NTV Telugu Site icon

Off The Record: తణుకు మద్యం వ్యాపారాలు ఘొల్లుమంటున్నారా..?

Tanuku

Tanuku

Off The Record: ఆ నియోజకవర్గంలో వైన్స్‌ వ్యాపారులు వణికిపోతున్నారా? లాటరీలో షాపులు దక్కాయ్‌…. మనమంతా లక్కీ భాస్కర్స్‌ అని మురిసిపోయిన వాళ్ళకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? ఎందుకొచ్చిన యాపారంరా… నాయనా.. ఇది అంటూ ఎవరో ఒకరికి ఇచ్చేసి సైలెంట్‌గా సైడై పోదామని అనుకుంటున్నారా? మద్యం వ్యాపారుల ఫ్రస్ట్రేషన్‌కు కారణం ఏంటి? వాళ్ళ లాభాలను అంతలా దోచేస్తున్నదెవరు?.. దేవుడు కరుణించినా.. పూజారి వరం ఇవ్వనట్టుగా తయారైందట తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైన్ షాపుల నిర్వహుకుల పరిస్థితి. అదేంటయ్యా…. వైన్స్‌ అంటే….. యమా రంజుగా ఉంటుంది కదా… వ్యాపారం. పాపం వాళ్ళకంత కష్టం ఏమొచ్చిందని అంటే…. అంతా రాజకీయ మహిమ అన్నది లోకల్‌ టాక్‌. అక్రమాలు, అడ్డగోలు దందాల సంగతి తర్వాత…. కనీసం నిబంధనల ప్రకారం యాపారం చేసుకుందామన్నా… ఇక్కడి నాయకులు చేయనిచ్చేట్టు లేరంటూ ఘొల్లుమంటున్నారట వైన్‌ షాపుల యజమానులు.

Read Also: Off The Record: కోనప్ప, ఐకే రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు?

ఇక, తణుకులో లిక్కర్‌ బిజినెస్‌ చేస్తే లాభాల సంగతి తర్వాత… నష్టాలు రాకుండా చూసుకోవడమే పెద్ద టాస్క్‌ అన్నది ఇక్కడి వ్యాపారుల మనోగతంగా తెలుస్తోంది. లక్షలు పోసి లైసెన్స్ తెచ్చుకున్నా.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పర్సంటేజ్‌ వర్కౌట్ అవటంలేదని ఒకవైపు బాధపడుతున్నామని, అదిపోను… ఇప్పుడు గవర్నమెంట్ కి కట్టిన ఫీజు కంటే లోకల్ లీడర్స్‌కి సమర్పించుకోవాల్సిన చలానాలు ఎక్కువ అవుతున్నాయని భోరుమంటున్నారట వ్యాపారులు. లాటరీకి ముందు వ్యాపారం చేసేందుకు ఉత్సాహం చూపించిన నిర్వాహకులు.. వైన్ షాపులు దక్కిన తర్వాత మాత్రం మత్తు ఎక్కకుండానే గుడ్లు తేలేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్ లీడర్స్‌ పర్సంటేజీల డిమాండ్స్‌ ఎక్కువైపోవడంతో…. లైసెన్స్ ఉన్నా మద్యం అమ్మకాలు చేయాలంటే హడలిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేరు చెప్పుకుని కొంతమంది ఆయన అనుచరులు, ఇతర ఛోటా లీడర్స్‌ ఎక్కడికక్కడ వైన్స్‌ షాపుల మీదపడి మందు మీది కిక్కు మాది అన్నట్టు వ్యవహరించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారిందట.

Read Also: Off The Record: మింగలేక-కక్కలేక అన్నట్టుగా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి?

అలాగే, నియోజకవర్గంలో ఎక్కడ షాపు పెట్టాలన్నా.. పెట్టిన షాపులు సవ్యంగా నడవాలన్నా స్థానిక నాయకులకు భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి భారీ మామూళ్ల కారణంగా నెల తిరిగేసరికి చేతిలో ఏం మిగలక వైన్స్‌ నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. జిల్లావ్యాప్తంగా వైన్ షాపులు దక్కించుకునేందుకు సిండికేట్ గా ఏర్పడిన కొందరు 300 కి పైగా అప్లికేషన్లు దాఖలు చేశారట.. తీరా లాటరీ తీశాక సిండికేట్ మెంబర్లకు పదిలోపే షాపులు దక్కడంతో… వాళ్ళంతా కలిసి రాజకీయ అండతో… షాపులు దక్కించుకున్న వాళ్ళని దోచేయడమే పనిగా పెట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే బార్‌ ఓనర్లుగా చెప్పుకునే మరి కొంతమంది తమ ప్రాంతాల్లో వైన్ షాప్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయడంతో… సమస్య మరింత పెరిగిందని అంటున్నారు. తణుకు టౌన్‌లోని ఒక ప్రాంతంలో 20 ఏళ్లుగా నడుస్తున్న వైన్ షాపును అక్కడే కొనసాగించాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనని లేదా లైసెన్స్ తమకు అప్పచెప్పాలంటూ సదరు షాపు యజమానికి హుకుం జారీ చేసిందంట MLA అనుచర వర్గంగా చెప్పుకునే గ్యాంగ్. ఎమ్మెల్యేకి అనుచరుడిగా చెప్పుకుంటున్న వ్యక్తికి సంబంధించిన బార్ బిజినెస్ బాగుండాలనే ఉద్దేశంతోనే కొంతమందికి ఎక్సైజ్ అధికారులు సైతం సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో త్వరలోనే సిండికేట్ సభ్యులంతా కలిసి మద్యం రేట్లు పెంచేసి అమ్మాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Read Also: Hydra : పెండింగ్ లో 10వేల ఫిర్యాదులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్

ఇక, వైన్ షాపుల వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఎమ్మెల్యే చెప్పుకొచ్చినా ఆయన అనుచర వర్గం మాత్రం మాట వినడం లేదని తెలుస్తోంది. మొదట్లో పావలా వాటా ఇవ్వాలంటూ పట్టు పట్టిన నేతలు కొంతమంది….. ఇప్పుడు షాపుకి ఇంతని ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మరింత వివాదంగా మారుతోంది. ఎమ్మెల్యే అనుచర వర్గంగా చెప్పుకుంటున్న సిండికేట్ మెంబర్స్ షాపుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత ఎక్సైజ్ అధికారులకు మరికొంత.. తమ జేబులోకి వేసుకుంటున్నారా లేక లోకల్ పాలిటిక్స్ కోసం వాడుతున్నారా అంటూ చర్చించుకుంటున్నారట వైన్ షాప్ ఓనర్స్. మొత్తానికి వైన్ షాపులు విషయమై తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… ఆయన పేరు చెప్పుకుని దండుకునే బ్యాచ్‌ మాత్రం జోరుగా ఉందట. వాళ్ళని కంట్రోల్‌ చేయకుంటే తిరిగి తిరిగి అది ఎమ్మెల్యేకే చుట్టుకుంటున్నది అంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు. దీనిపై అరిమిల్లి ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారో చూడాలి మరి.