Polavaram Project :
పోలవరంపై ఆ జిల్లా ప్రజాప్రతినిధులు తడబడ్డారా..? తొందరపడ్డారా? టీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ఎమ్మెల్యేల వివరణ వెనక ఏం జరిగింది? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..!
భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఊళ్లు ఇంకా వరద నుంచి తేరుకోలేదు. తెలంగాణలో భద్రాచలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతల్లో జల విలయంతో జనం ఇక్కట్లు వర్ణణాతీతం. ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టింది కూడా. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ పర్యటనలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి తీసుకుంటే భద్రాచలానికి గోదావరి వరదల నుంచి శాశ్వత విముక్తి ఉంటుందనే చర్చ సాగిందట. దానికేం చేయాలో కొంత ఆలోచన సాగినట్టు సమాచారం. ఇంతలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మీడియా ముందు చేసిన కామెంట్స్ మొత్తం వ్యవహారాన్ని ఇంకో మలుపు తిప్పాయి.
పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం మునిగిందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు చెప్పడంతో.. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా సానుకూల వాతావరణంలోనే సాగుతోంది. అయితే భద్రాచలం మునక.. పోలవరం ప్రాజెక్టుపై నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీ, తెలంగాణ మధ్య ఒక్కసారిగా హీట్ పెరిగింది. దీంతో సమస్య ఎటేటో పోతుందని అనుకున్నారో ఏమో.. టీఆర్ఎస్ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారట.
వరద బాధితుల ఆవేదన అర్థం చేసుకోవాలి.. అపార్థాలకు తావు లేదని.. ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధుల నుంచి ప్రకటన రావడంతో అందరి దృష్టీ అటు మళ్లింది. నేతలు ఎందుకు వివరణ ఇచ్చారు. ఏం జరిగింది అని మరికొందరు ఆరా తీశారు.
ఏపీ తెలంగాణ మధ్య గ్యాప్ రాకుండా పార్టీ పెద్దలు క్లాస్ తీసుకోవడం వల్లే ఆ ప్రకటన వచ్చిందని గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఆ మధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్‌పై.. ఏపీ నుంచి గట్టిగానే రియాక్షన్స్ వచ్చాయి. తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా అని ప్రస్తుత ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆ అంశాన్ని గుర్తు చేసుకుంటున్నారట. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు తడబడ్డారా? తొందరపడ్డారా? అనే చర్చ గులాబీ శిబిరంలో గట్టిగానే జరుగుతోందట.