జూబ్లీహిల్స్లో కమలం ఎందుకు వాడిపోయింది? కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవడానికి కారణాలేంటి? లోపం ఎక్కడ జరిగింది? కార్యకర్తల కష్టానికి కనీస విలువ కూడా లేకుండా చేసింది ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలుగంటున్న పార్టీ ఈ ఫలితాన్ని ఎలా చూస్తోంది? జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీకి భారీ ఝలక్ తగిలింది. కనీసం డిపాజిట్ దక్కకుండా పోయింది. అంతెందుకు… 2023లో వచ్చిన ఓటు శాతాన్ని కూడా తిరిగి సాధించుకోలేకపోయింది కాషాయ దళం. దీంతో… అసలు మనం ఎక్కడున్నాం…. ఏం చేస్తున్నామన్న చర్చ మొదలైందట పార్టీ వర్గాల్లో. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం మేమేనంటూ… గొప్పలు చెప్పుకుని గప్పాలు కొట్టడం తప్ప… వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఏం చేస్తున్నాం, ఈ ఉప ఎన్నిక నిజంగా గుణపాఠమేనని మాట్లాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు. ఏవో… పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి గాల్లో మేడలు కడితే సరిపోదని, గ్రౌండ్ రియాలిటీ తెలిసుండాలంటూ పార్టీలోనే నాయకత్వానికి చురకలంటించే వాళ్ళు పెరుగుతున్నారు. నేతల మధ్య సమన్వయం లేక పోవడం… ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం వల్లే ఫలితం ఇంత దారుణంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేడర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారట.
అక్కడ ఏం జరిగినా అది కొందరి ఖాతాలోకే వెళ్తుందని, ఆ మాత్రందానికి మనం చించుకోవడం ఎందుకన్న భావన ఓ వర్గంలో నెలకొందని, సమష్టి తత్వం లేని అలాంటి ఆలోచనల ఫలితమే ఇదన్న చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో తెగ సంబరపడిపోతున్న వాళ్ళకు ఈ ఉప ఎన్నిక ఫలితం కనువిప్పు కావాలని పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి ఎవరి పైనో నెపం నెట్టేసి తప్పుకోవాలని అనుకోవడం కరెక్ట్ కాదని, లోపం ఎక్కడుందో కనుక్కుని సరిచేసుకుంటేనే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూప గలుగుతామని అంటున్నారు. వ్యక్తుల మీద కోపం పెట్టుకుని పని చేస్తే అది అంతిమంగా ఆ వ్యక్తులకంటే పార్టీ మీద ఎక్కువ ప్రభావం చూపుతుందన్న సోయి లేకుండా మా నాయకులు పని చేశారని మాట్లాడుకుంటున్నారు కమలం కార్యకర్తలు. పార్టీ కన్నా తమ ఇగోలే ముఖ్యమని అనుకుంటే… ఆ ప్రభావం ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి పని చేస్తున్న కార్యకర్తలపై పడుతుందని, నేషన్ ఫస్ట్, పార్టీ next, సెల్ఫ్ లాస్ట్ అనేది నినాదానికి పరిమితం కాకుండా చేతల్లో చూపించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది తెలంగాణ బీజేపీలో. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి రాక పోవడానికి కారణం మా నేతల వ్యవహార శైలేనన్నది కేడర్ వాయిస్. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్న మా నాయకులు…. ఇక్కడ గెలవాలన్న సంగతి మర్చిపోతున్నారంటూ కాస్త సెటైరికల్‌గానే కామెంట్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ కార్యకర్తలు. జూబ్లీహిల్స్ ఫలితంతోనైనా కనువిప్పు కలగకుంటే… వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంతే సంగతులు… చిత్తగించవలెను అనడం తప్ప మరో మార్గం ఉండబోదని తెలంగాణ బీజేపీలోనే అంతర్గతంగా చర్చ మొదలైందట.