దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే బ్యాచ్ చాలామందే ఉంటారు. ముఖ్యంగా పాలిటిక్స్‌లో అయితే… ఈ బాపతు ఇంకాస్త ఎక్కువ. ఎక్కడ… మైలేజ్‌లో మనం వెనుకబడిపోతామోనన్న కంగారులో క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదిబడితే అది మాట్లాడే లీడర్స్‌కు కొదవేలేదు. ఇప్పుడో మాజీ ఎంపీ కూడా అలాగే మాట్లాడి ఇరుక్కుపోయారట. సమాధానం చెప్పండి సార్…అంటూ పోలీసులు వెంటాడుతున్న ఆ మాజీ ఎంపీ ఎవరు? ఏమన్నారాయన?రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు… ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. కాకపోతే…. మనం ఏం మాట్లాడుతున్నామన్న స్పృహ సదరు లీడర్స్‌కు తప్పకుండా ఉండాలి. ఆ సోయి లేకపోతే.. అన్న మాట వెనక్కిరాకపోగా… ఎన్ని సారీలు చెప్పినా చాలా దూరం తీసుకువెళ్తాయి. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారట. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు బలపడుతున్నారు.నియోజకవర్గం మీద తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారాయన. ఈ క్రమంలో ఎమ్మెల్యేని ఇరుకున పెట్టే ఉద్దేశ్యమో, మరొకటోగాని ఆయన మీద తలారి రంగయ్య చేసిన ఆరోపణలు బూమరాంగ్ అయి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. చివరకు పోలీసులు కూడా సార్.. ఏంటి సంగతంటూ ఆయన వెంట తిరుగుతున్నారు. బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామానికి చెందిన బోయ ఆనంద్ ఇటీవల పురుగుల మందు తాగి అనుమానస్పద రీతిలో చనిపోయాడు.
అది ఆత్మహత్యేనని నిర్ధారించారు పోలీసులు. కానీ ఆనంద్ కుటుంబ సభ్యులు మాత్రం ముమ్మాటికీ హత్యేనని వాదిస్తున్నారు. ఇది వరకే పెళ్ళయి విడాకులు తీసుకున్న ఒక మహిళను ప్రేమించిన కారణంగానే ఆమె బంధువులు కక్ష కట్టి ఇలా చేశారన్నది కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ క్రమంలో ఇది పరువు హత్య అన్న వాదన తెరపైకి వచ్చింది. సరిగ్గా ఇక్కడే ఎంటరై ఇరుక్కుపోయారు తలారి రంగయ్య. ఎమ్మెల్యేను టార్గెట్ చేసేందుకు ఇది సరైన ఆయుధం అనుకున్నారో లేక.. బాధితుల పక్షాన నిలబడాలనుకున్నారో తెలియదుగానీ…. ఈ ఎపిసోడ్‌లో బలమైన ఆరోపణలు చేశారు వైసీపీ సమన్వయకర్త. బెంగళూరులో ఉండే ఆనంద్ ఆ మహిళ కోసం రాగానే ఆమె తరపువాళ్ళు బలవంతంగా పురుగుల మందు తాగించి చంపారని ఆరోపించారాయన. ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది. కేవలం ఆ ఆరోపణతో సరిపెట్టకుండా ఆ వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నేతలకు ముడిపెట్టే ప్రయత్నం చేశారన్న అనుమానంతో మేటర్ సీరియస్ అయింది. పరువు హత్య అని మాట్లాడటం ద్వారా… మాజీ ఎంపీ రెండు కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ తీవ్రంగా పరిగణించారు పోలీసులు. పరువు హత్య అని మీరు ఎలా నిర్ధారించారు, అందుకు ఆధారాలు చూపమంటూ తలారి రంగయ్యకు నోటీస్ ఇచ్చారు పోలీసులు. అందుకు ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మరో నోటీసు కూడా ఇచ్చారు. కానీ… రెండోదాన్ని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఇంటి గోడకు అతికించాల్సివచ్చింది. ఈ క్రమంలో… పోలీస్
నోటీసులకు సరైన సమాధానం చెప్పకుండా, ఆధారాలు ఇవ్వకుండా తలారి రంగయ్య తప్పించుకుని తిరుగుతున్నారంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ సమన్వయకర్త పూర్తిగా ఇరుక్కుపోయినట్టయింది. అందుకే ఆయనకు సపోర్ట్‌గా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ని తెచ్చుకున్నారట. అది హత్య అని యువకుడు ఆనంద్ కుటుంబ సభ్యులు ఆరోపించినందునే…తలారి రంగయ్య కూడా ఆ మాట చెప్పారని, ఇందులో ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదంటూ మీడియా సమావేశంలో కవర్ చేసుకోబోయారు మాధవ్. ఆ సంగతి ఎలా ఉన్నా… పరువు హత్య అనడానికి ఆధారాలు చూపండి సార్ అంటూ… పోలీసులు మాత్రం మాజీ ఎంపీని వెంటాడుతూనే ఉన్నారట. వెనకా ముందూ ఆలోచించకుండా ఎవరు ఏది చెబితే అది వినేసి… పొలికల్ మైలేజ్ కోసం పాకులాడి… దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.