తెలంగాణ బీజేపీ కమిటీ వేసేదెన్నడు? కొత్త అధ్యక్షుడు వచ్చాక వారంలో వేస్తామని ప్రకటించి నెల గడుస్తున్నా… దిక్కూ దివాణం లేకుండా పోయింది ఎందుకు? అధ్యక్షుడు ఎందుకు నిస్సహాయంగా ఉండిపోతున్నారు? తెర వెనక జరుగుతున్న తతంగం ఏంటి? అసలది ఇప్పట్లో తేలే వ్యవహారమా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరిగింది. ఏపీలో రాష్ట్ర కమిటీని వెంటనే ప్రకటించేశారు పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కానీ… తెలంగాణలో మాత్రం ఇంతవరకు అతీగతీ లేదు. అసలు ఎప్పుడు ప్రకటిస్తారో కూడా క్లారిటీ రాలేదు. పార్టీలో ఏ ఇద్దరు నాయకులు కలిసినా…. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరికి ఛాన్స్ ఉండవచ్చన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కానీ… ఎక్కడా వీసమెత్తు స్పష్టత రాలేదు. పైగా ఒక అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తోందట వ్యవహారం. రాష్ట్ర అధ్యక్షుడయ్యాక రామచంద్రరావు ఇప్పటికే ఒకసారి కమిటీపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. హైదరాబాద్‌లో సంఘ్ పెద్దలలో సమావేశం అయ్యారు. అయినా కమిటీ కూర్పుపై క్లారిటీ రానట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, వాళ్ళంతా ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకు వస్తుండడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట అధ్యక్షుడు. ఆశావహులంతా తగ్గకుండా ఎవరికి వారు తమ గాడ్‌ఫాదర్స్‌ని సీన్‌లోకి దించుతుండటం కూడా సంక్లిష్టతకు కారణం అంటున్నారు. మరోవైపు గత కమిటీలో పని చేసిన వాళ్ళలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలన్న గందరగోళం కూడా ఉందంటున్నారు.
అదే సమయంలో రకరకాల ఈక్వేషన్స్ తెర మీదికి వస్తున్నాయి. పదేళ్ళుగా రాష్ట్ర కమిటీలో ఉన్న వారికి ఈ సారి అవకాశం ఇవ్వొద్దని, యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఛాన్స్ ఇవ్వకూడదని, కొత్త రక్తాన్ని ఎక్కించాలని… ఒకటి కాదు, రెండు కాదు… ఇలాంటివి రకరకలా వాదనల్ని వినిపిస్తున్నారు పార్టీ నాయకులు. దీంతో అసలేం నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థంకాని గందరగోళంలో ఉన్నారట ఢిల్లీ పెద్దలు. కొందరు నేతలు తాము సూచించిన వారికే కమిటీలో స్థానం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తమవాళ్ళ కోసం పట్టుబట్టే నాయకులు కొందరైతే… ఫలానా వాళ్ళకు ఇవ్వవద్దంటూ మోకాలడ్డుతున్న బ్యాచ్ కూడా ఒకటి తయారైందట. పైగా మేం వద్దన్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని సీన్ క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకొందరైతే… కొత్త కమిటీ వేసేటప్పుడు మా అభిప్రాయం తీసుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటివన్నీ కలిపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తలనొప్పిగా మారాయట.
ఇదెక్కడి లొల్లిరా… నాయనా అని ఆయన తల పట్టుకుంటున్నట్టు సమాచారం. వస్తున్న డిమాండ్స్, సమీకరణల్ని పరిగణనలోకి తీసుకుంటే… వీళ్ళందరినీ ఒప్పించి సమన్వయం చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. ఈ క్రమంలో ఇది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం కాదని, వినాయక నవరాత్రుల తర్వాతే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి బీజేపీ వర్గాలు. పదవులు తక్కువగా ఉండడం, ఆశావహులు భారీగా పెరిగిపోవడంతో…ఇది అంత తొందరగా తేలే మేటర్ కాదంటున్నారు. పార్టీలో పెద్ద తలకాయలు పెరిగిపోవడం కూడా ఈ తాత్సారానికి మరో కారణమని తెలుస్తోంది. మొత్తం మీద ఎట్నుంచి ఎటు చూసినా… రకరకాల సంక్లిష్టతల మధ్య తెలంగాణ బీజేపీ కమిటీ ఎప్పటికి తేలుతుందో అర్ధంకాని వాతావరణం ఉంది.