జిల్లా మొత్తం మీద ఆయనొక్కడే పోటుగాడా? ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా? ఒక్కడికే నాలుగు పదవులు ఎలా ఇస్తారు? ఇదీ… ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్. ఇంతకీ ఎవరా నాలుగు పదవుల నాయకుడు? పార్టీ అధిష్టానం ఆయన్ని మాత్రమే ఎందుకు నెత్తికెక్కించుకుంది? మాకు పదవులు కావాలి మొర్రో… అని కూటమి నేతలంతా ఓ వైపు మొత్తుకుంటుంటే… కాకినాడ జిల్లా జనసేన నాయకుడు మాత్రం నాలుగు పదవులతో.. అసలు ఏ కుర్చీలోనూ కుదురుగా కూర్చోలేకపోతున్నారట. అదంతా చూస్తున్న జనసేన మిగతా నేతలు… ఏం… ఆయనే తోపా? అంతకు మించిన మొనగాళ్ళు పార్టీలో లేరా అంటూ… అధిష్టానాన్నే ఆక్షేపిస్తున్నారు. ఇక విషయానికొస్తే…ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడిగా, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్‌గా బహు పాత్రాభినయం చేస్తున్నారు ఆ పార్టీ నేత తుమ్మల రామస్వామి. దీంతో ఉన్న పదవులన్నీ ఒక్కరికే కట్టబెడితే… మిగతా వాళ్ళ సంగతేంటని మండిపడుతున్నారట పార్టీ ఇతర నాయకులు. పైగా తుమ్మల రామస్వామి అలియాస్ బాబుది కాపు సామాజికవర్గం కావడంతో… పార్టీ, నామినేటెడ్ పదవులన్నీ ఆ కులం వాళ్ళకే ఇచ్చుకుంటారా? మిగతా కులాల వాళ్ళు జనసేనకు అక్కర్లేదా అంటూ… జిల్లాకు చెందిన బీసీ లీడర్స్ గట్టిగానే స్వరం పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి రాకపోవడంతో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు సరే… ఇక్కడ ఒకదానికే దిక్కులేక ఏడుస్తుంటే… ఆయన్ని అలా ఎన్నాళ్ళని నాలుగు పదవుల్లో కొనసాగిస్తారంటూ బీసీలతో పాటు కాకినాడ జిల్లాలోని ఇతర నేతలంతా తీవ్ర అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి జనసేనలోనే మరొక నాయకుడికి రావాల్సిందట.
కూటమి పొత్తు పంపకాల్లో భాగంగా… ఈ నామినేటెడ్ పదవి గ్లాస్ పార్టీకి దక్కింది. కానీ… నెలలు నడుస్తున్నా కొత్త ఛైర్మన్‌ను నియమించడంపై జనసేన అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో… ముందు నుంచి ఉన్న తుమ్మల రామస్వామి అలాగే కొనసాగుతున్నారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బీసీ సామాజికవర్గానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. జిల్లా నుంచి పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే… అందులో ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు కాపులు. కాకినాడ ఎంపీది కూడా కాపు సామాజిక వర్గమే. అటు స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం డిసిసిబి,కూడా చైర్మన్ అన్నీ కాపుల ఖాతాలోనే పడిపోయాయి. ఈ క్రమంలో.. కనీసం కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. కుడా ఛైర్మన్ పదవినైనా బీసీలకు ఇవ్వమని అడిగారట. అయినా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో… బీసీల్లో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి కాపు కాస్తే ఎలా.. జనసేనకు బీసీలు అవసరం లేదా అని కొందరు నిష్టురంగానే మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ నాయకుల వెర్షన్ అలా ఉంటే…ఇక తుమ్మల రామస్వామి దగ్గరే ఉన్న జిల్లా పార్టీ పగ్గాలపై మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆశలు పెట్టుకున్నారట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన పెండెం… ఎన్నికల తర్వాత ఈఏడాది మొదట్లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. తనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే…అలా.. అలా బండి లాగించేస్తానన్నది దొరబాబు వెర్షన్.
ఇలా ఒక్కరి దగ్గరే నాలుగు పదవులు ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అని ఆఫ్‌ద రికార్డ్‌లో అంటున్నారట ఆయన. పార్టీని విస్తరించాలంటే ఆ మాత్రం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి కదా అని సన్నిహితుల దగ్గర దొరబాబు నోరు విప్పుతున్నట్టు తెలుస్తోంది. దేనికైనా రెడీ అని తాను వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చానని, కానీ అటువైపు నుంచి ఫలానా విషయంలో ఇన్వాల్వ్ అవమని చెప్పకపోతే… ఇక నేనేం పని చేస్తానని మాజీ ఎమ్మెల్యే అంటున్నట్టు సమాచారం.జిల్లాలో పార్టీ విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా…. వాటిని ఉపయోగించుకోలేకపోతే ఎలాగని బరస్ట్ అయిపోతున్నారట పెండెం. సమన్యాయం చేయడానికి బదులు… ఇలా ఒక్కరినే ఎంకరేజ్ చేస్తే అసంతృప్తి పెరక్క ఏం చేస్తుందన్నది దొరబాబు క్వశ్చన్. కుడా చైర్మన్ పదవిని ప్రస్తుతం జనసేన పిఠాపురం కో ఆర్డినేటర్‌గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్‌కి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనది కూడా కాపు సామాజిక వర్గం, అందులోనూ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి కావడంతో హోల్డ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఆ కారణంగానే.. ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట. ఇక్కడే నాయకుల్లో అసంతృప్తి బాగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. లేనివి లేవు సరే… కనీసం ఉన్న వాటిలో కూడా అకామిడేట్ చేసుకోలేకపోతే ఎలాగంటూ… మ్యూట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారట ఎక్కువ మంది నేతలు. మొత్తానికి కాకినాడ జిల్లా జనసేనలో పదవుల కోసం పోరు ఓవైపు నడుస్తుండగా… మరోవైపు ఒకే వ్యక్తికి 4 పదవులు ఇంకెన్నాళ్ళంటూ అసంతృప్త రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నన్నాళ్ళు అలాగే కంటిన్యూ చేసేస్తారా? లేక మార్చేది ఏమైనా ఉందా అంటూ సొంత పార్టీలోనే సెటైర్లు పెరిగిపోతున్నాయట.