ఆపరేషన్ వరంగల్. ఈ మధ్య కాలంలో ఓరుగల్లు రాజకీయాల్లో బలంగా చర్చల్లో ఉన్న మాట. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్‌ఎస్.. బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తులే పొలిటికల్ కలర్స్‌ను మార్చేస్తున్నాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ నాయకుల్లో కొందరు 12 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన చరిత్ర ఉండటంతో.. మరోసారి ఆ స్థాయిలో పాగా వేయాలని చూస్తున్నారు కమలనాథులు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో రహస్య మంతనాలు చేస్తూ.. వారికి కమలం కండువా కప్పేందుకు తెగ శ్రమిస్తున్నారు. ఆయా నాయకుల హోదాల మేరకు రాష్ట్రస్థాయి నేతలు సైతం టచ్‌లోకి వెళ్తున్నారట. అయితే అనుకున్నంత వేగంగా చేరికలు లేకపోవడం.. రహస్య మంతనాల్లోకి వస్తున్న లీడర్స్ చూద్దాం.. చేద్దాం అని దాటవేయడం బీజేపీ శిబిరాన్ని డైలమాలో పడేస్తోందట.
బీజేపీ ఎత్తుగడలు తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు విరుగుడు మంత్రం వేస్తున్నారట. మా వాళ్లతోనే మంతనాలా అని బీజేపీ వాళ్లనే టీఆర్ఎస్‌లోకి లాగే ప్రయత్నాల మొదలు పెట్టారట. ఏదో సాదాసీదా వాళ్లకు వలేస్తే లాభం లేదని అనుకున్నారో ఏమో.. గతంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీల్లో ఫుల్ టైమర్స్‌గా పనిచేసి.. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న కరుడుగట్టిన నేతలకు గురి పెట్టారట. జీవితాంతం బీజేపీలోనే ఉంటారు.. కండువా మార్చబోరని అనుకుంటున్న వారిని లాగితే.. పార్టీ శ్రేణులు డీలా పడతాయనే ఉద్దేశంతో గట్టిగానే గాలం వేస్తున్నారట. ఇలా వరంగల్ అర్బన్ ప్రాంతానికి చెందిన కొందరిని ఆకర్షించేశారు కూడా.
వరంగల్ అర్బన్‌లో బలపడాలని చూస్తున్న బీజేపీకి తాజా వలసలు ఇబ్బంది పెట్టినట్టే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ కార్పొరేటర్‌కు గులాబీ కండువా కప్పేశారు. పైగా ఇది అంతం కాదని.. ఆరంభమేనని చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా టీఆర్‌ఎస్ నుంచి అసంతృప్తులు ఎవరూ కమలం శిబిరం వైపు చూడకుండా వ్యూహం పదును పెట్టారట అధికార పార్టీ నేతలు. అయితే బీజేపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని కమలనాథులు ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే కారులో ఎక్కువమంది ఎక్కేశారని.. అందులో ఉన్నవారికి ఊపిరి సలపడం లేదని.. త్వరలోనే దిగిపోయేవాళ్లు క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారట. వెళ్లిన దారినే తిరిగొచ్చేస్తారని దీమాగా ఉన్నారట బీజేపీ నేతలు.
మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు రహస్య వ్యూహాలకు పదును పెడుతూ రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తున్నాయి. దీంతో ఓరుగల్లు నగరంలో ఎవరు ఎటువైపో.. ఎప్పుడు ఎక్కడుంటారో అంతుచిక్కడం లేదట. మరి.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ ఆకర్షణ వలకు ఎంత మంది చిక్కుతారో? ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయో? చూడాలి.