తెలంగాణ కమలం కళకళలాడబోతోందా? అందు కోసం చాపకింద నీరులా గ్రౌండ్ వర్క్ పూర్తయిపోతోందా? ఎలాంటి హంగామా లేకుండా కాషాయ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? గువ్వల బాలరాజు బాటలో ఇంకొందరు కూడా కండువా మార్చేయబోతున్నారా? మాజీలతో పాటు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారా? లెట్స్ వాచ్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ తెలంగాణలో చేరికల చర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో ఈ వ్యవహారం నడిచింది. అప్పట్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఆ క్రమంలోనే.. అదిగో వాళ్ళు పార్టీ మారుతున్నారు, ఇదిగో వీళ్ళు మారుతున్నారంటూ రోజుకో పేరు బయటికి వచ్చేది. దాని చుట్టూ మాటలు నడిచేవి. కానీ… అనుకున్న స్థాయిలో కాంగ్రెస్‌లోకి వలసలు లేవు. ఆ తర్వాత అసలా మాటలే ఆగిపోయాయి. తాజాగా… ఇప్పుడు టాపిక్ మొదలైంది. కాకుంటే… ఈసారి బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ వైపునకు అన్నది ఆసక్తికరంగా మారింది. గులాబీ నుంచి కాషాయంలోకి భారీగా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరందుకుంది. అటు బీజేపీ కూడా దీన్ని ఖండించడం లేదు. పైగా కొందరు నాయకులైతే… ఎస్, అది నిజమేనని కూడా అంటున్నారు. కేవలం మాజీ ఎమ్మెల్యేలే కాదు, కొందరు సిట్టింగ్స్ కూడా మాకు టచ్‌లోఉన్నారని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్. పార్టీలో చేరేందుకు చాలా మంది పెద్ద వాళ్ళు కూడా రెడీగా ఉన్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చేరికల మీద స్పందించారు.
ఇపుడు మా పార్టీలోకి మాజీలే వస్తున్నారు. అంతకు మించి ఇంకా చాలా మంది టచ్‌లో ఉన్నారు. వాళ్ళంతా స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారని చెప్పారు స్టేట్ ప్రెసిడెంట్. ఈ మాటల్నే విశ్లేషిస్తూ… ఒక క్లారిటీకి వస్తున్నారు పొలిటికల్ పండిట్స్. కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి అంత తేలిగ్గా మాట్లాడబోరని, ఆయన హైప్ కోసం ఏదో ఒకటి చెప్పేసే టైప్ కాదని, దీన్ని బట్టి చూస్తే… తెలంగాణలో మళ్లీవలసల జోరు ఉండవచ్చని అంటున్నారు ఎక్కువ మంది. అందుకు తగ్గట్టే… పార్టీలో కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ రాడార్ లోకి వెళ్ళారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిశారు కూడా. ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైపోయింది. తనతో పాటు మరికొందరు ముఖ్య నాయకుల్ని కూడా పార్టీలోకి తీసుకువస్తానని బీజేపీ పెద్దలకు చెప్పారట బాలరాజు. ఆ ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్ ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. జిల్లా నుంచి ఇప్పటికే కొందరు బీజేపీకి టచ్‌లోకి వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరబోమని ఇన్నాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు సంప్రదింపుల పర్వంలోకి వచ్చినట్టు చెబుతున్నారు. సానుకూలత వ్యక్తం చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారని, ఇవాళ కాకుంటే రేపు అయినా…వాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళడం ఖాయమన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో.
అలాగే….వరంగల్, ఖమ్మం లాంటి జిల్లాల నుంచి కూడా భారీగా వలసలు ఉండవచ్చని అంటున్నారు. కాస్త టైం ఇస్తే… సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు కూడా.. కాషాయంలోకి దూకేయవచ్చన్న అంచనాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ పెద్దలను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు, తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక ఆ పార్టీకి దూరం కావాలన్న ఆలోచనతో ఉన్నారట కొందరు. అధికార కాంగ్రెస్ వైపు కొంతమంది చూస్తున్నా… ఆ పార్టీలోకి వెళ్ళడం ఇష్టంలేని వాళ్ళు మాత్రం ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఎంచుకుంటున్నారట. ముందు ముందు ఈ చేరికల ఎపిసోడ్‌లో ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.