డీసీసీ నియామకాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టాయా? నాయకుల మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందా? ముందు నుంచి ప్రచారం జరిగిన వాళ్ళకు కాకుండా… అస్సలు ఎవ్వరూ ఊహించని నాయకులకు ఎలా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి? తెర వెనక చక్రం తిప్పిందెవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ పదవులు ఆశించిన వారికి కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. సామాజిక సమీకరణల పేరుతో ఊహించని వ్యక్తులు తెర మీదికి రావడంతో…. సీనియర్స్, ఆశావహులు షాకయ్యారట. దీంతో…గతంలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుల నియామకంపై అసంతృప్తి పెరుగుతుండగా…., భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం మంత్రులు తమ అనుచరులకు ఇప్పించుకోగలిగారు. ఆ రెండు చోట్ల మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు తమ మాట నెగ్గించుకోగలిగారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే మురళీనాయక్ భార్యకు పదవి దక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని మరోసారి దక్కించుకోవాలని ఆశించిన ఎర్రబెల్లి స్వర్ణకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా పార్టీ మైనార్టీ నేత ఆయూబ్‌ను పదవి వరించింది. ఆయన డీసీసీ అధ్యక్షుడు అవుతారని అస్సలు ఎవరూ ఊహించలేదు. ఇప్పటికీ ఆయన నియామకంపై జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి సానుకూలత లేదు. అలాగే… వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తన అనచరులైన గోపాల్ రాజు, మీసాల ప్రకాశ్లో ఒకరికి ఇవ్వాలని సూచించారు. కానీ… అధిష్టానం వాళ్ళిద్దర్నీ కాదని అయూబ్ వైపు మొగ్గు చూపడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ డీసీసీ అధ్యక్ష పదవిపై బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
జిల్లాలో మూడు దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గానికే డీసీసీ పీఠం దక్కుతోంది. దాంతో ఇప్పుడు మారుతున్న సమీకరణల దృష్ట్యా…ఈసారి బీసీ నాయకులు చాలా ఆశలు పెట్టుకుని తీవ్రంగా ప్రయత్నించారు. అయినాసరే… ఫైనల్‌గా మరోసారి రెడ్డి సామాజికవర్గానికే చెందిన కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి దక్కడంతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే పదవులు ఉన్నవారికి కొత్త పదవి రాదని ముందే ప్రకటించిన అధిష్టానం…వెంకట్రామిరెడ్డికి మరో పోస్ట్ ఇవ్వడంపై అసహనంగా ఉన్నారు పార్టీ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం సుమారు వంద మంది ప్రయత్నించారు. అధిష్టానం వీరందరినీ పక్కన పెట్టి భట్టు కరుణాకర్‌కు ఛాన్స్ ఇచ్చింది. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో నామమాత్రంగా ఉంటున్న కరుణాకర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోటాలో ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులకు పదవి ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే జనగామ డీసీసీ పీఠం అనూహ్యంగా ఎస్టీ మహిళ ఆకావత్ ధన్వంతికి దక్కడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవి కోసం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇందిర కూడా ప్రయత్నించారు. అలాగే… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అలాగే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి సైతం దరఖాస్తు చేసు కున్నారు. ప్రశాంత్ రెడ్డికి అధిష్టానం దాదాపు హామీ ఇచ్చిందనే ప్రచారం జరిగినా, అనూహ్యంగా ధన్వంతికి ఎలా దక్కిందో ఎవరికీ అర్ధం కావడం లేదట.
ఇక మహబూబాబాద్ డీసీసీ పీఠం పక్కాగా పార్టీ నేత వెన్నర శ్రీకాంత్ రెడ్డికి దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆయనతో పాటు 46 మంది దరఖాస్తు చేసుకున్నా… అందరికీ ఝలక్ ఇస్తూ ఎమ్మెల్యే మురళీనాయక్ భార్య, మాజీ మునిసిపల్ ఛైర్‌పర్సన్ భూక్యా ఉమ తెర మీదికి వచ్చారు. దీంతో సీనియర్ నేతలు, ఆశావహులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇలా… ముందు నుంచి మాట్లాడుకుంటున్నవాళ్ళు మరుగునపడిపోయి ఊహించని వ్యక్తులకు పదవులు దక్కడం వెనక ఇటీవల అధిష్టానానికి దగ్గరైన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రమేయం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పదవి దక్కినా… మహబూబాబాద్‌లో కూడా మరో ఎస్టీ మహిళకు ఇవ్వడం వెనక రాజకీయ వత్తిళ్ళు నడిచినట్టు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతం అవుతుంటే… ఇప్పుడు ఈ నియామకాలతో మరింత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.