ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందరినీ కలుపుకొని పోకుండా.. సొంత కోటరీని ప్రమోట్ చేసుకుంటున్నారట. ఇంకేముందీ ఎమ్మెల్యేపై భగ్గుమనేవాళ్ల సంఖ్య పెరిగింది. వర్గాలు పుట్టుకొచ్చాయి. ఎవరి కుంపటి వారిదే. ప్రస్తుతం మూడు గ్రూపులు.. ఆరు తగాదాలుగా ఉందట అక్కడి టీఆర్ఎస్ పరిస్థితి. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మదన్‌రెడ్డికి బంధువులతో పొసగడం లేదా?
మదన్‌రెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా.. సొంత పార్టీ నేతలే ఆయనపై ఒంటికాలిపై లేచే పరిస్థితి ఉంది. మదన్‌రెడ్డి వరసగా రెండోసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన పెదనాన్న విఠల్‌రెడ్డి సీపీఐ నుంచి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన వారసుడిగా వచ్చిన మదన్‌రెడ్డి రాజకీయాల్లో వచ్చి రాణించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. విఠల్‌రెడ్డి అసలు వారసులు సైతం పొలిటికల్‌గా నిలదొక్కుకోవాలని చూస్తుండటంతో గొడవలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యేతో పడక పార్టీకి గుడ్‌బై చెప్పిన విఠల్‌రెడ్డి మనవడు శేషసాయి
విఠల్‌రెడ్డి మనవడు శేషసాయి చిలిపిచెడు జడ్పీటీసీ. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్పీటీసీ శేషసాయి కుటంబాల మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో జడ్పీటీసీ పదవితోపాటు..పార్టీకి కూడా రాజీనామా చేశారు శేషషాయి. ఈ గొడవ ఎక్కడ ముగుస్తుందో తెలియడం లేదట. ప్రస్తుతం నర్సాపూర్ టీఆర్ఎస్లో ఇది హాట్ టాపిక్.
మున్సిపల్ ఛైర్మన్ మురళీ వర్సెస్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
మదన్‌రెడ్డి 2014 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు సునీతా లక్ష్మారెడ్డి. ఈ రెండువర్గాల చేరికతో నర్సాపూర్‌లో పార్టీ పరిస్థితి కలగూరగంపలా తయారైందనే కామెంట్స్ ఉన్నాయి. ఇంకోవైపు నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీయాదవ్‌కు ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి పడటం లేదు. మురళీ గతంలో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా.. ఆయన భార్య జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2014లో నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ మురళీకే ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ.. మదన్‌రెడ్డి ఎంట్రీతో టికెట్ ఆయన చేజారింది. ఆ విధంగా ఇద్దరి మధ్య పెరిగిన దూరం అలాగే ఉండిపోయింది.
read also : అధికారులు ఇచ్చిన లెక్కలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి !
మెజారిటీ స్థానిక ప్రజాప్రతినిధులూ ఎమ్మెల్యేపై గుర్రు
నర్సాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీలోని మెజారిటీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేతో అస్సలు పడటం లేదట. ప్రతి మండలంలో తనకంటూ ఒకవర్గాని ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకుని.. వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ మధ్య దుబ్బాక ఉపఎన్నికలో ఒక మండలానికి మదన్‌రెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ సమయంలోనూ తన వర్గాన్నే అక్కడికి తీసుకెళ్లారని టాక్. GHMC ఎన్నికల్లో ఒక డివిజన్ బాధ్యతలు చూసిన సమయంలోనూ.. నర్సాపూర్‌లోని స్థానిక ప్రజాప్రతినిధులను వెంట తీసుకెళ్లలేదని ఇప్పటికీ చెప్పుకొంటారు. దీంతో మెజారిటీ నేతలు ఎమ్మెల్యే అంటే రుసరుసలాడుతున్నారట.
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం ఫైట్!
మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, చెక్కుల పంపిణీ వంటి ప్రొగ్రామ్స్‌లో సొంత వర్గానికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ఆయన వ్యతిరేక వర్గం చేసే ఆరోపణ. ఇదే అంశంపై సోషల్ మీడియాలో రెండు వర్గాలు కామెంట్లు, పోస్టింగ్‌లు పెట్టుకుని దాడి చేసుకుంటున్నాయి. చివరకు నియోజకవర్గంలోని అధికారులకు సైతం ఈ వర్గాల నుంచి తలనొప్పులు తప్పడం లేదట. సందెట్లో సడేమియాగా ఈ వర్గ పోరును క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్, బీజేపీలు. దీంతో ఎమ్మెల్యే గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దనాధన్ మదన్ అని చెవులు కొరుక్కుంటోంది టీఆర్ఎస్ కేడర్.