Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు పిలిచినా ఉలకడం లేదు, పలకడం లేదా? ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలతో పనేంటని అంటున్నారా? నా యాపారాలు నన్ను చేసుకోనివ్వండి, నాలుగేళ్లు నన్ను వదిలేయండి ప్లీజ్ అంటున్నారా? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామన్నది ఆయనగారి ఆలోచనా? ఒక్క ఓటమితోనే దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందంటున్న ఆ పార్ట్ టైం పొలిటీషియన్ ఎవరు? ఏంటాయన కాడి పడేసిన కథ?
పొన్నాడ సతీష్ కుమార్… ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారాయన. ఎన్నికల సమయంలో కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇక ఓటమి తర్వాత తన వల్ల కాదంటూ కాడిపడేశారు. ప్రపంచంలో ఎవ్వరూ ఓడిపోనట్టు… తానొక్కడినే ఓడిపోయినట్టు… నాకే ఎందుకిలా అంటూ తెల ఫీలైపోతున్నారట పొన్నాడ. అందుకే నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. సాధారణంగా ఎప్పుడూ అమలాపురంలో ఉండే సతీష్… ఇప్పుడు మకాం హైదరాబాద్ మార్చేశారట.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుకునే పనిలో పడ్డట్టు సమాచారం. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి…. ఏంటి సార్ పరిస్థితి అంటే…. నేను చాలా బిజీగా ఉన్నాను, మీ పనేదో మీరు చూసుకోండి. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు అంటూ క్లారిటీగా కుండబద్దలు కొట్టేస్తున్నారట.
అయితే, అసలు మనకు నియోజకవర్గంలో పనేముందని మెట్ట వేదాంతం చెప్తున్నారన్న సెటైర్స్ పడుతున్నాయి. రాజకీయాలు మాట్లాడే సమయం చాలా ఉందని కూడా ఓ మాటేస్తున్నారట. టైం బాలేనప్పుడు అన్నిటీకీ దూరంగా ఉండడమే బెటర్ అని గుర్తు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక… ద్వితీయ శ్రేణి నేతలు దిక్కులు చూస్తున్నారట ముమ్మిడివరం వైసీపీలో. కొందరైతే… ఈయనెక్కడి లీడర్ రా.. బాబూ అంటూ నెత్తికొట్టుకుంటున్నారట. అధికారం ఉన్నప్పుడు పదవి అనుభవించడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని నడిపించాలికదా….. అన్న ప్రశ్నకు మాత్రం అక్కడ సమాధానం లేదంటున్నారు. మాజీ ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్న వ్యాపారాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించేసినట్టు తెలిసింది. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినా..సీరియస్‌గా తీసుకోవడం లేదట. అసలు ఎక్కువ శాతం నియోజకవర్గానికి రాకుండా ఉండటానికే పొన్నాడ సతీష్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. వచ్చినప్పుడు గ్రామాల్లో పరిస్థితుల గురించి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా చల్లగా జారుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే.
ఇక, సమయం, సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలే అని సుతి మెత్తగా విషయాన్ని ఎండ్ చేసేస్తున్నారట. దీంతో సతీష్ ని నమ్ముకుని రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని సొంత కేడరే అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకేం బాబూ… పదవి అనుభవించాడు ఇప్పుడు కనీసం స్పందించడం లేదు.. ఎటొచ్చీ… ఎటూ కాకుండా పోయింది మేమేనంటూ ముఖ్య అనుచరులు సైతం నిష్టూరాలాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, మాజీ ఎమ్మెల్యేకి మాత్రం ఇవేమీ పట్టడం లేదని గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇంకొందరైతే… కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని అనుకుంటూ…సైలెంట్‌గా సైడైపోతున్నట్టు సమాచారం.పార్టీ కోసం పని చేయమంటే చేస్తాం గానీ… అసలు నాయకుడికే సంబంధం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. సతీష్ మాత్రం… నేనింతే… ఇక మీ ఇష్టం అని అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో ముమ్మడివరంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని అంటున్నారు. ఐదేళ్లు హ్యాపీగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు మాత్రం.. ఇది వ్యాపారం సమయం అంటూ భాగ్యనగరంలో సెటిల్ అయిపోతే ఎలాగన్నది కేడర్ క్వశ్చన్. ఆయనకు ఉన్నన్ని ఆప్షన్స్ మాకు లేవు కదా అని క్యాడర్ డీలా పడిపోతోందట. దీనిమీద ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.