అక్కడ రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నేత ఉన్నారు. కానీ.. ఆయనతో వర్కవుట్ కాదని కేడర్ అంటోందట. మళ్లీ గెలవాలంటే.. నేతను మార్చాల్సిందే అంటున్నారట. కొత్త నేత ఎవరో కూడా కేడర్ డిసైడ్ చేసిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? కేడర్ వద్దనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు?
కొత్త నేతను సెట్ చేసుకుంటోన్న టీడీపీ కేడర్?
గుంటూరు జిల్లా వినుకొండ. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. వరసగా రికార్డు మెజారిటీతో గెలిచిన జీవీ ఆంజనేయులు మొన్నటి ఎన్నికల్లో అదే రికార్డుస్థాయి మెజారిటీతో ఓడిపోయారు. పార్టీకి మంచిపట్టు, ఆర్థికంగా దిట్టంగా ఉన్నా టీడీపీ ఓడిపోవడానికి కారణం ఆంజనేయులేనని కేడర్ అభిప్రాయపడుతోందట. పని ఏదైనా డబ్బులు వెదజల్లడం అలవాటుగా చేసుకున్న ఆంజనేయులు.. పార్టీపై పట్టు సాధించలేకపోయారట. ఆంజనేయులు ఉంటే ఇక వినుకొండలో టీడీపీ గెలుపు మర్చిపోవడమే అంటోందట ఓ వర్గం. అందుకే ఆంజనేయులు స్థానంలో కొత్త నేతను సెట్ చేసుకుంటోదట కేడర్. ఆయనతో రాయబేరాలు కూడా చేస్తున్నారట.
జీవీ కొత్త పలకరింపులపై టీడీపీలో ఓ వర్గం గుర్రు!
జీవీ ఆంజనేయులు శాసనసభ్యుడిగా ఎంత సక్సెస్ సాధించారో కానీ.. టీడీపీని ఒకతాటిపైకి తేవడంలో విఫలమైనట్టు పార్టీలో ఒకవర్గం అభిప్రాయం. ఉత్తుత్తి సభ్యత్వాలు నమోదు చేసి జబ్బలు చర్చుకోవడం కాదు.. కేడర్‌ను కాపాడుకోవాలని గతంలో అనేకసార్లు ఆయనకు చెప్పారట. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతా అయిపోయాక.. మనం మనం బరంపురం అంటూ కొత్త పలకరింపులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోందట కేడర్. జీవీ ఆంజనేయులు నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. దీంతో వినుకొండలో ఆయన శకం ముగిసినట్టేనన్నది కొందరి చర్చ. నరసరావుపేట లోక్‌సభ పరిధిలోనే వినుకొండ ఉండటంతో.. ఆయన పోటీ చేస్తారని మరికొందరు అనుకుంటున్నారు.
మక్కెనను టీడీపీ అభ్యర్థిగా తీసుకురావాలని ప్రచారం!
ఈ సమయంలోనే వినుకొండ టీడీపీ కేడర్ పార్టీ నాయకుడిగా కొత్త పేరును ప్రచారంలోకి తెచ్చాయి. మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మక్కెన మల్లికార్జున రావు టీడీపీ అభ్యర్థయితే రాబోయే రోజుల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకలా ప్రచారం చేస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు మక్కెన దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో మక్కెన వైసీపీకి జైకొట్టినా.. ఆయనకు అక్కడ ఎలాంటి పదవి లేదు. నిరుత్సాహంగా ఉన్నారని టాక్. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావును పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీలో ఆయన ఉనికి లేకుండా పోయింది. ఆర్థికంగా కూడా ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. పదవిరాక, ప్రాధాన్యం లేక నిర్వేదంలో ఉన్న మక్కెనకు టీడీపీలో చోటు ఇస్తే పార్టీకి తిరుగు ఉండబోదని కొందరి అభిప్రాయం.
జీవీ వల్ల గతంలో ఇబ్బంది పడ్డవారు మద్దతిచ్చే అవకాశం లేదా?
వినుకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతున్న జీవీ ఆంజనేయులుపై నమ్మకం లేదని ముఖం మీదే చెప్పేస్తోందట పార్టీలోని ఒక వర్గం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేడర్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించకపోగా పెదవి చేశారట. ప్రతి గ్రామంలో గ్రూపులు కట్టి తమను పురుగుల్లా చూసారని కొందరి ఆగ్రహం. గతంలో ఆయనవల్ల ఇబ్బందులు పడ్డవారు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారట.
ఎమ్మెల్యేను బొల్లాను ఢీకొట్టాలంటే మక్కెన బెటర్ అని ప్రచారం!
ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లాను ఢీకొట్టాలంటే రాజకీయంగా పట్టున్న మక్కెన బెటర్ అని కొంతమంది అభిప్రాయం అట. జీవీ మాత్రం తాను వినుకొండను వదలను అంటున్నారట. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీకి ఆయన సుముఖంగా లేరట. మరి కేడర్ కోరుకున్నది జరుగుతుందా? ఆంజనేయులు అనుకున్నది జరుగుతుందో చూడాలి.