రెండేళ్లుగా గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కొట్టిన ఆ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఎంపీతో ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారా? ఎంపీ వస్తున్నారని తెలిస్తే.. వేరే పని ఉందని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారా? ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏ విషయంలో బెడిసికొట్టింది. ఎవరు వారు?
కేడర్‌తో ఎమ్మెల్యే కిరణ్‌కు దూరం వచ్చిందా?
శ్రీకాకుళం ముఖ ద్వారం ఎచ్చెర్ల పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. నేను లోకల్ అంటూ గత ఎన్నికల్లో బరిలో దిగిన గొర్ల కిరణ్‌కుమార్‌కు ఓటర్లు పట్టం కట్టారు. నిత్యం అందుబాటులో ఉంటారని కేడర్ భావిస్తే.. అది ఆర్నెళ్ల ముచ్చటే అయిందట. కరోనా టైమ్‌లో అడపాదడపా కార్యక్రమాలు చేసి విశాఖ వెళ్లిపోయేవారు. ఈ వైఖరితో విసుగెత్తిపోయిన కేడర్.. తమ అసంతృప్తిని పంచాయతీ ఎన్నికల్లో బయటపెట్టాయి. ఎచ్చెర్ల మండల వైసీపీ నేత జరుగుళ్ల శంకర్ తన భార్యకు ఎంపీపీ ఆశిస్తే … ఆయన్ను కాదని ఎమ్మెల్యే వేరేవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో శంకర్ 11 మంది ఎంపీటీసీలతో రెబల్‌గా నామినేషన్ వేయించారట. ఈ పంచాయితీ.. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ దగ్గరకు చేరుకుంది. ఇదే తరహాలో బల్లాడ జనార్దన్ రెడ్డి అనే మరో నేత జడ్పీటీసీ ఆశిస్తే …ఎమ్మెల్యే నో అన్నారట. జనార్దన్ కూడా నేరుగా పెద్దాయన నుంచే బీఫారం తెచ్చుకున్నారట.
కొత్త ప్రచారం ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తోందా?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్నెల్ల క్రితం జి.సిగడాం మండల వైసీపీ నేతలు కార్యకర్తలు వెళ్లి నేరుగా ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారట. దీంతో క్యాడర్‌కు నచ్చజెప్పిన ఆయన.. ఇకనుంచి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో టచ్‌లో ఉండలని చెప్పారట. అంతా ఎంపీనే చూసుకుంటారని సర్ది చెప్పినట్టు చెబుతున్నారు. ఆ విధంగా ఎమ్మెల్యే పై అసంతృప్తితో ఉన్నవారిని ఎంపీకి అటాచ్ చేస్తుండటంతో ఎచ్చెర్ల రాజకీయంపై కొంతకాలంగా మరో చర్చ నడుస్తోంది. ఈ విధంగా మారిన పరిణామాలు ఎమ్మెల్యే కిరణ్‌కు తలబొప్పి కట్టిస్తుంటే.. ఇప్పుడు కొత్త ప్రచారం నిద్రలేకుండా చేస్తోందట.
read also : తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ !
ఎచ్చెర్ల నుంచి ఎంపీ చంద్రశేఖర్ పోటీ చేస్తారా?
జిల్లాల పునర్విభజన జరిగితే ఎచ్చెర్ల శ్రీకాకుళం నుంచి విజయనగరంలో కలుస్తుంది. అప్పుడు ఎంపీ చంద్రశేఖర్.. ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చని పార్టీలో చర్చ జరుగుతోందట. అది తెలిసినప్పటి నుంచి తెగ టెన్షన్ పడుతున్నారట ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీల మధ్య గ్యాప్ వచ్చినట్టు సమాచారం. ఇద్దరూ ఎడముఖం.. పెడ ముఖంగా ఉంటున్నారట. ఎచ్చెర్లకు ఎంపీ వస్తున్నారని తెలిస్తే ఎమ్మెల్యే కిరణ్ కలవడం లేదట. తనకు వేరు పని ఉందని చెప్పి కిరణ్ తప్పించుకుంటున్నట్టు టాక్. పార్టీ పెద్దలు ఎచ్చెర్లలో కేడర్‌ను కూడా చూసుకోవాలని చెప్పినా… ఫ్రీ హ్యాండ్ తీసుకోవడం ఇష్టం లేని ఎంపీ చంద్రశేఖర్.. అక్కడికి వెళ్లడానికి తటపటాయిస్తున్నారట. ఎమ్మెల్యే లేకుండా ఎచ్చెర్లకు వెళ్లడం సరికాదని డ్రాప్ అవుతున్నారట ఎంపీ.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎంపీ, ఎమ్మెల్యే!
ప్రస్తుతం ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటున్నారు. దీంతో ఈయన రాడు.. ఆయన రాలేడు అని ఇద్దరి గురించి ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. అయితే ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. చంద్రశేఖర్ ఎక్కువగా ఎచ్చెర్లలో తిరిగితే.. ఆయనకు వర్గం తయారవుతుంది. కేడర్ ఆయనకు చేరువ అవుతుంది. అది ఇష్టం లేని ఎమ్మెల్యే.. ఎంపీ పాల్గొనే కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారట. ఎంపీని ఎచ్చెర్లకు రాకుండా అడ్డుకోవాలంటే ఇదొక్కటే మంత్రమని అదే పాటిస్తున్నారట కిరణ్. ఇప్పటిక ఇది వర్కవుట్ అవుతున్నా.. అసంతృప్తితో రగిలిపోతున్న కేడర్‌ను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు ఆదేశిస్తే ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తారో చూడాలి.