గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ హవా కొనసాగినా ఆ నియోజకవర్గంలో మాత్రం ఎదురుగాలి తప్పలేదు. ఎన్నికలు ముగిసి మూడున్నరేళ్లయినా అక్కడ పార్టీ పరిస్థితి కుదటపడకపోగా.. మరింత దిగజారుతోందని నెత్తీనోరు బాదుకుంటున్నారు నేతలు. పక్క నియోజకవర్గనేతల పెత్తనానికి చెక్‌పెట్టడంతోపాటు ఇంఛార్జ్‌ను మారిస్తే తప్ప ఫలితం ఉండబోదని లెక్కలేసి మరీ చెప్పుకొస్తున్నారట. మరి.. అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
పాలకొల్లుపై వైసీపీ ప్రత్యేక ఫోకస్
పాలకొల్లు. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 8 ఎన్నికల్లో ఇక్కడ ఆరుసార్లు విజయం ఆ పార్టీదే. అలాంటి నియోజకవ్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది వైసిపి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కనిపించినా పాలుకొల్లులో మాత్రం సైకిల్ సత్తా చాటడంతో పార్టీ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ ఎన్నికల్లో పోటి చేసి ఓడిన డాక్టర్ బాబ్జీని పక్కన పెట్టి జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న బీసీ నేత కవురు శ్రీనివాస్‌ను ఇంఛార్జీగా ప్రకటించారు. కవురు నియామకాన్ని ముందు నుంచి స్థానిక నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బలమైన నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ఓడించాలంటే ఆయన సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతలకే ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించాలని లేదంటే ఫలితం ఉండబోదని చెబుతున్నారట. కేడర్ విజ్ఞప్తులు, వాళ్ల చెప్పే కులాల లెక్కల్ని పట్టించుకోని అధిష్టానం కవురు శ్రీనివాస్‌నే కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఐ ప్యాక్ టీమ్స్ చేసిన సర్వేలో పాలకొల్లులో పార్టీ పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదని.. కారణాలు చాలానే చెప్పుకొచ్చారట. అప్పటి నుంచి ఆలోచనలో పడ్డ అధిష్ఠానం మరోసారి పాలకొల్లులో ఇంఛార్జీని మార్చబోతుందనే ప్రచారం గుప్పుమంటోంది.
కాపు, గౌడ నేతలకు కవురు ప్రాధాన్యం ఇవ్వడం లేదట
కవురు శ్రీనివాస్ అన్ని వర్గాలను కలుపుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా అందులో పార్టీ కీలక నేతలు ఎవ్వరు ఉండటం లేదట. కవురు స్థానిక నేత కాకపోవడం, నియోజకవర్గంలో కీలకంగా నిలిచే కాపు, గౌడ సామాజికవర్గ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. ఆయా వర్గాల్లోని టిడిపి నేతలను కవురు పక్కన పెట్టుకోవడం ఆయనకు మైనస్ అవుతోందట. ఆ మధ్య నిర్వహించిన వనభోజనాల్లోనూ బీసీల్లోని ఒకవర్గానికే కవురు ప్రయారిటీ ఇచ్చారనే విమర్శలు ఎక్కువ అయ్యాయి. పైగా పాలకొల్లులోని సీనియర్ నేతలపై అధినేతకు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారని టాక్. దీంతో కవురు దెబ్బకు సెగ్మెంట్‌లోని చాలామంది సీనియర్లు పార్టీకి దూరంగా జరుగుతున్నారట. కవురు తీరుతో పార్టీ ఇమేజ్ పెరగడం సంగతి పక్కన పెడితే డ్యామేజే ఎక్కువైందని సొంతపార్టీ నేతల మాట.
ముగ్గురు కీలక నేతల మధ్య సయోధ్యకు విఫలయత్నం
పాలకొల్లు రిపోర్టులను పరిశీలించిన అధినేత నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నేతలు ఏకం కావాలని చెప్పుకొచ్చిన ఫలితం లేదు. నియోజకవర్గ ఇంచార్జిగా కవురు కాకుండా కాపు సామాజికవర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తామని సీనియర్లు చెప్పుకొచ్చారట. కవురుతో వచ్చే సమస్య ఒక్కటైతే.. పక్క నియోజకవర్గమైన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాలకొల్లు రాజకీయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారట. దీంతో పార్టీ పరిస్థితి ఎటూ కాకుండా పోతుందని కంప్లయింట్ చేశారట. గత నెలలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలోనూ నేతలు వేర్వేరుగా పాల్గొన్నారు. కవురుకంటే ముందే మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ వచ్చి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తర్వాత కవురు వచ్చారు. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన పార్టీ పరిశీలకులు ముగ్గురు కీలక నేతలు కవురు శ్రీనివాస్, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీల మధ్య సయోధ్యకు విఫలయత్నం చేశారు. ఆ సమావేశంలోనే ముగ్గురు నేతలు తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా సమాచారం. దీంతో పాలకొల్లు విషయంలో వైసీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.