ఇల వైకుంఠంలో ఆయన సామాన్య భక్తులకు ప్రాధాన్య ఇవ్వాలన్నారు. తమ అనుచరులకు బాగా దర్శనం జరిగితే చాలనుకుంటున్నారు వాళ్లు. దర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తే తూట్లు పొడుస్తున్నారు కూడా. ఇంతకీ ఆయన తెచ్చిన మార్పులేంటి? అడ్డుపడుతున్నవారు ఎవరు? లెట్స్ వాచ్!
అనుచరులకు ప్రొటోకాల్ దర్శనం కోరుకుంటున్న ప్రజాప్రతినిధులు!
టీటీడీ పాలకమండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేశారు. అందరికీ ఒకే దర్శనం విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులకు ముందుగా దర్శనం కల్పించి.. తర్వాత సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనం భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. ప్రొటోకాల్ అంటే స్వామివారి ముందు తీర్థం, శఠారి ఇస్తారు. అది ప్రొటోకాల్ లిస్ట్‌లో ఉండే సీఎంలు, గవర్నర్‌లు, కేంద్రమంత్రులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిలభారత సర్వీస్ అధికారులు ఉంటారు. అంతకుముందు ఎల్1, ఎల్ 2, ఎల్ 3 ఉన్నప్పుడు ఈ ప్రొటోకాల్ లిస్ట్‌లో చాలా మందే వచ్చేవాళ్లు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడంతో తమలాగే తమ అనుచరులకు స్వామి వారి ముందు సకల మర్యాదలు కోరుకుంటున్నారు నేతలు.
ఛైర్మన్ నిర్ణయాలకు సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు తూట్లు!
కొత్త పద్ధతిలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించే వెసులుబాటు టీటీడీకి లభించింది. చైర్మన్ సుబ్బారెడ్డి నిర్ణయంపట్ల భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ.. రాష్ట్రంలోని కొంతమంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం వీటికి తూట్లు పోడిచేలా వ్యవహరిస్తూ.. ఆరోపణలకు ఆస్కారం ఇస్తున్నారు.
36 మందితో వచ్చిన మంత్రి వేణుగోపాల్
55 మందితో వచ్చిన మంత్రి జయరాం
కొంతమంది ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు కూడా ప్రొటోకాల్ దర్శనాలు కల్పించాలని టీటీడీపై ఒత్తిడి చేస్తున్నారు. చైర్మన్ ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తీసుకొచ్చిన దర్శనం విధానంలో మార్పులు చేసేందుకు అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ప్రజాప్రతినిధులు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. తాము సిఫారసు చేస్తే ప్రొటోకాల్ దర్శనాలను టీటీడీ అధికారులు కేటాయించకపోవడంతో అనుచరుల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అనుచరులతో కలసి స్వయంగా తిరుమలకు వస్తున్నారు. ఆగస్టు 1న మంత్రి వేణుగోపాల కృష్ణ 36 మందితో ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లితే.. మరో మంత్రి జయరాం 55 మందితో గుళ్లోకి వెళ్లారు. ఇదే విధంగా మిగతా మంత్రులు కొండకకు వస్తున్నారు.
అనుచరులు అడిగితే వారానికి ఒకసారైనా కొండెక్కే డిప్యూటీ సీఎం?
చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుచరులు అడిగితే డిప్యూటీ సీఎం వారానికి ఒక్కసారి కొండా ఎక్కాల్సిందే. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దర్శనం చేయించడం కోసం టీటీడీ చైర్మన్ తిరుమల వచ్చారు. అదేరోజు అనుచరులతో దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం..కిషన్‌రెడ్డి పర్యటనను లైట్ తీసుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలైతే రోజు మార్చి రోజు తిరుమల వచ్చేస్తున్నారు. ఇదంతా స్వామి వారి మీద ఉన్న భక్తి అనుకుంటే పొరపాటే. భక్తితోపాటు అనుచరలకు ప్రొటోకాల్ దర్శనం కల్పించడం కోసమే అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే నీరుగార్చడం చర్చకు దారితీస్తోంది.