సాధారణంగా… సమ్మర్ హీట్‌లో సైతం కూల్‌కూల్‌గా కనిపించే ఆ కేంద్ర మంత్రి ఇప్పుడు ఇంత చలికాలంలోనూ ఎందుకు గరం గరంగా మారిపోయారు? ఓ జిల్లాకు జిల్లా పార్టీ నేతలు మొత్తాన్ని నిలబెట్టి కడిగేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జిల్లా నాయకులు ఒకటి తలిస్తే… సెంట్రల్ మినిస్టర్ మరోటి అనుకున్నారా? ఎవరా మంత్రి? ఏ జిల్లా నాయకులతో ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నారు? నల్లగొండ జిల్లా కమలం నేతలకు ఓ రేంజ్‌లో క్లాస్‌లు పడ్డాయట. సాధారణంగా ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే ఓ రేంజ్‌లో ఫైరైపోయి… జిల్లా లీడర్స్‌ని ఏకిపారేసినట్టు తెలిసింది. ఆ దెబ్బకు జిల్లా పార్టీ నాయకులు నోరెళ్ళబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ… కిషన్‌రెడ్డికి అంత కోపం ఎందుకొచ్చిందంటే… పంచాయతీ పోరులో మనం ఎక్కడున్నామని అడిగితే… జిల్లా నేతల లైట్ ఆన్సర్సే కారణం అంటున్నారు. నల్లగొండ జిల్లా బీజేపీ ఆఫీస్‌లో పార్టీ ఇంచర్నల్ మీటింగ్ జరిగింది. సమావేశం ప్రారంభంలోనే ఊకదంపుడు ఉపన్యాసాలకు బ్రేక్ వేసిన కిషన్‌రెడ్డి… పంచాయతీ ఎన్నికల్లో మనం ఎక్కడున్నామంటూ… మండలాల వారీగా ఆరా తీయడం మొదలుపెట్టారట. ఏదో… హైదరాబాద్ నుంచి వస్తారు, నచ్చిన నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతారని భావించిన జిల్లా నేతలు ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్నారట. అస్సలు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యేసరికి నోటికొచ్చింది చెప్పిన వాళ్ళు కొందరైతే…. ఏం చెప్పాలో అర్ధంగాక నోరు మెదపలేని స్థితిలో ఉన్నది మరికొందరు. దాంతో కిషన్‌రెడ్డికి చిర్రెత్తుకొచ్చి కడిగిపారేశారట.
మనం ఎక్కడెక్కడ బరిలోకి దిగాం… గెలిచే గ్రామాలు ఎన్ని.. రెండవ స్థానంలో ఉండే ఊళ్ళు ఏవి? ఒకవేళ పోటీ చేయకపోతే ఎందుకు చేయలేదు… గ్రామాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏం అనుకుంటున్నారంటూ…. అంటూ వరుస ప్రశ్నలతో మండల కేడర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారట కేంద్రమంత్రి. ఎట్నుంచీ సరైన ఆన్సర్ రాకపోవడంతో… మండల స్థాయి నేతలు అక్కడి పార్టీ పరిస్థితి వివరించలేకపోతే ఎలాగంటూ… సీరియస్ అయిపోయినట్టు సమాచారం. ఎటూ పాలుపోని స్థితిలో నియోజకవర్గ స్థాయి నాయకులు జోక్యం చేసుకుని ఏదో సర్దిచెప్పబోయినా… కిషన్‌రెడ్డి వారిని అడిగిన ప్రశ్నలకు అట్నుంచి కూడా సమాధానం కరవైందట. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్దులు అత్యల్పంగా ఉండటం, మరికొన్ని చోట్ల బీజేపీ అసలు పోటీలో ఉందా లేదా అన్నట్టుగా తయారవడంతో ఎందుకు పోటీ చేయలేకపోయామని కిషన్‌రెడ్డి సూటిగా అడిగిన ప్రశ్నకు జిల్లా నాయకులు ఎవరి దగ్గరా సమాధానమే లేకుండా పోయిందని అంటున్నారు. అంతేకాదు… పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పోటీకి దిగకపోవడంపై గట్టిగా క్లాస్ పీకారట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే అవకాశం ఉన్నా… కీలక ఎన్నికల్లో జిల్లా నాయకత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ తీవ్రంగా ఆక్షేపించారట ఆయన.
అవకాశం ఉన్న సందర్భంలోనూ… క్యాడర్, లీడర్లు పనిచేయడం లేదని… పనిచేయించాల్సిన నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో పాటు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, ముఖ్యంగా గ్రూపులు, క్యాస్ట్ ఈక్వేషన్స్.. తలనొప్పిగా మారాయనే అభిప్రాయం వ్యక్తం నల్గొండ బీజేపీలో. పనిచేసే వాళ్ల కంటే… వాళ్ళకు అడ్డంపడే వాళ్ళ సంఖ్య పెరిగిందని… చేయి చేయి కలిపి క్యాడర్‌ను ముందుకు నడిపించే నేతలు కరువయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అయిందట మీటింగ్‌లో. అయితే… ఇక్కడే పార్టీ పెద్దల వైఖరిని ఆక్షేపిస్తున్నారు లోకల్ లీడర్స్. పంచాయితీ బరిలోకి దిగండి.. ఖర్చు మేము భరిస్తామని పార్టీ అధిష్టానం భరోసా ఇచ్చి ఉండి ఉంటే…పరిస్థితి మరోలా ఉండేదన్నది వాళ్ళ వాదన. చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులేవీ చేయకుండా…ఇప్పుడొచ్చి మా మీద ఎగిరితే ప్రయోజనం ఏంటన్నది వాళ్ళ ప్రశ్న. మొత్తంగా కేంద్రమంత్రి జిల్లా పర్యటన సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో సాఫీగా ముగుస్తుందని భావించిన నేతలకు కిషన్ రెడ్డి షాక్ ఇవ్వడంపై కమలం పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇది పెద్ద రచ్చకు కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో. కేంద్రమంత్రి ఆగ్రహంతోనైనా నల్లగొండ జిల్లా కమలంలో కనువిప్పు కలుగుతుందా… నేతలకు తత్వం బోధపడుతుందా అంటే…అంతా దైవేచ్ఛ అంటూ చేతులు పైకి చూపిస్తున్నారు లోకల్ లీడర్స్.