పేరుకు అభివృద్ధి అని చెబుతున్నా.. అధికారపార్టీని ఇరుకున పెట్టేలా వైరిపక్షాలు అడుగులు వేస్తున్నాయా? భద్రాచలంలో.. ఆ ఐదు గ్రామాల అంశాన్ని మళ్లీ రోడ్డెక్కించడం వెనక వ్యూహం అదేనా? ఢిల్లీ స్థాయిలో కదలిక తేవాల్సిన చోట.. లోకల్ పాలిటిక్స్ వేడి పుట్టిస్తాయా? ఇంతకీ ఆ ఐదు గ్రామాల రగడేంటి?
ఐదు గ్రామాల విలీనంపై ఇరుకున పెట్టే రాజకీయాలు!
భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి ఉంది. వీటిని వెనక్కి తీసుకొస్తేనే భద్రాచలం సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వాదన రాజకీయ పక్షాల్లో ఉంది. అయితే ఇది సంక్లిష్టమైన డిమాండ్. ఏపీలో కలిసిన ఈ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణలో కలుస్తాయో లేదో తెలియదు. కానీ.. రాజకీయ పార్టీలకు మాత్రం ఎన్నికల అస్త్రంగా.. అధికారంలో ఉన్న పార్టీలను ఇరుకున పెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా అఖిలపక్షం పేరుతో ఐదు గ్రామాల విలీనం డిమాండ్‌ను మరోసారి తెరపైకి తేవడంతో మళ్లీ చర్చ మొదలైంది.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ!
ఐదుగ్రామాలపై ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ముంపు గ్రామాల్లో ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు పర్యటనలు చేస్తున్న సమయంలో వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్పై ఒత్తిడి పెంచుతున్నారని అనుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య యాక్టివ్ పార్టిసిపేషన్ చూస్తుంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు అధికార పార్టీ నేతలు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే విలీనం రగడ ఎత్తుకున్నారా?
ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్య జల జగడం నడుస్తోంది. ఈ సమయంలోనే ఐదు గ్రామాల గురించి ప్రస్తావిస్తే మళ్లీ కదలిక వస్తుందన్నది అఖిలపక్ష భేటీలో పాల్గొన్న వక్తల అభిప్రాయం. అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా భద్రాచలానికి ఏమీ చేయడం లేదని పోదెం వీరయ్యపై టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఆ విమర్శల నుంచి బయటపడటానికి.. ప్రజల దృష్టి మళ్లించడానికి అఖిలపక్షం పేరుతో ఎమ్మెల్యే కొత్త ఎత్తుగడ వేశారని భావించేవారూ ఉన్నారు.
ఐదు గ్రామాలు పార్టీలకు ప్రచార వస్తువులా?
ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా.. ఐదు గ్రామాల అంశం మాత్రం పార్టీలకు ప్రచార వస్తువుగా మారిపోయాయి. ఏపీ, తెలంగాణ చర్చించి.. ఒక అవగాహనకు వస్తేగానీ.. కేంద్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు వీటిపై ఫోకస్ పెట్టే అవకాశం లేదు. ఆ విషయం అఖిలపక్ష నేతలకు కూడా తెలుసు. అయినప్పటికీ కేవలం రాజకీయ లబ్ధికోసం గొంతు సవరించడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.