ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య అస్సలు పడటం లేదు. ఆ ప్రభావం పార్టీ కమిటీలపైనా పడింది. మరోసారి ఆధిపత్య పోరుకు దారితీసింది. ఒక నియోజకవర్గం.. రెండు కమిటీలుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఏంటో.. లెట్స్ వాచ్!
తాండూరులో ఎవరి కమిటీ వారిదే..!
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో నిలిచారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నేతలందర్ని ఆదేశించింది. ఇప్పుడు ఆ ఆదేశాలే వికారాబాద్ జిల్లాలో సమస్యకు కారణంగా మారాయి. జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ మండలాల్లోని పార్టీ ముఖ్యనేతలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, తాండూరు, యాలాల్, పెద్దేముల్ మండలాల్లో అన్ని గ్రామాల్లో కమిటీల ఎంపిక పూర్తయింది. ఈ నాలుగు మండలాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు తమ అనుచరులను గ్రామ కమిటీల్లో నియమించారు. కాకపోతే ఎవరి కమిటీ వారిదే కావడంతో చర్చగా మారింది.
గ్రామ స్థాయిలోనూ రెండుగా చీలిన కేడర్!
రెండు టీఆర్ఎస్ కమిటీలు సమావేశాలు పెట్టుకుని.. జెండా పండగులు, జెండా ఆవిష్కరణలు చేస్తున్నాయి. దీంతో ఎవరి కార్యక్రమానికి వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతోంది కేడర్. పైగా రెండు వర్గాలు ఎదురు పడితే ఘర్షణ తప్పదన్నట్టుగా ఉంటోందట. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఆశీస్సులు దండి ఉండటంతో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న గొడవలు ఇప్పుడు గ్రామస్థాయికి వ్యాపించడంతో కేడర్ రెండుగా చీలిపోయింది.
తాండూరు మున్సిపాలిటీలోనూ రెండు వర్గాల పోరు!
రోహిత్‌రెడ్డి, పట్నం మధ్య ఉన్న మనస్ఫర్ధలు జిల్లా అంతటా వ్యాపిస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాల టాక్. ఇటీవల తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేకు, ఆయన అనుచరులకు ఆగ్రహం తెప్పించాయట. అప్పటి నుంచి ఎమ్మెల్సీ వర్గానికి చెందిన చైర్‌పర్సన్ స్వప్నను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారట ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. పట్నం అనుచరులు ఓపెన్‌గానే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు.
పట్నం వర్గానికి చెందిన ఛైర్‌పర్సన్‌పై పైలెట్ గురిపెట్టారు?
ఆ మధ్య గల్లీ గల్లీకి పైలెట్ పేరుతో రెండు దఫాలుగా మున్సిపాలిటీలోని అన్నీ వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. చివరిరోజు ఓ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ నేత మధ్య వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే సమక్షంలోనే చెప్పుతో కొడతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వప్న. తన ముందే అనుచరున్ని బెదిరించిడంతో స్వప్నకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారట రోహిత్‌రెడ్డి. కొద్ది రోజుల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెడతారని.. ఆమెను ఇంటికి సాగనంపుతారని అనుమానిస్తోందట పట్నం వర్గం. దీంతో తాండూరులో ఆధిపత్య రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు కమిటీల రూపంలో అది బయటపడింది. మరి.. ఇక్కడి వర్గపోరుకు పార్టీ నేతలు ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.