యాంబా….. మీరు మారరా? ఇందుకేనా మీకు పదవులు ఇచ్చుండేది? అవతలోళ్ళని కనీసం కౌంటర్ చేయాలని కూడా బుర్రలకు తట్టడం లేదా? అంతా ఫోటోలు దిగే బ్యాచ్ తప్ప పనిచేయడం రాదా….? ఇదీ… ఆ నియోజకవర్గంలో టీడీపీ లీడర్స్‌కు కేడర్ వేస్తున్న సూటి ప్రశ్న. రాష్ట్ర స్థాయి మంత్రులన్నా మాట్లాడుతున్నారుగానీ… లోకల్‌గా మీ నోళ్ళు మాత్రం ఎందుకు పెగలడంలేదని ఏ నియోజకవర్గ కేడర్ అడుగుతోంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?
తిరుపతి……రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. ఆ విషయంలో మిగతా పార్టీలకంటే…. టీడీపీది ఇంకొంచెం ఎక్కువ. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి… తెలుగుదేశం లిస్ట్‌లో తిరుపతిది ప్రత్యేక స్థఆనం. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని కేడర్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ లోకల్ లీడర్స్ మధ్య సమన్వయ లోపం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అది ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతోందన్నది కార్యకర్తల వాదన. గడిచిన ఏడాది కాలంగా వైసీపీ ఛోటో మోటా నేతలతో కలిసి స్థానిక కూటమి నాయకులు దందాలు చేస్తున్నారంటే… పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చని ఆవేదనగా ఉన్నారట కార్యకర్తలు. గత ఎన్నికల్లో టిడిపి నుండి సుగుణమ్మ,జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ,కోడూరు బాలసుబ్రహ్మణ్యం లాంటి నేతలు టికెట్ ఆశించారు. కానీ… చివరికి జనసేన కోటాలోకి వెళ్ళడంతో… ఆ పార్టీ తరపున ఆరిణి శ్రీనివాసులు పోటీ చేసి గెలిచారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది, నియోజకవర్గంలో భాగస్వామ్య పార్టీ అభ్యర్థి గెలిచారు. అయినాసరే…. మనం పవర్‌లో ఉన్నామా లేదా అన్నట్టుగా ఉందట కేడర్ పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే, స్టేట్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరి కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ ఉన్నప్పటికీ అమెను గుర్తించే పరిస్థితిలో క్యాడర్ లేదు. మరోవైపు తిరుపతి నగరానికి రాష్ట స్థాయి కార్పొరేషన్ పదవులు నాలుగు వచ్చాయి. సుగుణమ్మ కాక శాప్ చైర్మన్ రవి నాయుడు,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఉన్నారు, ఇక డైరెక్టర్స్‌గా చాలా మందికి ఛాన్స్ దక్కింది. కానీ.. వాళ్ళలో ఎవ్వరూ కార్యకర్తల సమస్యల మీద దృష్టిపెట్టి…, పార్టీని ముందుకు నడిపించే దిశగా చొరవ చూపడం లేదని అంటున్నారు. ఇక గ్రూపుల గోల గురించి చెప్పే పనేలేదు. ఇదే సమయంలో ఇక్కడ ప్రతిపక్షం దూకుడుగా కనిపిస్తోందట. అధికారంలో ఉన్న వాళ్ళకంటే ముందే వైసీపీ తన కేడర్‌ను నగరపాలక సంస్థ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అయన కూమారుడు అభినయ్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు.
గతంలో భూమన లేవనెత్తిన గోశాల అంశం రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కానీ… దాన్ని స్థానిక టీడీపీ నేతలు సరిగా డీల్ చేయలేకపోయారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. అదంతా పోలీసుల వైఫల్యం అంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫోటోలు పంపడం తప్ప… రాజకీయంగా వాళ్ళు పొడిచిందేం లేదని కార్యకర్తలే చెప్పుకున్న పరిస్థితి. ఇక రెండు నెలల క్రితం అభినయ్ రెడ్డి అనుచరుడు చైతన్య యాదవ్… ఓ కారు డెకార్స్ యాజమానిపై దాడి చేశాడు. తాజాగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి… పవన్ అనే దళిత యువకుడిని తన ఆఫీస్‌లో బంధించి తీవ్రంగా హింసించిన వీడియో బయటికి వచ్చింది. దీని మీద మంత్రుల స్థాయిలో స్పందించారేగానీ… లోకల్ నేతలు మాత్రం నిద్రపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట తిరుపతి తమ్ముళ్లు. ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఇప్పటివరకు ఏ ఒక్క అంశం మీద స్పందించిన దాఖలాలు లేవంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. సరే… మిగతా వాళ్ళేమన్నా యాక్టివ్‌గా ఉంటున్నారా అంటే… అదీ లేదు. స్థానిక వైసీపీ ముఖ్యులు పార్టీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నా… నియోజకవర్గ టీడీపీ నాయకులు కిమ్మనకపోవడాన్ని, కౌంటర్ చేసేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తోందట టీడీపీ కేడర్. ఇదే విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నట్టు సమాచారం. వీళ్ళ చేతకానితనం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటూ నిర్మొహమాటంగా కామంట్స్ చేస్తున్నట్టు తెలిసింది.
పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసే ప్రసక్తే లేదని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. స్థానికంగా భూమన కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే మాకు బలమైన నాయకుడు కావాలని, ఇప్పుడున్న వాళ్ళంతా… పదవుల కోసం ఫోటోలు దిగే బ్యాచ్ తప్ప పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్ళు కాదంటూ కొందరు సీనియర్స్ ఇన్ఛార్జ్ మంత్రి అనగానికి చెప్పినట్టు తెలిసింది. రాజకీయం చేయడం మా వాళ్ళకు చేతగాక తప్పంతా పోలీసులదే అంటూ… చేతగాని మాటలు మాట్లాడుతున్నారంటూ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారట కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు. వీళ్ళుగాక నియోజకవర్గంలో పార్టీ అంటే ప్రాణం పెట్టే బలమైన నాయకులు ఉన్నా…వాళ్ళ సేవల్ని వాడుకోవడంలో విఫలం అవుతున్నారంటూ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. జేబీ శ్రీనివాస్, మబ్బు నారాయణ లాంటి నాయకులు ఎన్నికలకు ముందు ఫైట్ చేసి.. ఇప్పుడు సైలెంట్ అవ్వడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోందట. మొత్తం మీద పెద్ద నాయకులు ఇన్‌యాక్టివ్‌గా ఉండటం, ఛోటా నాయకులు కొందరు వైసీపీ వాళ్ళతో చెప్పపట్టాలేసుకుని వ్యాపారాలు చేసుకుంటుండటాన్ని చూసి తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం కేడర్ రగిలిపోతోందని చెప్పుకుంటున్నారు. ఇందుకేనా మేం నాడు నానా కష్టాలుపడిందని అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాకో బలమైన నాయకుడు కావాలన్నది లోకల్ కేడర్ డిమాండ్.