ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ?
పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..!
విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో గిడ్డి ఈశ్వరి, 2019లో కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. పటిష్ఠమైన ఓటు బ్యాంకు, అధినాయకత్వంపై విధేయత కలిగిన కేడర్ ఉండటంతో పాడేరును కంచుకోటగా మార్చుకుంది వైసీపీ. అలాంటిచోట అధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్సెస్ లీడర్స్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
ఎమ్మెల్యేను నిరాశపర్చిన పంచాయతీ, పరిషత్ ఎన్నికలు..!
ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఎదురవుతున్న ప్రతికూల ఫలితాలు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గాన్ని కలవర పరుస్తున్నాయట. పటిష్ఠంగా ఉన్నామని భావిస్తున్నచోటే పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎమ్మెల్యేను తీవ్ర నిరాశపర్చాయి. కీలకమైన పాడేరు పంచాయతీని అధికారపార్టీ కోల్పోయింది. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా.. పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి కీలకం. పరిషత్ ఎన్నికల్లో మూడుచోట్ల ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గెలిచింది. పాడేరులో వైసీపీ రెబల్ ఎంపీపీ అయ్యారు. జి.మాడుగులలో టీడీపీ ఆఫర్‌తో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. చింతపల్లిలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థిని కాదని రెబల్ పీఠం ఎక్కారు.
సీనియర్లను కలుపుకొని వెళ్లలేకపోతున్నారా?
పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితోపాటు వైసీపీలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మత్స్యరాస బాలరాజు, విశ్వేశ్వర్‌రాజు ముఖ్యనాయకులు. వీరితోపాటు ఎంపీ మాధవి వర్గానికి చెందిన ట్రయికార్ ఛైర్మన్ బుల్లిబాబు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని వెళ్లడం ఎమ్మెల్యేకు సాధ్యం కావడం లేదట. అదే సమయంలో వర్గ రాజకీయాలు కారణంగా ఆమె కొందరిని దూరం పెడతున్నారట. స్థానికంగా గిరిజన నాయకత్వాన్ని కాదని బయట వ్యక్తులను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చింతపల్లిలో జరిగిన సమావేశంలో కొయ్యూరు మండల అధ్యక్షుడు బహిరంగంగానే విమర్శలు చేశారు. వాల్మీకి కులం గుర్తింపును ప్రశ్నార్ధకం చేసేలా ఇటీవల వెబ్ సైట్లో మార్పులు చేయడంతో గిరిజన సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. స్ధానిక ఎమ్మెల్యేకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోయినా విమర్శలు ఎదుర్కోకక తప్పని పరిస్ధితి.
జడ్పీ ఛైర్‌పర్సన్ పీఠం దక్కక విశ్వేశ్వర్‌రాజు వర్గం గుర్రు..!
ఇటీవల జడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికలోనూ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అనుసరించిన వ్యూహం ప్రత్యర్ధులకు మింగుడుపడ్డం లేదట. ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన ఆ పీఠంపై ఆదిమ గిరిజన తెగకు చెందిన సుభద్రకు అవకాశం కల్పించారు. జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకుని జీకే వీధి నుంచి విశ్వేశ్వర్‌రాజు భార్య గెలిచారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్వేశ్వరరాజు కుటుంబానికే జడ్పీ పీఠం దక్కుతుందని అంతా ఊహించారు. చివరకు సుభద్ర పేరు ఖరారైంది. ఈ నిర్ణయం అధిష్ఠానమే తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యే వ్యతిరేకించడంవల్లే తమకు అవకాశం రాకుండా పోయిందనే ఆవేదన విశ్వేశ్వరరాజు వర్గంలో ఉంది.
రెబల్స్‌పై చర్యల కోసం అధిష్ఠానం దగ్గరకు ఎమ్మెల్యే..!
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ యాక్టివిటీ పెరిగింది. స్ధానిక రాజకీయాల్లో కొత్త వ్యూహాలను అమలు చేసి ఎమ్మెల్యేను ఇరుకున పెడుతోంది ప్రతిపక్షం. మరోవైపు దిద్దుబాటు చర్యల్లో భాగంగా వైసీపీలోని రెబల్స్‌పై చర్యల కోసం అధిష్ఠానాన్ని ఆశ్రయించారట ఎమ్మెల్యే. చీడపురుగులను పార్టీ నుంచి ఏరిపారేస్తామని భాగ్యలక్ష్మి వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. ఉక్కిరి బిక్కిరి నుంచి భాగ్యలక్ష్మి ఎలా బయటపడతారో చూడాలి.