తెలంగాణ బీజేపీ కిటకిటలాడుతోందా? పోస్ట్‌ల కోసం నాయకులు పోటీలు పడుతున్నారా? నాక్కావాలంటే నాకంటూ….. మూడు పదవుల కోసం 30 మంది నాయకులు రేస్‌లోకి వచ్చారా? పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది? అసలు ఏ పోస్ట్ కోసం ఆ స్థాయిలో రేస్ మొదలైంది? తెలంగాణలో ఇప్పుడేం పొలిటికల్ సీజన్ లేకున్నా… స్థానిక సంస్ధల ఎన్నికల విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా…. బీజేపీలో మాత్రం కాస్త ప్రత్యేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని కమలం పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉండటంతో… నాయకుల్లో ఉత్సాహం పెరుగుతోందని అంటున్నారు. అందుకే… ఇప్పటి నుంచే పార్టీలోని కీలక పదవుల్లో ఉంటే… ఆ రోజుకు దక్కే ప్రాధాన్యం వేరుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట చాలామంది నేతలు.
అందుకే పార్టీ పోస్ట్‌ల కోసం తెగ ఎగబడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సంస్థాగత వ్యవహారాలన్నీ… ఆ పదవుల్లో ఉన్న వాళ్ళ ద్వారానే జరుగుతుంటాయి. పార్టీ కార్యక్రమాలు, కార్యాచరణలో ప్రధాన కార్యదర్శి భాగస్వామ్యం కీలకం. అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ప్రధాన కార్యదర్శుల పదవులకు పిచ్చ డిమాండ్ పెరిగిందని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కమిటీ లిమిటెడ్‌గా ఉంటుంది, పోస్ట్‌లు తక్కువ ఉంటాయి. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉంటారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శితో కలిపితే నలుగురు ఉంటారు. దీంతో…ఈ పోస్ట్ లకు పార్టీలో గట్టి పోటీ ఉంది. పెద్ద సంఖ్యలో నాయకులు లైన్‌లోకి వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు. గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలోనే కమిటీ నియామకం జరిగే అవకాశం ఉండటంతో… ఎవరికి వారు సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నారట.
ఇప్పుడున్న వాళ్ళలో ఒకరిద్దరు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుండటం పార్టీ వర్గాల్లో ఇంకా ఉత్కంఠను పెంచుతోంది. గత కమిటీలో కార్యదర్శులుగా పని చేసిన వారు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి అడుగుతున్నారట. ఉపాధ్యక్షులుగా పని చేసిన వారు సైతం జనరల్ సెక్రెటరీ పదవి కావాలని లాబియింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం. గతంలో పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సైతం ఈ సారి తమకు పోస్ట్ కావాలని, అదీకూడా… ప్రధాన కార్యదర్శి పోస్టే కావాలని ఒత్తిడి చేస్తుండటంతో వ్యవహారం మాంఛి రసకందాయంలో పడిందన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. కొందరు నాయకులైతే… తమకున్న పరిచయాలతో ఆరెస్సెస్ పెద్దల్ని కూడా కలుస్తున్నారట. అలా… ఉన్న మూడు పోస్ట్‌ల కోసం 30 మంది పోటీ పడటం, అందులో 20 మంది దాకా… సంఘ్ పెద్దల దగ్గరికి వెళ్లడంతో….తెలంగాణ బీజేపీకి ప్రధాన కార్యదర్శుల ఎంపిక కత్తిమీద సాములా మారినట్టు చెప్పుకుంటున్నారు.
ఇన్నాళ్ళు ఆరెస్సెస్ కార్యాలయం ముఖం చూడని వారు సైతం ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతుండటం ఆసక్తికర పరిణామం అంటున్నారు పరిశీలకులు. అసలా ఆ పోస్ట్ ఏంటి, ఆ బాధ్యతలో ఉన్నవారు ఏం చేస్తారో కూడా తెలియని వారు సైతం మాకు జీఎస్ కావాల్సిందే అని పట్టుబడుతుండటం చూసి ముక్కున వేలేసుకుంటున్నాయట బీజేపీ వర్గాలు. పార్టీ సిస్టమ్ పూర్తిగా అర్ధంకాకుండా, కొత్తగా వచ్చిన వారు సైతం అదైతేనే బాగుంటుందని అంటుండటంతో వాళ్ళకు ఎలా చెప్పాలో అర్ధంగాక తల పట్టుకుంటోందట నాయకత్వం. కొందరైతే…. ప్రధాన కార్యదర్శి కోసం పట్టు పడితే కనీసం రాష్ర్ట కమిటీలో ఇంకో పోస్ట్ ఏదన్నా ఇవ్వకపోతారా అన్న ఎత్తుగడతో వత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి మూడు ప్రధాన కార్యదర్శుల పోస్ట్‌ల కోసం 30 మంది పైగా ఆశావహులు రేస్‌లోకి రావడం తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం.