జూబ్లీహిల్స్ బైపోల్ కోసం కాషాయ దళం పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తోందా? అందుకే ఆ లీడర్స్‌ని స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో చేర్చిందా? కులాల వారీ కేలిక్యులేషన్స్‌తో వాళ్ళు ప్రచార బరిలో దిగబోతున్నారా? పైకి కనిపించకున్నా… అంతర్గతంగా కూటమి పార్టీలు ఇక్కడ కూడా కలిసే అడుగులేస్తున్నాయా? ఎవరా స్టార్ క్యాంపెయినర్స్? ఎలా ఉంది కమలం ప్లాన్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. సిట్టింగ్ సీటు కోసం బీఆర్‌ఎస్, అధికారంలో ఉన్నాం గనుక సత్తా చాటాలని కాంగ్రెస్, గట్టిగా ప్రయత్నించి మన బలమెంతో తేల్చుకోవాలని బీజేపీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాంతాలు, కులాల వారీగా కూడా ప్రభావం చూపి ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో ఉన్నాయి. ఈ విషయంలో కమలం పార్టీ ఓ అడుగు ముందే ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎంత లేదనుకున్నా… జూబ్లీహిల్స్‌లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీది ప్రభావితం చేయగల స్థాయి అన్నది ఎక్కువ మంది అంచనా. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక్కడ తొలిసారి టీడీపీ తరపునే గెలిచారు.
పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాలున్నవాళ్ళ సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది. అందులోనూ… కమ్మ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయన్నది గతంలో పోలింగ్ లెక్కలు చెప్పిన వాస్తవం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కమ్మతో పాటు ఏపీ మూలాలున్న ఓటర్లంతా తమవైపు సాలిడ్ అయ్యేలా చేసేందుకు గట్టి స్కెచ్చే వేస్తోందట బీజేపీ. తమ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో ఏపీ లీడర్స్, అందులోనూ… కులాల సమతౌల్యాన్ని కూడా పాటిస్తూ ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. పార్టీ అభ్యర్థి గతం కూడా తెలుగుదేశమే కావడం తమకు ప్లస్ అవుతుందన్నది కాషాయ పార్టీ లెక్క. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఇక ఏపీ నుంచి బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో పురంధేశ్వరి, సుజనా చౌదరి, మంత్రి సత్య కుమార్ యాదవ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఉన్నారు. వీళ్ళందరి ఎంపిక వెనక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయట.
ఏపీ మూలులున్న ఇక్కడి ఓటర్స్, కొన్ని సంఘాలతో వీళ్లకు సంబంధ బాంధవ్యాలు ఉండటంతో పాటు.. ఆయా సామాజికవర్గాల ఓట్లు చెక్కు చెదరకుండా ఉండటం కోసం ఈ సీనియర్స్‌ని బరిలో దింపబోతున్నట్టు తెలిసింది. ఈ లీడర్స్‌తో విస్తృతంగా ప్రచారం చేయించి కమ్మ, కాపు, యాదవ ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే… బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో.. తెలుగుదేశం జెండాలు కనిపించాయి. టీడీపీ కార్యకర్తలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అదే సమయంలో… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కూడా ర్యాలీలో పాల్గొన్న టీడీపీ,జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం చూస్తే…ఈ విషయంలో కాషాయదళం ఎంత ప్లాన్డ్‌గా ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. పైకి చూడ్డానికి జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఒంటరిగానేబరిలో దిగినా… ఇక్కడున్న కూటమి భాగస్వామ్యపక్షాల బలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న దిశగా అడుగులు పడుతున్నాయి.