నాడు గెలిపించిన పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ వన్. నేడు ఆయన కొనసాగుతున్న పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ 152. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నియోజకవర్గంలో గెలిపించిన పార్టీ వాళ్లు వదిలేశారు. పంచన చేరిన పార్టీ వాళ్లు పట్టించుకోవడం మానేశారు. కో- ఆర్డినేటర్లను మార్పించేసిన ఆ ఎమ్మెల్యే… నియోజకవర్గం కేడర్‌ను గెలవలేకపోతున్నారట.
వైసీపీ కేడర్ దగ్గర కాలేదా?
తూర్పుగోదావరిజిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయాల్లో ఓ డిఫెరెంట్ నేత. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేగానే ఉంటూ నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్రమంతా బహిరంగంగానే ఆ విషయం చెబుతూ తిరుగుతున్నారు కూడా. దీంతో రాజోలు నియోజకవర్గంలోని జనసేనపార్టీ నేతలు, కార్యకర్తలు రాపాకకు దూరమయ్యారు. వైసీపీ కార్యకర్తలు ఏమైనా దగ్గరయ్యారా అంటే అదీ లేదట.
కోఆర్డినేటర్లతో విభేదాలు.. అధిష్ఠానం దగ్గర పంచాయితీ!
రాజోలులో రాపాక ఒంటరి?
మొదట్లో రాజోలు నియోజకవర్గం వైసీపీ కో-ఆర్డినేటర్‌గా ఉన్న బొంతు రాజేశ్వరరావుకు అధిష్ఠానంతో చెక్ పెట్టించారు రాపాక. తరువాత రాజోలు కో-ఆర్డినేటర్‌గా కొనసాగిన తుని నియోజకవర్గానికి చెందిన ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ పెత్తనం చెలాయించారు. కో-ఆర్డినేటర్లతో విభేదాలకు వెళ్లి.. ఎమ్మెల్యే రాపాక అధిష్ఠానం వద్ద మళ్లీ పంచాయితీ పెట్టించారు. దీంతో అమ్మాజీ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం పేరుకే అమ్మాజీ కో-ఆర్డినేటర్ తప్ప పెత్తనం ముద్ర లేదు. కుమారుడిని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చించి రాజోలు వైసీపీకి అంతా తనేనని చెప్పుకొని తిరుగుతున్నారు రాపాక. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం రాపాక దరి చేరడం లేదు. జనసేనలో నెంబర్ వన్, వైసీపీలో 152వ ఎమ్మెల్యే అయినా రాజోలులో మాత్రం రాపాక ఒంటరయ్యారట.
రాజకీయ పరిణామాలను అనుకూలంగా మలుచుకునే యత్నం
ప్రస్తుతం వైసీపీకి మద్దతుదారుడిగానే రాపాక కొనసాగుతున్నారు. వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ తొలిరోజే సీఎం జగన్‌ను కలుసుకోవడంతో వైసీపీలో చేరిపోయారనే ప్రచారం సాగింది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక… 2019లో రెండవసారి జనసేన నుంచి గెలుపొందారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాపాక ఆసాకుతో రాజోలు వైసీపీలో రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు జనసేన, ఇటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాపాకకు దూరమయ్యారు.
అధికారిక కార్యక్రమాలకే పరిమితం!
కో-ఆర్డినేటర్ అమ్మాజీ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి అడ్డంకులు తొలగిపోయాయి. కేడర్ వెంట రాకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి, అధికారిక కార్యక్రమాలకే పరిమితం అయ్యారట. దీంతో పుట్టింటోళ్లు తరమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు.. అయ్యో పాపం రాపాక అంటూ.. ప్రస్తుత పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నారట.