పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ కామన్. అభిమానులు బూతులు తిట్టుకోవడం ఇంకా కామన్. ఇవి శ్రుతిమించి పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు రూటు మార్చేశారట. దానిపైనే ఇప్పుడు రాజకీయ.. పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎన్నికల్లో సోషల్ మీడియా పోస్టింగ్‌లకే డిమాండ్
ఎదుటివారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కామెంట్స్
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వినియోగం పెరిగిన తర్వాత రాజకీయ పార్టీల మధ్య వైరం కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం పార్టీలే కాకుండా .. ఆయా పార్టీలను అభిమానించేవాళ్లు సైతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పోస్టులు పెడుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్‌పై అవగాహన.. గ్రాఫిక్స్‌పై పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు .. కనికట్టు చేస్తున్నారు. మన దేశంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారం ప్రధాన పార్టీలకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. కొత్తలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు.. కామెంట్లు హుందాగా ఉన్నా.. తర్వాత కట్టు తప్పాయి. బూతులు.. మార్ఫింగ్‌లు..! ఇష్టం లేనివారిని తిట్టాలంటే గతంలో వెనకా ముందు ఆలోచించేవారు. ఇప్పుడు క్షణాల్లో పోస్టింగ్‌లు వచ్చేస్తున్నాయి. ఎదుటి వారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే రీతిలో కామెంట్లు.. పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఇప్పుడది ఎక్కడికో వెళ్లిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు రెండు పార్టీల శ్రేణులు.. మద్దతుదారులు.
ఎమ్మెల్యేలు, మంత్రులపై ట్రోలింగ్
ఎమ్మెల్యేలు, మంత్రులు.. పార్టీ నేతలు ఏదైనా మాట్లాడితే క్షణాల్లో ఇంటర్నెట్‌లో ట్రోల్ చేస్తున్నారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపుగా.. అబద్దం ఉరంతా తిరిగొచ్చినట్టుగా సోషల్ మీడియా పోస్టింగ్‌లు ఉంటున్నాయి. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో అల్లాడిస్తున్నారు. శ్రుతిమించిన సామాజిక మాధ్యమాల పోస్టింగ్‌లపై పోలీస్‌లు కేసులు పెడుతున్నారు. సంబంధిత వ్యక్తులను పట్టుకుని కటకటాల్లో వేస్తున్నారు. అధికారంలో ఉన్నవారిపై ఎవరైనా తప్పుడు పోస్ట్ పెడితే ఇక వారి పని అయిపోయినట్టే అనే అభిప్రాయం జనాల్లో ఉంది.
కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు
సోషల్ మీడియా పోస్టింగ్‌లపై ఆయా పార్టీల ప్రతినిధులు నిత్యం ఎక్కడో ఒక చోట పోలీసులకు ఫిర్యాదు చేయడం కామనైపోయింది. దీంతో కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడ వేశాయి. తమకు తోచింది సోషల్ మీడియాలో పెడుతూనే ప్రత్యర్థులకు చిక్కడంలేదు. దేశంలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎక్కడున్నా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అందుకే విదేశాల నుంచి పోస్టింగులు పెట్టడం మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితమే ఓ రాజకీయ పార్టీ దీనికి శ్రీకారం చుట్టింది.
ఫిర్యాదు చేసినా చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు లక్షల సంఖ్యలో విదేశాల్లో ఉన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. పార్టీపై ఉన్న అభిమానంతో తమ నేతలను ఏమైనా అంటే ఊరుకోకుండా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదులు వచ్చినా ఏం చెయ్యలేని పరిస్థితి. విదేశీ సర్వర్ల నుంచి పోస్టింగ్‌లు పెడుతుండడంతో చర్యలు తీసుకోలేకపోతున్నారట. దీంతో కొత్తగా మరోపార్టీ కూడా ఇదే రూట్ ఫాలో అవడం మొదలు పెట్టింది. విదేశాల్లో ఉన్న తమ పార్టీ అభిమానులతో ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌లలో పోస్టింగులు పెట్టిస్తున్నారట.
అధికారపార్టీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని పోస్టింగ్
అధికారపార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఓ యువకుడు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు. ఆ విషయం తెలిసిన మహిళా ఎమ్మెల్యే.. ఆ వ్యక్తి ఎవరనేది ఆరా తీయాలని పోలీసులను ఆదేశించారు. ఆ వ్యక్తి మరో దేశంలో ఉన్నట్టు గుర్తించారు. ఆ పోస్ట్ కూడా విదేశీ సర్వర్ నుంచి పోస్టు చేసినట్టు తేల్చారు. అయితే సదరు వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పడంతో ఆ మహిళా ఎమ్మెల్యే సైలెంట్ అయినట్టు సమాచారం.
మరో ఎమ్మెల్యే అవినీతి చిట్టాపైనా పోస్టులు వైరల్
సీమకు చెందిన ప్రజాప్రతినిధిపై వరసగా పోస్టింగ్‌లు
ఇదే విధంగా ఓ ఎమ్మెల్యే అవినీతిపై పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఆ ఎమ్మెల్యే ఏకంగా డీజీపీని కలిసినట్టు సమాచారం. ఆ పోస్టింగ్ కూడా విదేశాల్లో ఉన్న ఓ వ్యక్తి పెట్టినట్టు గుర్తించారు. ఇతర దేశాల్లో ఉంటూ పోస్టింగులు పెడితే ఏం చేయలేమని పోలీసులు చెప్పడంతో ఆ నేత వెనుదిరిగినట్టు చెబుతున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి గురించి కూడా ఇదే తరహాలో విదేశాల్లో ఉన్న వ్యక్తులు భారీఎత్తున పోస్టింగులు పెడుతున్నారు. రాయలసీమకు చెందిన ఓ ప్రజాప్రతినిధిపై కూడా వరసగా పోస్టింగులు వస్తున్నాయి. కొత్తగా ఒక్కో ప్రజాప్రతినిధి అవినీతి గురించి ఒక్కో వారం చెబుతామంటూ టీజర్లు కూడా వదులుతున్నారు. ఈ టీజర్లే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.
విదేశాల్లో రెండు పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్
మొత్తానికి సోషల్ మీడియాలో వార్ ఏపీ నుంచి విదేశాలకు చేరింది. అక్కడి నుంచే రెండు పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం నేతలకు ఇబ్బందిగా మారుతుంది. సమస్యకు పరిష్కారం కనుగొనే వరకు ప్రజాప్రతినిధులకు నిద్రపట్టదనే చెప్పాలి.