తన మాటల తాలూకూ ప్రకంపనలు ఏపీ రాజకీయాల్ని ఊపేస్తాయని తమిళ తలైవా ముందే ఊహించారా? ఏదైతే అదవుతుందని మనసులో ఉన్నది బయటికి చెప్పేశారా? ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు రజినీకాంత్ అన్న ఆ ఒక్కమాట మీదే ఇప్పుడు పొలిటికల్ పండిట్స్ ఎందుకు దృష్టి పెట్టారు? అసలు ఆ రోజు ఆయన ఏమన్నారు? లెట్స్ వాచ్.
జేసీబీలతో గతాన్ని తవ్వి పోస్తున్న వైసీపీ
సూపర్ స్టార్ రజనీ కాంత్…. చాలా కాలం తర్వాత ఏపీకి వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడి పొలిటికల్ ప్రకంపనలు రేపుతున్నారు. ఆరోజు ఆయన చేసిన ప్రసంగం మీద విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే… వైసీపీ నాయకులకు, రజినీ ఫ్యాన్స్‌కు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తమిళ తలైవా… చంద్రబాబును విజనరీ అంటూ ఆకాశానికి ఎత్తేయడమే ఈ వివాదానికి మూల కారణం. కేవలం పలుగు, పారలే కాదు…. జేసీబీలతో గతాన్ని తవ్వి పోస్తున్నారు వైసీపీ నాయకులు.
వైస్రాయ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా రజినీ మీద వైసీపీ విమర్శలు
రజినీకాంత్ ప్రస్తుత పరిస్థితి మొదలుకుని.. 1994 రాజకీయ సంక్షోభంలో వైస్రాయ్ హోటల్లో ఆయన పోషించిన పాత్ర అంటూ…రకరకాల కామెంట్లతో మాటల యుద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. అటు రజినీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్‌లో ఎదురుదాడి మొదలుపెట్టింది. తలైవాకు వైసీపీ క్షమాపణలు చెప్పాలంటూ రజనీకాంత్ హ్యాష్ ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలు, విమర్శలు చూస్తుంటే.. విజయవాడకు వచ్చి.. రజనీ తప్పు చేశారా..? వస్తే వచ్చారు చంద్రబాబును పొగిడి తలనొప్పులు తెచ్చుకున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. అది కూడా రెండు రకాలుగా ఉంది. వైసీపీ నాయకులు రజినీకాంత్ ను విమర్శించినంత మాత్రాన ఆయనకు పోయేదేమీ లేదని,.. దానివల్ల ఆ పార్టీ నైజమే బయటపడుతుందని అంటోంది టీడీపీ.
మరోవైపు తాను కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీ కాంత్ లాంటి వారిని పిలిపించుకుని.. వారి ద్వారా ఇమేజ్ పెంచుకునేలా మాట్లాడించుకోవడం చంద్రబాబుకు అలవాటని.. ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశ్యంతోనే తాము వారికి అర్ధం అయ్యేలా మాట్లాడామన్నది వైసీపీ వెర్షన్.
పరిస్థితి ఇలా ఉంటుందని రజినీ ముందే ఊహించారా?
ఈ క్రమంలోనే తన స్పీచ్ ప్రారంభించగానే.. రజనీ చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు కొందరు. ఎప్పుడు,ఎలా.. వ్యవహరించాలనే విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉందని, ఆ ప్రకారమే కామెంట్స్ చేశారని అంటున్నారు. ఇంత మంది జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తున్నా.. వద్దురా… రజనీ…. అని మనస్సు చెబుతోందంటూ మొదట్లోనే ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు.
అంటే… మొత్తంగా తన మాటలకు ఇలాంటి రియాక్షన్ వస్తుందని రజనీకాంత్ ముందుగానే ఊహించారా..? అందుకే తన స్పీచ్ ప్రారంభానికి ముందే మనసులో మాటను చెప్పారా అన్న చర్చ జరుగుపతోంది. ఆ చర్చోప చర్చలు ఎలా ఉన్నా…. ఏపీ పాలిటిక్స్‌లో మాత్రం రజనీ వ్యాఖ్యలు సెగలు పొగలు రేపాయనడంలో సందేహం లేదు.