పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని పోలీసులు పేకాట ఆడుతూ దొరికిన వాళ్లను వేరే జిల్లాలో వదిలేయాల్సి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రూటు మార్చిన పేకాట మాఫియా!
గుంటూరు జిల్లా పేకాటకు హబ్‌గా మారింది. జిల్లాలో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు పేకాట ఆడిస్తున్నారని ఓపెన్‌గానే చెబుతున్నారు. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పేకాట రాయుళ్లు, నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అయితే జిల్లాలోని చిలకలూరిపేటలో పరిస్థితి వేరేలా ఉందట. పోలీసులు రైడ్, అరెస్ట్ చెయ్యడం, మళ్లీ పేకాట ఆడించడం రొటీన్‌గా మారింది. దీంతో పేకాట మాఫియా రూట్ మార్చేసిందట. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు అధికారపార్టీ నేతలు పక్కా ప్లాన్‌తో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.
read also : కేటీఆర్ బర్త్ డే : ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
గుంటూరు, ప్రకాశం జిల్లా బోర్డర్‌లో కోళ్లఫారాల్లో పేకాట
చిలకలూరిపేట మండలం అనంతారం కోళ్లపారంలో భారీస్థాయిలో పేకాట నిర్వహిస్తున్నట్టు ఎస్పీకి సమాచారం అందింది. స్పెషల్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. పారిపోతున్న పేకాటరాయుళ్లను పోలీసులు వెంటపడి మరీ పట్టుకున్నారు. అయితే సంఘటనా స్థలం నుంచి వందమీటర్లు దాటితే ప్రకాశం జిల్లా వస్తుంది. కొంతమంది గుంటూరు జిల్లా పరిధిలోనే పట్టుకుంటే.. ఇంకొందరిని ప్రకాశం జిల్లాలో పట్టుకున్నారట. పేకాట ఆడుతోంది గుంటూరు జిల్లాలో కావడంతో అందరినీ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడే సీన్ రివర్స్ అయిందట.
ఓమంత్రి, మరో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు చిక్కారా?
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారపార్టీ నేతలు కొందరు ఉన్నారట. దీంతో రెండు జిల్లాల పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయట. ఒక జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు.. మరో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సన్నిహితులు పోలీసులకు చిక్కడంతో వారినివదిలేయాలని గట్టిగానే ప్రజాప్రతినిధులు కోరినట్టు సమాచారం. దీంతో నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఐదు గంటల వరకు గుంపు చింపులు పడ్డారట ఖాకీలు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేత అయితే.. ఎలా కేసు పెడతారని ఒంటి కాలిపై లేచారట. దీంతో సీన్ గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మారింది.
ఒత్తిళ్లు భరించలేక ప్రకాశం జిల్లాకు తరలించేశారా?
చిలకలూరి పేట పోలీస్ స్టేషన్‌కు ఒక ఆర్టీసీ బస్సును తీసుకొచ్చి నిందితులను ప్రకాశం జిల్లాకు తరలించారు. వారిని యద్ధనపూడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారట. ఒత్తిళ్లు భరించలేక గుంటూరు జిల్లా పోలీసులు చేతులు కడిగేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి నేతల ఎంట్రీతో పేకాట ఒక చోట జరిగితే కేసులు ఇంకో జిల్లాలో పెట్టడం ఖాకీలకే చెల్లిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిన చేయొచ్చని ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనాలు.