ఆ వైసీపీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తే…. ఆయన నియోజకవర్గాన్ని వదిలి విజయవాడలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి హాజరవకూడదనన్న వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆయనకు మింగుడు పడటం లేదా? శాసనసభ్యుడి కదలికల మీద స్వపక్షం, అధికారపక్షం ఓ కన్నేసి ఉంచాయా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్పెషల్ స్టోరీ? రేగం మత్స్యలింగం….అరకు ఎమ్మెల్యే. 2024లో కూటమి దూకుడుని తట్టుకుని వైసీపీ గెలిచిన 11మందిలో ఒకరు. టీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఈయన. గత ఎన్నికలకు ముందు వైసీపీ పరిశీలనలో కూడా లేని మత్స్యలింగం పేరు ఆఖరి నిముషంలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది హైకమాండ్. ఐతే, అంతర్గత రాజకీయ కారణాలతో పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేడర్ రోడ్డెక్కడంతో… చివరికి మనసు మార్చుకుంది వైసీపీ అధిష్టానం. అప్పటి వరకు టిక్కెట్ కోసం పోటీలో వున్న నాయకులు అందరినీ పక్కనబెట్టి ‘మత్స్యలింగం’పేరును ఖరారు చేసింది. ఆదివాసీల ఓట్ బ్యాంక్‌ను ను పటిష్టం చేసుకున్న వైసీపీ…వరుసగా మూడు సార్లు అరకులో గెలిచింది. ఇక ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్ళలో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించిన మత్స్యలింగం తర్వాత తర్వాత దూరం పాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యవహారాల్లో తప్ప పార్టీ పటిష్టతపై అస్సలు ఫోకస్ చేయడం లేదంటున్నారు. ఇటీవల పాడేరులో సీఎం చంద్రబాబు పర్యటన జరిగింది. కీలకమైన జీవోనెంబర్ 3 మీద ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు శ్రేణులతో కలిసి రోడ్డెక్కారు. ఈ నిరసనలకు మద్దతుగా హాజరు కావాల్సిన అరకు ఎమ్మెల్యే మాత్రం కనిపించలేదు. ఇక, మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రకటించిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం పోరాడుతోంది. అధినేత జగన్ దగ్గర నుంచి మండల స్ధాయి నాయకత్వం వరకు అందరూ రోడ్డెక్కుతున్నారు.
అరెస్టులు, హడావిడి నడుస్తోంది. ఈ స్ధాయిలో పార్టీ యాక్టివిటీ జరుగుతుండగా… అరకు ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గానికి దూరంగా… విజయవాడలో మకాం వేశారు. అందుకు తీవ్రమైన కారణాలే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ఎలా ఉన్నా… పార్టీకి కీలకమైన సమయంలో మత్స్యలింగం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్యే కొంత కాలంగా ఊగిసలాటలో ఉన్నట్టు సమాచారం. దీంతో మత్స్యలింగం మనసులో వేరే ఆలోచనలున్నాయా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవకుంటే… చర్యలు వుంటాయని ప్రకటించారు స్పీకర్. దీంతో కీడెంచి మేలెంచడమే కరెక్ట్ అనే భావనతో ఎమ్మెల్యే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అరకు వ్యాలీ మీద పట్టు పెంచుకునేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. పైగా ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ సమయం వుంది. ఇలాంటి లెక్కేసుకునే… ఎమ్మెల్యేగా తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం మత్స్యలింగం ఊగిసలాడుతుండవచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఈ స్పెక్యులేషన్స్ మీద ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ ఆయన అనుచర వర్గం కానీ ఎక్కడా బయట పడలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అరకు వ్యాలీ మీద ఆధిపత్యం సాధించడం అనివార్యమని భావిస్తోంది. ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే సివేకి సోమ కుమారుడు అబ్రహం ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారు. అయినప్పటికీ సంస్దాగతంగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటే పరిస్ధితులు లేవు. పైగా, త్వరలో స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా ఎట్నుంచి ఎటు చూసుకున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేను ఆకర్షించడం టీడీపీకి కీలకమే. ఐతే… అది నంబర్ గేమ్ తప్ప ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం వుండదనే అభిప్రాయం కూడా ఉంది టీడీపీ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో…వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మత్స్యలింగం ఆలోచనలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుందా….?. అన్న చర్చ పెరుగుతోంది. ఇక్కడి పరిస్ధితులను ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయట. దీన్నిబట్టి చూస్తుంటే… మొత్తంగా అరకు వ్యాలీ రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్న చర్చ విస్తృతమైంది.