కారు పార్టీలో కొత్త పంచాయితీ మొదలైందా? బీఆర్‌ఎస్‌లో కొప్పుల కుమ్ములాట జరుగుతోందా? పార్టీ పెద్దలు పిలిచి నచ్చజెప్పాల్సిన స్థాయికి వెళ్ళిపోయిందా? ఇప్పటికీ సెట్ అవకుంటే… ఇక వార్నింగ్స్ అండ్ యాక్షన్ పార్టేనా? అసలేం జరిగింది గులాబీ మహిళా నేతల మధ్య? అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద స్థాయిలో ఏమైంది? ఎప్పట్నుంచో ఉన్నాం…. ఇప్పుడొచ్చిన వాళ్ళు ఎక్స్‌ట్రాలు చేస్తే ఊరుకుంటామా అని ఓ వర్గం. ఎప్పుడొచ్చామన్నది కాదక్కయ్యా….! పోస్ట్ పడిందా..? అవతలోళ్ళకి పేలిందా అన్నదే ముఖ్యం అంటూ మరో వర్గం. ఇలా… బీఆర్ఎస్‌లో కొప్పుల కుమ్ములాట ఓ రేంజ్‌లో జరుగుతోందట. పార్టీలో ఉన్న పాత వాళ్ళని కాదని ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయిన నాయకురాలిని ఎంకరేజ్ చేస్తున్నారంటూ సీనియర్ మహిళా లీడర్స్ పంచాయితీ పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ యుద్ధం గత కొద్ది రోజులుగా జరుగుతున్నా….. తాజాగా దీక్షా దివస్ సాక్షిగా ఓపెనైపోవడంతో… పార్టీ శ్రేణులు సైతం నోళ్ళు వెళ్ళబెట్టాయట. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో కార్యక్రమం నిర్వహించింది పార్టీ అధిష్టానం. దీంతో సాక్షాత్తు పార్టీ హెడ్ క్వార్టర్‌లోనే, ముఖ్య నాయకుల సమక్షంలోనే మహిళా నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇన్నాళ్ళు టైం కోసం వేచి చూసిన సీనియర్ మహిళా నేతలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అసంతృప్తిని వెళ్ళగక్కడమేకాకుండా తెలంగాణ భవన్‌లోనే ఫైరైపోయారట. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని, ఇటీవల పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నాయకురాలు పావని గౌడ్‌కు దీక్షా దివస్ వేదిక దగ్గర మైక్ ఇవ్వడం వివాదం పెరగడానికి కారణమైంది. అంతకు మించి పావని గౌడ్‌ను ఉద్యమ నాయకురాలిగా పరిచయం చేయడం మిగతా వాళ్ళకు అస్సలు నచ్చలేదట. ఆ పరిణామాలను వాళ్ళంతా ఇబ్బందిగా ఫీలై… తీవ్రంగా నొచ్చుకున్నట్టు తెలిసింది.
గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేస్తూ సుమిత్రానంద్, మంత్రి శ్రీదేవి, సుశీలా రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీనియర్స్ బాధతో చేసిన ఆ పోస్ట్‌లు వైరల్ అయ్యి గులాబీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదరు మహిళా నేతలను పిలిచి మాట్లాడారట. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారన్న అంశంపై ఆరా తీసినట్టు తెలిసింది. దాంతో వాళ్ళు కూడా తగ్గకుండా మనసులోని బాధను వెళ్ళగక్కినట్టు సమాచారం. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న తమను కాదని… కొత్తగా వచ్చిన వాళ్లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వాళ్ళ కేటీఆర్‌ని అడిగినట్టు తెలిసింది. అసలు బీఆర్‌ఎస్‌లో మహిళా విభాగం అధ్యక్షురాలు, కమిటీ లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వాళ్ళంతా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళగా… త్వరలో ఏర్పాటు చేసే పార్టీ రాష్ట్ర కమిటీలోమహిళలకు ప్రాధాన్యం ఇస్తామని, ఉద్యమ సమయం నుంచి ఉన్న మహిళా నేతలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారట కేటీఆర్. అలాగే మహిళా విభాగాన్ని బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. కేటీఆర్ చెప్పడం, మహిళా నేతలు వినడం వరకు బాగానే ఉన్నా… ఈ కొప్పుల కుమ్ములాట ఇక్కడితో ఆగుతుందా లేక కంటిన్యూ అవుతుందా అన్న సందేహాలు మాత్రం ఉన్నాయట పార్టీ వర్గాల్లో. పార్టీలో ఉద్యమ నాయకులు, కొత్త నాయకులు అంటూ జరుగుతున్న చర్చ నివురుగప్పిన నిప్పులా ఉందని, దాని పర్యవసానాలు ఎట్నుంచి ఎటు పోతాయో చెప్పలేమన్నది కేడర్ ఇన్నర్ వాయిస్. మొత్తానికి గులాబీ పార్టీ మహిళా నేతల మధ్య మొదలైన యుద్ధాన్ని అధిష్టానం ఎలా ఆపుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో.