శత్రువును దెబ్బతీయడానికి రాజకీయాలలో రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థిపార్టీలే కాదు.. సొంత పార్టీ నేతలనూ.. ఇందుకు మినహాయింపు ఇవ్వట్లేదు ఓ నేత వర్గం. పట్టు నిలుపుకోవడానికి.. వర్గాన్ని కాపాడుకోవడానికి.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి.. ప్రత్యర్థి శిబిరాన్ని వీక్ చేసే పనిలో పడ్డారట.
గుంటూరు పశ్చిమలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవలేరా?
రాజకీయాల్లో సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు రాజకీయ నాయకులు. కలిసొచ్చే అంశాలను అస్సలు వదులుకోరు. కలిసిరాదన్నచోట కలవరపాటు కామన్. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆ సెంటిమెంటే అధికారపక్షంలోని రెండువర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. గుంటూరు పశ్చిమ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయినవారు.. రెండోసారి గెలవరని వైసీపీలోని వైరివర్గం చేస్తున్న ప్రచారం ఎమ్మెల్యే మద్దాలి గిరిని కలవరపెడుతోందట. ఆయన ఎమ్మెల్యేగా ఉండేది రెండేళ్లే తర్వాత మనదే టైమ్ అని వైరివర్గం ప్రచారం చేస్తోందట.
గుంటూరు పశ్చిమలో మద్దాలి గిరి వర్సెస్ ఏసురత్నం!
2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మద్దాలి గిరి. ఆ తర్వాత సీఎం జగన్‌కు జైకొట్టారు. నాడు మద్దాలి గిరిపై ఓడిన వైసీపీ నేత చంద్రగిరి ఏసురత్నానికి ఇది రుచించలేదట. ఇంతలో ఏసురత్నాన్ని మిర్చియార్డు ఛైర్మన్‌ను చేశారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఎవరి వర్గం వారిదే. వెస్ట్‌లో పట్టుకోసం రెండు వర్గాలు చేయని ప్రయత్నం లేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కేడర్ చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు.
రాజకీయంగా కనుమరుగైన నేతల చరిత్ర బయటపెడుతున్నారు!
ఇప్పుడు ఏసురత్నంవర్గం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పశ్చిమలో పోటీ చేసిన వారెవరూ రెండోసారి గెలిచిన పరిస్థితి లేదని.. రాజకీయంగా పతనం కావడం ఖాయమనే సెంటిమెంట్ అస్త్రాన్ని చర్చకు పెట్టింది. మద్దాలి గిరి సింగిల్ టైం ఎమ్మెల్యేగా రాజకీయ శూన్యంలోకి వెళ్లడం ఖాయమని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారట. దీనికి ఉదాహరణగా గతంలో పోటీ చేసి గెలిచి రాజకీయంగా కనుమరుగైన నేతల చరిత్ర చిట్టా బయటపెట్టి కేడర్ మైండ్ వాష్ చేస్తున్నారట.
చల్లా వెంకట కృష్ణారెడ్డి మొదలు మోదుగుల వరకు అదే జరిగిందా?
గతంలో గుంటూరు పశ్చిమ నుంచి గెలిచిన చల్లా వెంకటకృష్ణారెడ్డి మొదలుకొని, తాడిశెట్టి వెంకట్రావు, శనక్కాయల అరుణ, కన్నా లక్ష్మీనారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిల పేర్లు ఉదహరిస్తున్నారట. వీరంతా గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలుగా ఓ వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లో వారి ప్రస్తావన లేకుండా పోయింది. శనక్కాయల అరుణ మంత్రిగా పనిచేసినా.. ఇప్పుడు ఆమెను ద్వితీయ శ్రేణి నాయకురాలిగా కూడా గుర్తించని పరిస్థితి. పెదకూరపాడులో వరసగా విజయఢంకా మోగించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైతం గుంటూరు పశ్చిమ సెంటిమెంట్ దెబ్బకు తలవంచక తప్పలేదు. ఒకసారి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసి.. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చిన కన్నా.. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా గొప్ప విజయాలు సాధించలేకపోయారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి కూడా ఇదే సెంటిమెంట్ వెంటాడింది.
సెంటిమెంట్ నిజమేనేమో అన్నంతగా ప్రచారం!
ఆలోచనలో పడుతున్న ఎమ్మెల్యే శిబిరం!
ఇలా వరసగా అనేక మంది గుంటూరు పశ్చిమలో ఒకసారి గెలిచిన తర్వాత రాజకీయంగా ఎదుగూ బొదుగూ లేకుండా పోవడంతో.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారట ఏసురత్నం అండ్ కో. నిజమేనేమో అన్నంతగా వారి ప్రచారం ఉంటోందట. దీంతో ఎమ్మెల్యే మద్దాలి గిరి వర్గం సైతం అవునా అని మథన పడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు, విమర్శలు కామన్. కానీ.. గుంటూరు పశ్చిమలో మాత్రం సెంటిమెంట్‌ను బలంగా ప్రచారం చేసి వైరి వర్గాలను ఆలోచనలో పడేస్తున్నారని అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఈ ప్రచారాన్ని పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారో లేదో కానీ.. నియోజకవర్గంలో చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. మొత్తానికి ఎమ్మెల్యే మద్దాలి గిరి.. మిర్చియార్డు ఛైర్మన్ ఏసురత్నంలకు మధ్య ఉన్న కోల్డ్‌వార్‌కు సెంటిమెంట్ జత కావడం ఆసక్తిగా మారింది. మరి.. రానున్న రోజుల్లో ఈ ప్రచారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.