ఇరకాటంలోపడ్డానని డిసైడైపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అదవుతుందని అనుకుంటూ… అటాకింగ్ మోడ్‌లోకి వచ్చేశారా? పాలిటిక్స్‌లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా ఒంటబట్టిండుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా? తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళని కూడా వాడేస్తున్నాడా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం ఏంటి? మంథని నియోజకవర్గం… గోదావరి తీరాన్ని అనుకుని ఓ మూలన ఉన్నా…పొలిటికల్‌గా ఎప్పుడూ అందరి నోళ్లలో నానుతూ ఉండటం ఈ మంత్రపురి ప్రత్యేకత. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ దుద్దిళ్ళ కుటుంబానికి పెట్టని కోట. నాలుగున్నర దశాబ్దాల్లో పదిసార్లు ఎన్నికలు జరిగితే… రెండు సార్లు మాత్రమే ఇక్కడ ఇతరులు గెలిచారు. మంత్రి శ్రీధర్ బాబు ఒకసారి, ఆయన తండ్రి శ్రీపాదరావు ఒకసారి మాత్రమే ఓడిపోయారు. అలాంటి చోట ఇప్పుడు ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో శ్రీధర్‌బాబును ఓడించారు బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధుకర్. ఇద్దరి మధ్య గత దశాబ్దం నుంచి పోరు నడుస్తోంది. ఒక్కసారి గెలిచిన పుట్టాపై ఆ నాలుగున్నరేళ్లలో అనేక ఆరోపణలు వచ్చాయి. అందులో ప్రధానమైనది న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వారిని దారుణంగా చంపేశారు దుండగులు. ఈ కేసులో పుట్టా మధుకర్ మేనల్లుడు బిట్టు శ్రీను నిందితుడు. దీంతో ఈ హత్య వెనక అప్పటి ఎమ్మెల్యే మధుకర్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తూ…హతుడి తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్డుకు వెళ్లారు. హత్య చేసినట్టు ఆరోపణలున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళంతా ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్నారు.. అయితే… చేయించింది మాత్రం పుట్టా మధు దంపతులేనని, స్థానిక పోలీసులు వారిని కేసు నుంచి తప్పించారని ఆరోపిస్తున్నారు కిషన్ రావు. దీంతో లాయర్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది సుప్రీం కోర్ట్. ఆ మేరకు తాజాగా సీబీఐ ఎంట్రీతో మంథని పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. సీబీఐ దర్యాప్తు మొదలవగానే…. ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట మాజీ ఎమ్మెల్యే మధుకర్. ఓవైపు సీబీఐ కేసు లోతుల్లోకి వెళ్తుంటే… మరోవైపు మాజీ ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. గత ఏడాదిన్నరగా నెలకోసారి ప్రెస్‌మీట్… అప్పుడప్పుడు అలా బయట కనిపించడం తప్ప పెద్దగా క్రియాశీలకంగా లేని మధు… ఇప్పుడు సీబీఐ కేసు వల్ల బయటకు రాక తప్పలేదట… ఇప్పుడు ఇంటికే పరిమితం అవ్వడం అంత మంచిది కాదని, యాక్టివ్ అయితేనే ఫలితం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే గత నెల రోజులుగా నియోజకవర్గంలో వరుసబెట్టి తిరుగుతున్నారట. చర్చంతా తన చుట్టే జరుగుతున్న క్రమంలో కాస్తంత మసాలా జోడిస్తే… రేపు ఎటుపోయి ఎటొచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బహుజన నినాదం అందుకున్న పుట్టా…తాజాగా అంబేద్కర్ విగ్రహావిష్కరణను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. పెంచికల్పేట్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తాము ఆవిష్కరించడానికంటే ముందే… రాత్రికి రాత్రే కాంగ్రెస్ వారు ఆవిష్కరించారంటూ ఫైర్ అయ్యారాయన. తాను ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన… ఈసారి తాము అధికారంలోకి వస్తే… మంత్రి శ్రీధర్ బాబు తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలను తొలగిస్తామని ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా శ్రీపాదరావు మీద పరుష పదజాలం వాడుతూ పలు విమర్శలు చేశారు. దీన్ని సహించలేని కాంగ్రెస్ నేతలు మధుకర్ క్షమాపణ చెప్పాలంటూ ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఇక్కడి నుంచి మేటర్ మరో మలుపు తిరిగింది. ఎంత అధికారం ఉంటే మాత్రం… మాజీ ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి వస్తారా అంటూ బీఆర్ఎస్ రివర్స్‌లో నిరసనలు చేపట్టింది. దాంతో ఒక్కసారిగా మంథని రాజకీయం విగ్రహాల చుట్టూ తిరగడం మొదలైపోయింది.మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేయడం కోసమే అంబేద్కర్ విగ్రహాన్ని మధు వాడేశారని, దానికి కాంగ్రెస్ నేతలు స్పందించడంతో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకుంటున్నారు. సీబీఐ విచారణ క్రమంలో…ఢిఫెన్స్లో పడ్డ మధు… తన శ్రేణులలో చలనం తీసుకువచ్చేందుకు దీన్ని వాడుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు పరిశీలకులు. దుద్దిళ్ల కుటుంబమే టార్గెట్‌గా మంత్రిని, ఆయన తండ్రిని, ఆయన సోదరుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, విగ్రహాలు తొలగిస్తామని చేసిన ప్రకటనలు సహజంగానే హస్తం పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తాయి… విగ్రహాల విషయం వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు నిగ్రహం కోల్పోతారని ఊహించే పుట్టా మధు తుట్టెను కదిలించినట్టు అంచనా వేస్తున్నారు. వాళ్ళు ఏ స్టెప్ వేసినా తనకు అనుకూలంగా మలుచుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చని, పనిలో పనిగా అనుచరులను యాక్టివేట్ చేయవచ్చన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. ఓ వైపు సీబీఐ దూకుడుగా ఉండటంతో… తన ప్యూచర్ ఏంటో అర్ధంకావడం వల్లే మాజీ ఎమ్మెల్యే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నది లోకల్ టాక్. మంథని పాలిటిక్స్ ముందు ముందు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.