తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులు, ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందా? అందులోనుంచే ఆకాశ రామన్నలు పుట్టుకొస్తున్నారా? ఆ పేరుతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ… నివ్వెర పరుస్తున్నాయా? పేషీల్లో జరుగుతున్న దందాలు సైతం బయటపడుతున్నాయా? అసలేం జరుగుతోంది టీజీ సచివాలయంలో. తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆఫీసర్స్ ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వాతావరణంలోనే ఆకాశరామన్న ఉత్తరాలు కలకలం రేపుతున్నాయి. ఆ ఉత్తరాల పేరుతో… సెక్షన్స్, ఆఫీసర్స్ ఛాంబర్స్‌లో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు సైతం బయట పెట్టుకుంటున్నారు. సంక్షేమ శాఖలో ఓ ఉన్నతాధికారి ఛాంబర్ లో పని చేసే అధికారిపై ఇటీవల ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అన్ని అంశాల్లో సదరు అవుట్ సోర్సింగ్ అధికారి కలుగజేసుకోవడమే కాక ఆయన్ను ప్రసన్నం చేసుకున్న వాళ్ళకు ప్రయోజనాలు, మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆ ఉత్తరంలో ఆరోపించారు. ఇంకా చాలా అంశాలను ప్రస్తావించగా… అవన్నీ నిజమేనని.. వాటిని సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లే దైర్యం లేక ఇలాచేసి ఉండవచ్చని చెప్పుకున్నారు.
ఇక నీటి పారుదల శాఖలో ఓ ఉన్నతాధికారిని టార్గెట్ చేసి కొందరు ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడం హాట్ టాపిక్ అయింది. సదరు ఉన్నతాధికారి ఇటీవలే సెక్రటేరియట్ కు బదిలీ అయ్యారు. ఆయనకు మంత్రితో పాటు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ ఇలా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. రూల్స్ ప్రకారం నడుచుకుంటారన్న కారణంతో…కొందరు ఆయన మీద ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ లేఖలు రాశారట. డిపార్ట్మెంట్ వ్యవహారాలతో పాటు కుటుంబ విషయాలు, ఆరోగ్యం.. ఇలా అన్నిటినీ ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడంపై సదరు అధికారి తీవ్ర ఆవేదనగా ఉన్నట్టు సమాచారం. డిపార్ట్‌మెంట్‌లో చాలా మార్పులకు ఆయన కారణం అయ్యారని, ఆ నిర్ణయాల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వాళ్ళు ఇలా కించపరిచేలా వ్యవహరించి ఉంటారని భావిస్తున్నారు.ఈ విషయాన్ని తన శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇక సాధారణ పరిపాలన శాఖలో పరిస్థితి మరీ దారుణంగా ఉందట.
ఇందులో సగం మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. ఇక్కడ సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా చీలి పోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పదోన్నతులు, బదిలీల విషయంలో కొందరు అధికారులు పక్షపాతంగా ఉన్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి పన్నెండు ఏళ్లయినా.. ఇక్కడ ఇంకా ఆంధ్ర, తెలంగాణ విభేదాలు, వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ శాఖలో రిటైర్డ్ ఉద్యోగుల పెత్తనం ఎక్కువైందని, ప్రభుత్వంలో కీలకమైన అంశాలను చూసే సెక్షన్ లో ఓ సామాజికవర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికే అక్కడ పోస్టింగ్స్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర సామాజిక వర్గాల ఉద్యోగులను చిన్న చూపు చూడటం.. వారి వల్లే సమాచారం బయట వ్యక్తులకు వెళ్తోందని పై అధికారులకు నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారిందని తెలుస్తోంది. ఇన్నాళ్ళు వర్గాలుగా విడిపోయిన అధికారులు ఇప్పుడు అసోసియేషన్లుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఒక వర్గానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఆఫీసులకు ఏళ్ళ తరబడి రాకపోయినా జీతాలు చెల్లిస్తుంటారని… వ్యతిరేక వర్గానికి చెందిన ఉద్యోగుల లోపాలు, బలహీనతలను తెలుసుకుని వేధింపులకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్న ప్రచారం జరుగుతోంది సచివాలయ వర్గాల్లో. ముఖ్యంగా… వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, ఆర్ అండ్ బీ లాంటి కీలకమైన శాఖల్లో ఈ ఆకాశరామన్న ఉత్తరాల వ్యవహారం నడుస్తోంది.