసేద్దామనుకుంటే వీళ్లకు ఓ అవకాశం కూడా రావడం లేదట. ఎక్కడైనా సమావేశం పెట్టాలంటే ఓ మీటింగ్ హాల్ లేదు. అటు అమరావతిలోనూ ఇటు సిక్కోలులోనూ కూర్చోడానికి ఓ కుర్చీ లేకపోవడం వారిని మరింత బాధపెడుతోందట. సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనడం, లేదా పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశాలప్పుడు హాజరుకావడం తప్ప మరో పని లేదట కార్పొరేషన్ చైర్మన్లకు.
పదవులు దక్కిన కొందరి హోదాను చూసి ఈర్ష్య!
ఏదైనా కార్యక్రమాల్లో నేతలు, అధికారులతో కలిసి కుర్చీలు పంచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారట కార్పొరేషన్ ఛైర్మన్లు. ఇదే సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, DCCB, DCMSలకు ఛైర్మన్‌లుగా ఎంపికైన వారి చూసి తెగ ఈర్ష్య పడుతున్నారట. ఆ సంస్థలకు ప్రత్యేకంగా ఆఫీసులు.. సిబ్బంది వగైరా ప్రొటోకాల్స్ కూడా ఉండటంతో… అవన్నీ చూసిన వాళ్లు తమకు పదవి వల్ల కొత్తగా ఏం కలిసొచ్చిందని ప్రశ్నించుకుంటున్నారట. ప్రైవేట్ సంభాషణల్లో అనుచరుల దగ్గర ఇదే విషయం చెప్పి బాధపడుతున్నట్టు సమాచారం.
పదవులు ఇచ్చారు.. కుర్చీ కూడా ఇవ్వాలని మొర!
ఈ ఇబ్బందులను గమనించిన పార్టీ నాయకులు కొందరు కుర్చీ కూడా లేని పోస్టులు ఎందుకు అన్నాయ్ అని ముఖంమీదే సెటైర్లు వేస్తున్నారట. దీంతో ఛైర్మన్లుగా ఉన్నవారు పదవుల పంపకాలలో ప్రాధాన్యం కల్పించి న్యాయం చేశారని మురిసిపోవాలో.. కూర్చోడానికి కుర్చీ కూడా లేక బాధపడాలో తెలియడం లేదట. అందుకే పార్టీ ముఖ్య నేతలను కలిసినప్పుడల్లా ఓ కుర్చీ ఉంటే చూడకూడదు అని మొరపెట్టుకుంటున్నారట. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం..అన్నీ అవుతాయా ఏంటి సరిపెట్టుకుంటున్నారట మరికొందరు. మొత్తానికి ఈ కుర్చీలేని పదవులపై సిక్కోలు జిల్లాలో ఆసక్తికర చర్చే జరుగుతోంది. మరి.. పదవీకాలం పూర్తయ్యే లోగా కుర్చీ సంపాదిస్తారో లేదో చూడాలి.