ఖానాపూర్ కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్ గుదిబండగా మారబోతుందా ? పార్టీ నేతల్లో టికెట్ల పంచాయితీ అప్పుడే మొదలైందా? ఢిల్లీ చుట్టూ నేతలు ప్రదక్షిణలు మొదలు పెట్టారా ?
ఖానాపూర్‌లో ఆదివాసీ, లంబాడాల ఆధిపత్యపోరు..!
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత రమేష్‌రాథోడ్ కమలం కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు ఖానాపూర్ కాంగ్రెస్‌లో పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారు. ఈ నియోజకవర్గంలో ఆదివాసీలు, లంబాడాల ఆధిపత్య పోరు ఉండటంతో ఎవరికి పగ్గాలు అప్పగించాలన్న దానిపై కాంగ్రెస్‌లో తర్జనభర్జన జరుగుతోంది. లంబాడా-ఆదివాసీ వర్గాలు మాకంటే మాకే ఇంఛార్జ్ పదవి ఇవ్వాలని రచ్చకెక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీకోసం ఇప్పటి నుంచే లొల్లి మొదలు పెట్టారు.
కాంగ్రెస్‌లో ముగ్గురు నేతల మధ్య పోటీ..!
ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఇంఛార్జ్‌తో చారులత భేటీ..!
ఖానాపూర్ కాంగ్రెస్‌లో ముగ్గురు పోటీ పడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ అభ్యర్థి చారులత రాథోడ్, భరత్ చౌహన్ , వెడ్మబొజ్జు లాబీయింగ్ చేస్తున్నారు. చారులత, భరత్ చౌహాన్ లంబాడా వర్గానికి చెందిన వారు కాగా.. వెడ్మబొజ్జు ఆదివాసీ వర్గం. చారులత భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. రమేష్ రాథోడ్‌కు బంధువు కూడా. ఉట్నూర్
జడ్పిటీసీగా ఉన్న చారులత ఢిల్లీ వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్‌తోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను కలిశారు. అయితే ఈసారి ఆదివాసీలకు అవకాశం ఇవ్వాలని వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇంద్రవెల్లి సభ ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బొజ్జు. మరోవైపు పార్టీని నమ్ముకుని ఉన్న తనకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భరత్ చౌహన్.
గ్రూప్‌వార్ ఎటువైపు దారితీస్తుందో తెలియడం లేదా?
ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మద్య మొదలైన గ్రూప్ రాజకీయం ఎటువైపు దారితీస్తుందో అన్నది ఆసక్తిగా మారుతోంది. వేరే పార్టీలో తమకు అవకాశం వస్తుందంటే పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా మంతనాలు చేస్తున్నారట. పైగా ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో పీసీసీ చీఫ్ దృష్టి సారించాలని కోరుతున్నారు నాయకులు.
ఆచితూచి నిర్ణయం తీసుకునే పనిలో కాంగ్రెస్..!
ఖానాపూర్ రిజర్డ్వ్ నియోజకవర్గం కావడం.. ఆదివాసీ-లంబాడా నేతల మధ్య వివాదం ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్. మరి.. గతంలో పోటీ చేసిన లంబాడా వర్గానికే ఖానాపూర్ టికెట్ ఇస్తుందా లేక ఆదివాసీ నేతను ఎంచుకుంటుందో చూడాలి.